చిన్నంపేటలో పులి సంచారం?
ABN, Publish Date - Mar 25 , 2025 | 12:50 AM
చాట్రాయి మండలం చిన్నంపేటలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో రైతులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.

భయాందోళనలో గ్రామస్థులు
చాట్రాయి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): చాట్రాయి మండలం చిన్నంపేటలో పులి సంచరిస్తున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో రైతులు, ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చిన్నంపేట నుంచి పోతనపల్లి వెళ్లే దారిలో గిన్నెల చెరువు వద్ద తనకు పులి కన్పించినట్టు ఓ వ్యక్తి గ్రామంలోకి వచ్చి చెప్పడంతో జనం ఉలిక్కి పడ్డారు. పులి భయంతో సోమవారం రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలలోకి వెళ్లకుండా ఇళ్ల వద్దనే ఉండిపోయారు. సోమవారం సాయంత్రం గ్రామంలోని యువకులు బృందంగా పులి సంచరించినట్టు చెబుతున్న ప్రాంతానికి వెళ్ళి పరిశీలించగా పెద్ద పెద్ద పాదముద్రలు కన్పించాయి. అవి పులి పాదముద్రలేనని నమ్ముతున్నారు. చిన్నంపేట కో–ఆపరేటివ్ ఫారమ్ కాలనీకి చెందిన కొంతమంది యువకులు సోమవారం రాత్రి బహిర్భూమికి వెళ్లగా వారికి పులి కన్పించిందని యువకులు భయంతో గ్రామంలో పరిగెత్తుకు వచ్చి చెప్పినట్టు తెలిసింది. ఎస్‌ఐ రామకృష్ణ సిబ్బందితో కలిసి చిన్నంపేట వెళ్ళి అక్కడ పోలీస్ నైట్‌బీట్ ఏర్పాటు చేశారు. గ్రామస్థుల నుంచి వివరాలు అడిగితెలుసు కున్నారు. అటవీశాఖ అధికారులు సిబ్బంది చిన్నంపేట వస్తున్నట్టు సమాచారం.
Updated Date - Mar 25 , 2025 | 12:50 AM