Tirupati tragedy : తిరుపతి విషాదంలో అడుగడుగునా నిర్లక్ష్యం
ABN, Publish Date - Jan 10 , 2025 | 05:15 AM
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని బదిలీ చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే
కలెక్టర్, ఎస్పీతో ముందస్తుగా సమావేశం కాని టీటీడీ అధికారులు
అదనపు ఈవో పేరిట కలెక్టర్‌కు లేఖతో సరి
ప్రత్యేక దృష్టిపెట్టని రెవెన్యూ, పోలీసులు
రద్దీకనుగుణంగా నియంత్రణ చర్యల్లేవు
టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ అలసత్వం
వైఫల్యానికి పూర్తిస్థాయి బాధ్యులెవరో?
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ కేంద్రాల వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇద్దరిపై సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని బదిలీ చేశారు. ప్రాథమిక సమాచారం మేరకు చర్యలు తీసుకున్నారు. అయితే పూర్తిస్థాయిలో వైఫల్యానికి బాధ్యులెవరన్నది తేలాల్సి ఉంది. టీటీడీ అధికారుల తీరుపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టీటీడీ పది రోజుల పాటు తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శన టోకెన్లు జారీ చేస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో ముందస్తు సమావేశం నిర్వహించకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. తిరుపతిలో ఎనిమిది ప్రాంతాల్లో టోకెన్ల జారీ కేంద్రాలు ఏర్పాటు చేసి 90 కౌంటర్ల ద్వారా భక్తులకు టోకెన్లు జారీ చేసే క్రమంలో అనేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్, శాంతి భద్రతలు, ప్రమాదాల నివారణ, అత్యవసర సర్వీసులకు సంబంధించిన ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. టీటీడీ పాలనాధికారి ఈవో కాకుండా తిరుమల అదనపు ఈవో పేరిట ఏర్పాట్ల కోసం కలెక్టర్‌కు లేఖ అందింది. కలెక్టర్ యథాప్రకారం పోలీసు బందోబస్తు కోసం ఎస్పీకి.. వైద్య సిబ్బందిని, అంబులెన్సులను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారికి.. అగ్నిమాపక ఏర్పాట్ల కోసం ఆ శాఖ జిల్లా అధికారికి ఆదేశాలు జారీ చేశారు. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద పర్యవేక్షణకు వివిధ మండలాల తహశీల్దార్లను నియమించారు.
యథాప్రకారం జరిగే కార్యక్రమాలుగా భావించి టీటీడీ, జిల్లా అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించలేదు. రెవెన్యూ పరంగా ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ హోదా గల తహశీల్దార్లు టోకెన్ల జారీ కేంద్రాల వద్ద అప్రమత్తంగా ఉండాలి. భక్తుల రద్దీని గమనిస్తూ పరిస్థితి తీవ్రతను బట్టి పైఅధికారులకు సమాచారం ఇచ్చి అప్రమత్తం చేయాలి. అయితే బుధవారం నాటి ఘటనల్లో తహశీల్దార్లు అవేమీ చేయలేదు. పోలీసు అధికారులదీ అదే తీరుగా కనిపించింది. రద్దీ పెరిగే కొద్దీ పైఅధికారులకు సమాచారం ఇచ్చి అదనపు బలగాలను రప్పించుకోవడం చేయలేదు. ఇక టోకెన్ జారీ కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన 50 సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి టీటీడీ ఉన్నతాధికారులు, విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలించే అవకాశముంది. అయితే ఆచరణలో అలా జరిగినట్టు కనిపించలేదు. భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారమిచ్చేందుకు మైక్ అండ్ సౌండ్ సిస్టమ్ అందుబాటులో లేదు. టోకెన్ల జారీకి ఎంత సమయం పడుతుందో చెబితే భక్తులు నిరీక్షించేవారు. బైరాగిపట్టెడ వద్ద పార్కులో అలాంటి సదుపాయం లేనందునే అస్వస్థతకు లోనైన మహిళ కోసం గేటు తీస్తే టోకెన్ల కోసం గేటు తీశారని భావించిన భక్తులు ముందుకు చొచ్చుకొచ్చేశారు. దాంతో ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరిగింది.
Updated Date - Jan 10 , 2025 | 05:15 AM