Tirumala Tirupati Devasthanam: ప్రధాన అర్చకుడిగా నియమించాలని ఆదేశించలేం
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:01 AM
శ్రీవారి ప్రధాన అర్చకుడిగా తనను నియమించాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. బదిలీని దురుద్దేశంతో చేసినట్టు నిరూపించలేకపోవడంతో, పిటిషన్ సమర్థించదగ్గది కాదని న్యాయస్థానం పేర్కొంది.

ఫలానా ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని హక్కుగా కోరలేరు
బదిలీచేసే అధికారం టీటీడీదే
అర్చకుడు శ్రీనివాస దీక్షితులు పిటిషన్‌పై హైకోర్టు వ్యాఖ్యలు
వ్యాజ్యాన్ని కొట్టేసిన న్యాయమూర్తి
అమరావతి, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో శ్రీవారి ప్రధాన అర్చకుడిగా తనను నియమించేలా టీటీడీ ఈవోను ఆదేశించాలని కోరుతూ అర్చకుడు శ్రీనివాస దీక్షితులు వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. పరిపాలనా సౌలభ్యం కోసం చేసే బదిలీలకు సంబంధించిన కేసులలో న్యాయస్థానాల సమీక్ష పరిధి పరిమితమని స్పష్టం చేసింది. ఫలానా ప్రాంతంలో పోస్టింగ్ ఇవ్వాలని పిటిషనర్ హక్కుగా కోరలేరని తేల్చి చెప్పింది. పరిపాలన అవసరాలకు అనుగుణంగా బదిలీలపై నిర్ణయం తీసుకొనే అధికారం యజమానికే ఉంటుందని తెలిపింది. బదిలీని దురుద్దేశంతో ఏకపక్షంగా చేసినట్టు నిరూపించకపోతే న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేవని పేర్కొంది. ఈ నేపథ్యంలో వ్యాజ్యాన్ని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ మండవ కిరణ్మయి ఇటీవల తీర్పు ఇచ్చారు. తనను శ్రీవారి ప్రధాన అర్చకుడిగా నియమించాలని కోరుతూ ఇచ్చిన వినతిని ఈవో తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస దీక్షితులు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈయన తిరుపతిలోని గోవిందరాజ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా ఉన్నారు. C
అయితే.. తాను పెద్దింటి కుటుంబానికి చెందిన అర్చకుడినని, తమ కుటుంబానికి చెందినవారికి ఐదేళ్లుగా శ్రీవారి ఆలయంలో ప్రధాన అర్చకుడిగా చేసేందుకు అవకాశం లభించలేదని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. టీటీడీ ఈవో కౌంటర్ దాఖలు చేస్తూ.. ఫలానా చోట పోస్టింగ్ ఇవ్వాలని కోరే హక్కు పిటిషనర్ కోరలేరని తెలిపారు. తిరుమలలో అర్చకుడిగా చేస్తున్న పిటిషనర్‌కు తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిగా నియమించామన్నారు. మూడు నెలల్లోనే శ్రీవారి దేవస్థానంలో పోస్టింగ్ కోరుతూ వినతిపత్రం సమర్పించారని, అర్చకులకు ఉన్న అనుభవం, దేవస్థానాలలో అవసరాలకు అనుగుణంగా పెద్దింటివారి, తిరుపతమ్మవారి, గొల్లపల్లివారి, పైడిపల్లివారి కుటుంబాలకు చెందిన అర్చకులను ఆయా దేవాలయాల్లో నియమిస్తామని వివరించారు. ఈ వివరాలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని.. వ్యాజ్యాన్ని కొట్టివేశారు.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:02 AM