TTD: ఐదేళ్లూ అక్రమాలే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 03:29 AM
టీటీడీ ఈవో శ్యామలరావు తీవ్ర ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అవినీతి పాలన రాజ్యమేలిందని తెలిపారు. గోశాలలో దాణా కుంభకోణం, ప్రసాదాల కల్తీ, లక్షలాది లీటర్ల పాల అక్రమాలు చోటుచేసుకున్నాయని, టీటీడీ ఐటీ వ్యవస్థను దళారీలు యంత్రించారని వివరించారు. ఈ అక్రమాలపై ప్రస్తుతం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

తిరుమలను భ్రష్టుపట్టించారు
గోవుల మరణాలను దాచేశారు
జీవాలకు పురుగుల దాణా పెట్టారు
టెండర్లలో అక్రమాలకు పాల్పడ్డారు
విజిలెన్స్ అధికారులను రానివ్వలేదు
నెయ్యి సహా పాలనూ కల్తీ చేసేశారు
సేంద్రియ ఉత్పత్తుల్లో దండుకున్నారు
ఐటీ విభాగాన్ని దళారులకు ఇచ్చేశారు
అర్హతలేని వ్యక్తికి జీఎం పదవి
నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి
ప్రస్తుతం గోవుల మరణాలను తగ్గిస్తున్నాం
ఫార్ములా ‘హెచ్‌ఎన్’ పౌడర్ వాడుతున్నాం
వాస్తవాలను భూమన వక్రీకరిస్తున్నారు
టీటీడీ ఈవో శ్యామలరావు మండిపాటు
తిరుపతి(కల్చరల్), ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లూ తిరుమలలో అక్రమాలు, అవినీతే రాజ్యమేలాయని టీటీడీ ఈవో జె.శ్యామలరావు నిప్పులు చెరిగారు. తిరుమలను భ్రష్టుపట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారికి నివేదించే ప్రసాదాల నుంచి భక్తులకు అందించే అన్న ప్రసాదాల వరకూ కల్తీకి పాల్పడ్డారన్నారు. ఇక, గోశాల గురించి ఎంత చెప్పినా తక్కువేనని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలోనే తిరుపతిలోని గోశాలలో అక్రమాలు, అవినీతి చోటు చేసుకున్నాయని ఉద్ఘాటించారు. 2021-24 మధ్య కాలంలో గోశాలను ఆర్థిక వనరుగా మార్చుకున్నారని, మూగజీవాలైన గోవులకు పెట్టే దాణాలోనూ సొమ్ములు నొక్కేశారని, పురుగులు పట్టిన దాణాను పెట్టారని తెలిపారు. భారీ సంఖ్యలో గోవులు చనిపోయినా.. ఆనాడు వివరాలు వెల్లడించకుండా, మూడో కంటికి తెలియకుండా దాచేశారని చెప్పారు. కనీసం విజిలెన్స్ అధికారులను కూడా గోశాలలోకి రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. ‘లడ్డూ నెయ్యి నుంచి పాల వరకు అన్నీ కల్తీ చేశారు.’’ అని వ్యాఖ్యానించారు. కాగా, నేడు అవాస్తలను ప్రచారం చేస్తూ.. వాస్తవాలను వక్రీకరిస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రచారం చేస్తున్నారని నిప్పు లు చెరిగారు. గోవుల మరణాలకు సంబంధించి భూమన చేసిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. గోవుల సహజ మరణాలను రాజకీయాలకు వాడుకోవడం సరైంది కాదన్నారు. 2021-24 మధ్య ఒక్క గోశాలలోనే కాకుండా.. టీటీడీలోని అనేక విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరిగాయని, అవన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయన్నారు. సోమవారం తిరుపతిలో శ్యామలరావు మీడియాతో మాట్లాడారు. గత 10 నెల ల్లో సాధారణ భక్తుల ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం చేశామన్నారు.
గోశాలను సొంతమనుకున్నారు!
టీటీడీ గోశాలను 2021-24 మధ్య కొందరు తమ సొంతమనుకున్నారని, అనేక అవకతవకలు, అక్రమాలకు పాల్పడ్డారని ఈవో శ్యామలరావు వ్యాఖ్యానించారు. ఆ నాలుగేళ్లలో విజిలెన్స్ నివేదికలు, వీడియోలు, ఫొటోలు టీటీడీ రికార్డుల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మరణించిన గోవుల వివరాలు దాచి పెట్టడమే కాకుండా.. గోశాల నిర్వహణను గాలికి వదిలేశారని దుయ్యబట్టారు.
దీంతో గోశాల నిర్వహణ దారుణంగా ఉండేదన్నారు. పురుగులు పట్టిన దాణా పెట్టడమే కాకుండా, లేబుల్ కూడా లేని మందుల కొనుగోళ్లు, కాలం చెల్లిన మందుల వాడకం, దాణా కొనుగోళ్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గత ప్రభుత్వంలో విజిలెన్స్ అధికారులను కూడా గోశాలలోకి అనుమతించలేదు. వారు ఫొటోలు, వీడియోలు తీయకుండా అడ్డుకున్నారు. విజిలెన్స్ నివేదికల్లో ఇవన్నీ ఉన్నాయి.’’ అని శ్యామలరావు తెలిపారు. అగ్నిప్రమాదాలు, పైపులైన్లు కాలిపోవడం వంటి ఘటనల్లో కూడా నష్టాన్ని అధికంగా చూపించారన్నారు. ఆవులు లేని కమలయ్యగారిపల్లె గోశాలకు తిరుపతి గోశాలతో కలిపి దాణా సరఫరాకు టెండర్లు పిలిచి అక్రమాలకు పాల్పడ్డారని.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. విజిలెన్స్ నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోలేదని, తాము వచ్చిన తర్వాత వాటిపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
మనోభావాలు దెబ్బతీయకండి
హిందువుల మనోభావాలను, టీటీడీ ఉద్యోగుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా భూమన కరుణాకర్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఈవో శ్యామలరావు అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. 2024 మార్చిలో వైష్ణవి డెయిరీకి 14 లక్షల లీటర్ల పాలను సరఫరా చేయడానికి గత పాలకమండలి అనుమతి ఇచ్చిందని, అయితే తాము ఆ పాలలో నాణ్యత లేదని గుర్తించి రద్దు చేశామన్నారు. కరుణాకర్‌రెడ్డికి గోశాల మీద అంత ప్రేమ ఉంటే అలా ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఈ ఏడాది తొలి మూడు నెలల్లో 43 గోవులు మాత్రమే మృతి చెందాయని వెల్లడించారు. ఎక్కడో మృతి చెందిన గోవులను టీటీడీ గోశాలలో మృతిచెందినట్లు చెప్పడం భావ్యం కాదన్నారు. గోశాలలో 2022 నుంచి భర్తీ చేయని 135 పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి టికెట్లు, వసతి వంటివి ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవాలన్నా పలువురు భక్తులు దళారీలను ఆశ్రయించే పరిస్థితి గతంలో ఉండేదని ఈవో శ్యామలరావు చెప్పారు. సాధారణ ఇంజనీరింగ్ అధికారి 30 ఏళ్లుపైన పనిచేస్తే చీఫ్ ఇంజినీరు అవుతారని, ఐటీ విభాగం జీఎం పోస్టుకు అలాంటి అర్హత కలిగిన అధికారి ఉండాల్సి ఉందన్నారు. గతంలో ఐటీ జీఎం పోస్టు కోసం నోటిఫికేషన్ ఇస్తే 69 దరఖాస్తులు వచ్చాయని, అందులో ఇద్దరిని ఎంపిక చేస్తే ఒకరు ఇంటర్వ్యూకి రానందున మిగిలిన వ్యక్తిని జీఎంగా నియమించారన్నారు. అధికారులు వద్దన్నా కూడా బోర్డు నిర్ణయం పేరిట అర్హత లేని వ్యక్తిని జీఎంగా నియమించారన్నారు. దీంతో ఒక దళారీ 50 సార్లు సేవా టికెట్లను బుక్ చేసుకున్నారని, ఇంకొక దళారీ 200 వసతి సేవలు పొందారన్నారు. మరొకరు 500 ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు పొందారని.. ఈ విధంగా టీటీడీ ఐటీ వ్యవస్థ మొత్తం దళారీల చేతుల్లోకి వెళ్లిపోయిందన్నారు. తాజాగా సుమారు 30 వేల మంది దళారీలను బ్లాక్ చేయడంతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. ఇప్పుడా అధికారిని తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
‘సేంద్రీయం’గా దోచేశారు!
శ్రీవారి అన్నప్రసాదాల విషయంలో నాణ్యత లేని బియ్యం, తక్కువ పరిమాణంలో పంపిణీ వంటివి గుర్తించామని ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. 2021-24 మధ్య కేజీ రూ.600 ఉండే నెయ్యికి రూ.2000 చొప్పున, రూ.50 బియ్యానికి రూ.90, రూ.60 ఉండే బెల్లం కోసం రూ.120.. ఇలా ఇష్టానుసారం ధరలు నిర్ణయించి దోచేశారని ఆరోపించారు. కేవలం రూ.3 కోట్ల విలువైన విరాళాలు తీసుకుని రూ.25 కోట్ల విలువైన దాతల పాస్ పుస్తకాలను విడుదల చేశారని వివరించారు. వాటన్నింటినీ గుర్తించి రద్దు చేశామన్నారు.
ఆవు నెయ్యిలో యానిమల్ ఫ్యాట్, వెజిటేబుల్ ఫ్యాట్ కలిసిందని ఎన్‌డీడీబీ నుంచి నాలుగు రిపోర్టులు రావడంతో ఏఆర్ డెయిరీని బ్లాక్ లిస్టులో పెట్టామని ఈవో శ్యామలరావు వెల్లడించారు. ఏఆర్ డెయిరీ స్వయంగా నెయ్యి సరఫరా చేయలేక వైష్ణవి డెయిరీని ఆశ్రయిస్తే ఆ డెయిరీ బోలేబాబా డెయిరీ నుంచి నెయ్యి సేకరించిందన్నారు. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోందని, ఇద్దరు టీటీడీ అధికారులను విచారించాల్సి ఉందని, సిట్ అనుమతి కోరిందన్నారు. దీనికి త్వరలో అనుమతి ఇస్తామన్నారు. రూ.320కి స్వచ్ఛమైన లీటరు ఆవు నెయ్యి ఎలా వస్తుందని ఈవో ప్రశ్నించారు. కనీసం బయటకు పంపి అయిన పరీక్షలు చేయకుండా రివర్స్ టెండర్ విధానంలో రూ.320 ధరతో కాంట్రాక్టు కేటాయించడం వల్లే కల్తీ జరిగిందన్నారు. శ్రీవారి లడ్డూ ప్రసాదాలకు తాము స్వచ్ఛమైన నందిని నెయ్యిని వినియోగిస్తున్నామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..
PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..