Share News

Unpredictable Weather: అకాల.. కలవరం

ABN , Publish Date - Apr 15 , 2025 | 04:51 AM

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం అసాధారణంగా మారుతోంది, వేడైన ఎండలు, పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్ల వర్షాలతో రైతులు, కూలీలు, పశువులు సాయం లేకుండా వధించడం జరుగుతోంది. గ్లోబల్‌ వార్మింగ్‌తో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఎండలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో నౌకాస్టు విధానంలో హెచ్చరికలు జారీచేస్తున్నా, పరిస్థితి మెరుగవడం లేదు.

Unpredictable Weather: అకాల.. కలవరం

అనూహ్యంగా మారిపోతున్న వాతావరణం

(విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి)

చైత్రమాసం ప్రారంభానికి ముందు నుంచే మాడుపగిలే ఎండలు కాస్తున్నాయి. ఇదే సమయంలో నిమిషాల వ్యవధిలో కారుమబ్బులు కమ్ముకుని ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములు పిడుగులతో ఒక్కసారిగా వాతావరణం మారిపోతోంది. ఆరుబయట ప్రధానంగా పొలాల్లో పనిచేసే కూలీలు, రైతులు, పశువులు, కాపరులు పిడుగులకు మృత్యువాత పడుతున్నారు. అనూహ్యంగా మారిపోతున్న వాతావరణతో పంట నష్టంతో పాటు ప్రాణ నష్టం వాటిల్లుతోంది. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. అసాధారణ వాతావరణ మార్పులపై అందుబాటులోకి వచ్చిన ‘నౌకాస్టు’ విధానంలో హెచ్చరికలు జారీచేస్తున్నా ఉపశమనం లభించడం లేదు. సాధారణంగా మే నెలలో ఎండ తీవ్రతకు వాతావరణ అనిశ్చితి నెలకొని ఈదురుగాలులు వీస్తుంటాయి. పిడుగులుతో వడగళ్ల వానలు కురుస్తుంటాయి. అటువంటిది గ్లోబల్‌ వార్మింగ్‌ ప్రభావంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే అసాధారణంగా ఎండలు పెరిగి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత నెలలో దేశంలో అనేకచోట్ల 40 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అదే తీవ్రత రోజుల తరబడి కొనసాగుతూనే ఉంది. వచ్చే నెలలో కొన్నిచోట్ల 50 డిగ్రీల మార్కుకు ఉష్ణోగ్రతలు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వచ్చే నెలలో కురిసే అకాల వర్షాలు మరింత కలవరపెడతాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఓఎ్‌సఆర్‌యూ భానుకుమార్‌ హెచ్చరించారు. రైతులకు మరింత మెరుగైన టెక్నాలజీతో సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు.


క్యుములోనింబస్‌ మేఘాలు, పిడుగులు

వేసవి తీవ్రత పెరిగేకొద్దీ పొడిగాలి ఒత్తిడితో తడిగాలి పైకి లేచి క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయి. భూఉపరితలం నుంచి మేఘాలు పైకి వెళ్లే కొద్దీ దాంట్లో ఉష్ణోగ్రతలు తగ్గి.. ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత మైనస్‌ డిగ్రీలు ఉంటుంది. దీంతో మేఘాల్లో మంచు గడ్డలు ఏర్పడతాయి. అలా 12 నుంచి 13 కిలోమీటర్లు ఎత్తు వరకు మేఘాల్లో మైనస్‌ 80 డిగ్రీలు ఉంటుంది. ఆరు కిలోమీటర్లు దాటిన తరువాత మంచు గడ్డల వల్ల మేఘాల బరువు పెరిగి, 12 నుంచి 13 కి.మీ.కు వెళ్లేసరికి బరువు భరించలేక ఆ మేఘాలు విచ్ఛన్నమవుతాయి. దీనినే క్లౌడ్‌ బరస్ట్‌ అంటారు. ఆ క్షణాల్లో ప్రచండ వేగంతో గాలులు వీస్తాయి. అప్పుడే కళ్లు మిరుమిట్లు గొలిపేలా మెరుపులు, ఉరుములు సంభవిస్తాయి. పిడుగులు పడతాయి. ఇదంతా ఐదు నిమిషాలకు అటుఇటుగా ముగిసి భారీ వర్షం ప్రారంభమవుతుంది పైనున్న మంచుగడ్డలు కింద పడేటప్పుడు కొన్ని కరిగిపోగా మిగిలినవి వడగళ్లుగా భూమిపై పడతాయి. అంత వేగంగా జరిగే ప్రక్రియలో ప్రతిదీ అత్యంత వేగంగానూ, ప్రమాదకరంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ప్రస్తుతం ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా మేఘాల తీవ్రతను గుర్తిస్తున్నారు. క్యుములోనింబస్‌ మేఘాలు ఉధృతంగా ఉన్నప్పుడు ప్రజలు ఆరుబయట సంచరించవద్దని హెచ్చరికలు చేస్తున్నారు. దీనికి సంబంధించి భారత వాతావరణ శాఖ నౌకాస్టు విధానం కొంతకాలం క్రితమే అందుబాటులోకి తెచ్చింది. దేశంలో ఏఏ ప్రాంతాల్లో ప్రతిరోజు పిడుగులు, ఈదురుగాలులు, వడగళ్లవానలు పడతాయన్నది ఉపగ్రహ ఛాయాచిత్రం ద్వారా తెలుసుకుని వెంటనే రాష్ట్రాలవిపత్తుల నిర్వహణ సం స్థకు పంపిస్తారు. సమాచారం అందుకున్న కొద్ది నిమిషాల్లో ప్రజల సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు వెళుతున్నాయి.


ఎండ, వాన తీవ్రత పెరుగుతుంది

ఆచార్య భానుకుమార్‌, ఏయూ వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు

గత నెల నుంచే పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. వచ్చే నెలలో కొన్నిచోట్ల గరిష్ఠ ఉష్ణోగ్రత 50 డిగ్రీల మార్కు దాటుతుంది. గాలిలో కార్బన్‌ డయాక్సైడ్‌, మిథేన్‌, తేమశాతం పెరగడంతో వాతావరణంలో అసాధారణ మార్పులు వచ్చాయి. దీంతో ఎండలు పెరగడం, మధ్యాహ్నం నుంచి మేఘాలు కమ్ముకుని వానలు భారీ విధ్వంసం సృష్టించడం జరుగుతోంది. భవిష్యత్తులో అకాల వర్షాలు, పెనుగాలుల విధ్వంసం పెరిగే అవకాశం ఉన్నందున రైతులకు మరింత మెరుగైన టెక్నాలజీతో సమాచారం అందించేందుకు ప్రభుత్వం రూ. 2 వేల కోట్లతో రాడార్లు ఏర్పాటు చేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:51 AM