Andhra Pradesh Farmers: అకాల వర్షాలతో రైతన్నకు నష్టం
ABN, Publish Date - Apr 05 , 2025 | 03:46 AM
అకాల వర్షాలతో రాష్ట్రంలోని రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. మామిడి, అరటి, ధాన్యం, మొక్కజొన్న వంటి పంటలు దెబ్బతిని, లక్షలాది రూపాయల నష్టం జరిగింది.

మండువేసవిలో గాలివాన
దెబ్బతిన్న మామిడి, అరటి తోటలు
వరి, మొక్కజొన్న పంటలకూ నష్టం
అనంతపురం జిల్లాలో 2.15 కోట్ల నష్టం
విజయవాడ పరిసరాల్లోనూ వానదెబ్బ
మరో 3 రోజులు వర్షసూచన
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను కుదేలు చేశాయి. గురువారం రాత్రి, శుక్రవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడ మామిడికాయలు గాలివానకు రాలిపోగా, అరటితోటలు నేలకొరిగాయి. కోతకు వచ్చిన వరి, మొక్కజొన్నతో పాటు కర్బూజ, దోస, చీనీ, కళింగర వంటి పంటలు దెబ్బతిన్నాయి. ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. అనంతపురం జిల్లాలో రైతులకు రూ.2.15 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. విజయవాడ చుట్టు పక్కల ప్రాంతాల్లో మామిడి, అరటి పంటలు దెబ్బతిన్నాయి. గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రాష్ట్రవ్యాప్తంగా 12 ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. 23 ప్రాంతాల్లో 50 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. నంద్యాల జిల్లా మద్దూరు, ప్రకాశం జిల్లా రాళ్లపల్లిలో అత్యధికంగా 111.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. కడప జిల్లా కలసపాడులో 110.7, నంద్యాల జిల్లా పెరుసోమలలో 107, శ్రీసత్యసాయి జిల్లా కొండకమర్లలో 101 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. సముద్రాల నుంచి వచ్చే తేమగాలులు, వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలుల కలయికతో వాతావరణ అనిశ్చితి నెలకొంది. మరోవైపు మన్యం జిల్లా జియ్యమ్మవలసలో 39.9 డిగ్రీలు, తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరంలో 39.2 డిగ్రీలు, శ్రీకాకుళం జిల్లా కొల్లివలసలో 39.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అనంతలో భారీ నష్టం
అనంతపురం జిల్లాలో గాలివానకు రూ.2.15 కోట్లకుపైగా విలువైన పంటలు దెబ్బతిన్నాయి. తాడిపత్రి, యల్లనూరు, గార్లదిన్నె, కంబదూరు, శింగనమల, బుక్కరాయసముద్రం, ఆత్మకూరు, అనంతపురం రూరల్, పెద్దవడుగూరు, కూడేరు, పెద్దపప్పూరు మండలాల్లో 55 మంది రైతులకు చెందిన 60.77 హెక్టార్లల్లో రూ.1.24 కోట్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో అరటి, కర్బూజ, చీనీ, కళింగర పంటలు ఉన్నాయి. శెట్టూరు, నార్పల, గార్లదిన్నె, అనంతపురం రూరల్ మండలాల్లో 71 మంది రైతులకు సంబంధించి 114 హెక్టార్లల్లో రూ.91.84 లక్షల విలువైన మొక్కజొన్న, వరి పంట నష్టం జరిగింది. జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా శింగనమలలో 70.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. తాడిపత్రి, అనంతపురం మండలాల్లో 48.4, కంబదూరులో 42.4, గార్లదిన్నెలో 39.4, రాప్తాడులో 32.4, పుట్లూరులో 32.0, ఆత్మకూరులో 30.4, యాడికిలో 30.0 మి.మీ. వర్షపాతం నమోదైంది.
విజయవాడలో విస్తారంగా
విజయవాడతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. విజయవాడ నగరంలో రహదారులపై నీరు నిలిచిపోయింది. అకాల వర్షం నగరాన్ని ముద్ద చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో పంటలకు నష్టం చేకూర్చింది. విజయవాడ రూరల్ మండలంలో నష్టం ఎక్కువగా జరిగింది. అసలే పూత ఆలస్యం కావడంతో మామిడి రైతులు ఆందోళనలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కాయలు దశకు తోటలు చేరుకున్నాయి. గాలివానకు రూరల్ మండలంలో 50 ఎకరాల్లో తోటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యానవన శాఖ అధికారులు నిర్ధారించారు. పది శాతం మామిడికాయలు గాలివానకు రాలిపోయాయి. జిల్లాలో అక్కడక్కడ గెలలు ఉన్న అరటి చెట్లు నేలపై పడటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు. రూరల్ మండలంలో ఆరబెట్టిన 1000 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసి ముద్దయింది. జి.కొండూరు మండలంలో మిర్చి రైతులకు స్వల్ప నష్టం వాటిల్లింది. కొన్ని చోట్ల మిర్చి కల్లాల్లో తడిసిపోయింది.
అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు
రానున్న మూడు రోజులు అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శనివారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఆదివారం ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల, కాకినాడ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు వర్షాలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇవి కూడా చదవండి
Borugadda Anil: రాజమండ్రి నుంచి అనంతపురానికి బోరుగడ్డ.. ఎందుకంటే
Kasireddy shock AP High Court: లిక్కర్ స్కాంలో కసిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ
Read Latest AP News And Telugu News
Updated Date - Apr 05 , 2025 | 03:46 AM