Tirumala Stampede: గేట్లు ఒక్కసారిగా ఎందుకు తీశారు
ABN, Publish Date - Apr 03 , 2025 | 05:24 AM
తిరుమల వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం భక్తులను పద్మావతి పార్క్‌కు తరలించడంపై విచారణ కమిషన్ ప్రశ్నలు వేసింది. సస్పెండైన డీఎస్పీ రమణకుమార్ తన తప్పేమీ లేదని చెప్పగా, టీటీడీ లాయర్లు వీడియో ఆధారాలు చూపించారు.

ఎవరు చెబితే భక్తులను పార్కులోకి పంపారు?
‘తొక్కిసలాట’ ఘటనలో సస్పెండైన డీఎస్పీపై కమిషన్ ప్రశ్నల వర్షం
తిరుపతి కలెక్టరేట్, ఏప్రిల్ 2(ఆంధ్రజ్యోతి): ‘శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం వచ్చిన భక్తులను బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కులోకి పంపాలని ఎవరు ఆదేశించారు?. ఆ నిర్ణయం టీటీడీదా లేదా పోలీసు శాఖదా? అక్కడ విధుల్లో ఉన్నది మీరేగా.. అప్పుడేం జరిగిందో చెప్పండి’ అని ‘తొక్కిసలాట’ ఘటనలో సస్పెండైన డీఎస్పీ రమణకుమార్‌ను విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ సత్యనారాయణమూర్తి ప్రశ్నించారు. జనవరి 8న జరిగిన తొక్కిసలాట ఘటనపై కలెక్టరేట్ వేదికగా బుధవారం నాలుగో దశ విచారణ జరిగింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ‘అంతమంది భక్తులు పార్కులో ఉన్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా గేట్లు ఎందుకు తెరిచారు?. తెరవాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని జస్టిస్ సత్యనారాయణమూర్తి అప్పటి డీఎస్పీని ప్రశ్నించారు. భక్తులను పార్కులోకి అనుమతించింది తాను కాదని ఆయన చెప్పారు. దీంతో టీటీడీ తరపు లాయర్లు.. ఆనాటి ఘటనకు సంబంధించిన వీడియో చూపిస్తూ... ‘ఇందులో గేటు వద్ద ఉన్నది మీరే కదా?’ అని ప్రశ్నించారు. ఓ భక్తురాలు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గేటు తీయాల్సి వచ్చిందని రమణకుమార్ చెప్పారు. సుమారు రెండు గంటలపాటు రమణకుమార్‌ను కమిషన్ విచారించగా, న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఘటనకు సంబంధించిన రికార్డులు ఇవ్వడానికి టీటీడీ గడువు కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు. ఈ విచారణలో పూర్వపు సీవీఎస్వో శ్రీధర్, ఎస్వీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డి పాల్గొన్నారు. బుధవారంతో నాలుగో దశ విచారణ ముగించుకుని కమిషన్ చైర్మన్ సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్లారు.
ఇవి కూడా చదవండి:
FD Comparison: ఎస్బీఐ vs యాక్సిస్ బ్యాంక్.. వీటిలో ఏ FD బెస్ట్, దేనిలో ఎక్కువ వస్తుంది..
Samsung: శాంసంగ్ ఏసీల్లో సరికొత్త టెక్నాలజీ..స్మార్ట్ థింగ్స్ కనెక్షన్ సహా అనేక సౌకర్యాలు..
Updated Date - Apr 03 , 2025 | 05:24 AM