విదేశీ ఉద్యోగాల పేరిట వల

ABN, Publish Date - Feb 10 , 2025 | 01:03 AM

జీవితంలో స్థిరపడాలంటే విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని చాలామంది భావిస్తుంటారు.

విదేశీ ఉద్యోగాల పేరిట వల
  • నిరుద్యోగులను ముంచేస్తున్న ఏజెన్సీలు

  • వెల్డింగ్‌, ఫైర్‌ సేఫ్టీల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగం కల్పిస్తామంటూ ప్రకటనలు

  • రూ.లక్షల్లో వసూలు

  • విజిటింగ్‌ వీసాలపై దుబాయ్‌ తరలింపు

  • అక్కడకు వెళ్లగానే పాస్‌పోర్ట్‌లు స్వాధీనం

  • పరీక్షల పేరుతో డ్రామా

  • అక్రమ వలసదారులుగా నానా ఇబ్బందులు పడుతున్న యువకులు

  • నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్న ఏజెన్సీలు

  • 50 వరకూ ఉన్నట్టు పోలీసుల అంచనా

  • ఏయూ అధ్యాపకులతో అధ్యయనానికి

  • పోలీస్‌ కమిషనర్‌ నిర్ణయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవితంలో స్థిరపడాలంటే విదేశాలకు వెళ్లి ఉద్యోగం చేయాలని చాలామంది భావిస్తుంటారు. విద్యార్థతలు లేనివారు సైతం ఏదో ఒక దేశానికి వెళ్లాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారి ఆశలను కొంతమంది ఏజెంట్లు సొమ్ము చేసుకుంటున్నారు. విదేశాల్లో ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. విజిటింగ్‌ వీసాలపై విదేశాలకు పంపించి ముఖం చాటేస్తున్నారు.

విదేశాల్లో ఉద్యోగాలంటూ కొంతమంది ఏజెన్సీలు పెట్టి నిరుద్యోగులను దోచుకుంటున్నారు. దుబాయ్‌, సింగపూర్‌ వంటిచోట్ల వెల్డింగ్‌, ఫైర్‌ సేఫ్టీల్లో ఉద్యోగాలు ఉన్నాయని, తమ ఇనిస్టిట్యూట్‌లో చేరితే ఆయా రంగాల్లో తగిన శిక్షణ ఇచ్చి, విదేశాల్లో అవకాశాలు కల్పిస్తామంటూ నమ్మబలుకుతున్నారు. విశాఖపట్నం నగరంలో ఇలాంటి ఇనిస్టిట్యూట్‌లు సుమారు 50 ఉండగా, అందులో 40 వరకూ గాజువాక, మల్కాపురం, ఆటోనగర్‌, మిగిలినవి ద్వారకానగర్‌, సిరిపురం, మర్రిపాలెం వంటి ప్రాంతాల్లో ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లి ఐదేళ్లపాటు బాగా సంపాదించుకుని వచ్చేస్తే...ఇక్కడ ఏదో పని చేసుకుని కుటుంబంతో గడిపేయవచ్చునని ఆశపడుతున్నవారంతా ఇలాంటి ఏజెన్సీల వలలో చిక్కుకుంటున్నారు. ఏజెన్సీలు/ఏజెంట్లు చెప్పినట్టు వారి ఇనిస్టిట్యూట్‌లో చేరి వెల్డింగ్‌, ఫైర్‌ సేఫ్టీ వంటి రంగాల్లో శిక్షణ తీసుకుంటున్నారు. వెనుకాముందు ఆలోచించకుండా వారు అడిగినంత డబ్బు చెల్లిస్తున్నారు.

తీరా అక్కడకు వెళ్లిన తర్వాత ఏదో ఒక కారణం చూపి...అనుకున్న ఉద్యోగానికి ఎంపిక కాలేదని చెప్పి, హౌస్‌ కీపింగ్‌, హెల్పర్‌ వంటి పనులు చేయాలని ఆదేశిస్తున్నారు. తప్పదనుకున్నవారు విజిటింగ్‌ వీసాలపైనే దొంగచాటుగా ఏదో ఒకపని చేసుకుని కాలం వెళ్లదీస్తున్నారు. తాము తిరిగి ఇండియా వెళ్లిపోతామని ఎవరైనా అంటే మాత్రం వారిని అక్కడే వదిలేసి ఏజెంట్లు చేతులు దులిపేసుకుంటున్నారు. తర్వాత వారు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా స్పందించరు. విదేశాల్లో వీసా లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి కావడంతో వారిపై అక్కడ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు కూడా బాధితులకు అవకాశం ఉండడం లేదు.

గాజువాకకు చెందిన ఒక ఏజెన్సీ షార్జాలో వెల్డర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ గత ఏడాది అక్టోబరులో ప్రకటన ఇచ్చింది. దానిని చూసి పెదగంట్యాడ ప్రాంతానికి చెందిన గెద్దాడ లోకేశ్‌తోపాటు అనకాపల్లి జిల్లాకు చెందిన పొలుపర్తి లక్ష్మణరావు, గార రాజేశ్‌, పైలా రామస్వామి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన కాళ్ల వెంకటరావులు ఆ ఏజెన్సీని సంప్రతించారు. అందుకు కావాల్సిన శిక్షణ ఇవ్వడంతోపాటు విమాన టికెట్లు, వీసా కల్పించే బాధ్యత తమదేనంటూ నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.రెండు లక్షల నుంచి రూ.మూడు లక్షలు వసూలు చేసింది. అనంతరం వారికి గాజువాక ఆటోనగర్‌లో వెల్డింగ్‌లో శిక్షణ ఇప్పించింది. గత ఏడాది డిసెంబరులో వారిని విజిటింగ్‌ వీసా మీద షార్జా పంపించారు. షార్జా ఎయిర్‌పోర్టులో తమ ఏజెంట్‌ వచ్చి రిసీవ్‌ చేసుకుంటారని వారికి చెప్పారు. అక్కడ ఎయిర్‌పోర్టులో దిగగానే వారిని ఒక ఏజెంట్‌ రిసీవ్‌ చేసుకున్నారు. ఉద్యోగం రావాలంటే కంపెనీ పరీక్ష పెడుతుందని, అందులో పాస్‌ అయితేనే వెల్డర్‌ ఉద్యోగం వస్తుందని చెప్పారు. అక్కడ ఏదో పరీక్ష పెట్టి ఫెయిలైనందున హెల్పర్‌ ఉద్యోగాలు చేయాలని చెప్పారు. అందుకు ఐదుగురు యువకులు అంగీకరించకపోవడంతో...అయితే తిరిగి వెళ్లిపోవచ్చునన్నారు. తమ పాస్‌పోర్ట్‌లు ఇచ్చేసి, టిక్కెట్‌ ఇస్తే వెళ్లిపోతామని చెప్పగా, వారం రోజులు ఉంటే వీసా, టికెట్‌లు ఇస్తామని చెప్పి...ఏజెంట్‌ వెళ్లిపోయారు. ఇరవై రోజులు గడిచినా అక్కడ ఏజెంట్‌ రాకపోవడం, గాజువాకలోని ఏజెన్సీకి ఫోన్‌ చేస్తే స్పందించకపోవడంతో ఐదుగురు యువకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు సీపీ శంఖబ్రతబాగ్చికి వాట్సాప్‌ కాల్‌ చేసి తమ పరిస్థితి వివరించడంతో సీపీ చొరవ తీసుకుని, వారిని పంపించిన ఏజెన్సీ ప్రతినిధులను గుర్తించారు. వారితోనే షార్జా నుంచి ఇండియాకు విమానం టికెట్లు తీయించి ఐదుగురు యువకులను గత నెల 22న నగరానికి తీసుకొచ్చారు. ఇలా ఎంతోమంది విదేశాల్లో ఉద్యోగాలనే ఆశతో వెళ్లి అక్కడ అక్రమ వలసదారులుగా బందీలుగా ఉండిపోతున్నారు.

అన్నీ పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి

సీపీ శంఖబ్రతబాగ్చి

విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా చెబితే అన్నివిధాలుగా పరిశీలించుకోవాలి. ఏజెన్సీలు, ఏజెంట్లతోపాటు వారు చెప్పే కంపెనీలకు సంబంధించిన వివరాలు, ప్రభుత్వ అనుమతులు వంటివాటి కోసం ప్రభుత్వ పోర్టల్‌లో తనిఖీచేయాలి. ఆయా సంస్థలు, ఏజెన్సీల ద్వారా గతంలో ఎవరైనా వెళ్లి ఉద్యోగాలు చేస్తుంటే వారితోపాటు వారి కుటుంబసభ్యులతో కూడా ఆయా సంస్థల గురించి ఆరా తీయాలి. ఏమాత్రం అనుమానం కలిగినా, ప్రభుత్వ గుర్తింపులేని ఏజెన్సీ అని తేలినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నగరంలో ఈ తరహా మోసాలు పెరుగుతుండడంతో ఏయూలోని అధ్యాపకులతో ఒక కమిటీ వేసి ఏజెన్సీలపై అధ్యయనం చేయించాలని యోచిస్తున్నాం.

Updated Date - Feb 10 , 2025 | 01:03 AM