అరకు కాఫీకి మరింత ఖ్యాతి
ABN, Publish Date - Mar 26 , 2025 | 12:57 AM
ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే మన్యం కాఫీకిఇ ‘అరకు కాఫీ’ పేరిట బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ఇప్పటికే శాసనసభ, పార్లమెంటు ఆవరణల్లో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
కలెక్టర్ల సదస్సులో ‘అరకు కాఫీ’ని ప్రత్యేకంగా ప్రస్తావించిన సీఎం చంద్రబాబునాయుడు
ఇప్పటికే శాసనసభ, పార్లమెంటు ప్రాంగణాల్లో అరకు కాఫీ స్టాళ్లు
ఏజెన్సీలో కొత్తగా లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి పదేళ్ల క్రితమే ప్రణాళిక
రూ.526 కోట్లతో ‘కాఫీ ప్రాజెక్టు’ ఏర్పాటు
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
ఏజెన్సీలో గిరిజన రైతులు పండించే మన్యం కాఫీకిఇ ‘అరకు కాఫీ’ పేరిట బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నది. ఇప్పటికే శాసనసభ, పార్లమెంటు ఆవరణల్లో అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేయగా, తాజాగా మంగళవారం రాష్ట్ర సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకు కాఫీ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక శ్రద్ధ కనబరిస్తే ఎటువంటి ఉత్పత్తికైనా ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావచ్చునని, ఇందుకు అరకు కాఫీ ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అరకు కాఫీ అభివృద్ధితోపాటు దానిని ప్రపంచ వ్యాప్తంగా ప్రమోట్ చేశామని, తాజాగా పార్లమెంట్ ఆవరణలో సైతం కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేసి మరోమారు దేశం అంతా చర్చించుకునేలా చేశామని సీఎం పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి చోటా అరకు కాఫీని ప్రస్తావిస్తూ దాని ఖ్యాతిని పెంచేందుకు చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రత్యేక కృషిని మన్యం వాసులు అభినందిస్తున్నారు.
శాసనసభ, పార్లమెంట్ ఆవరణల్లో అరకు కాఫీ స్టాళ్లు
అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌ను మరింతగా పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చట్టసభల్లో సైతం కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నది. ఇందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్ర శాసనసభ ఆవరణలో అరకు కాఫీ స్టాల్‌ను ఏర్పాటు చేయగా, స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ప్రారంభించారు. సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే ఈ నెల 24న పార్లమెంటు ఆవరణలో రెండుచోట్ల అరకు కాఫీ స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీటిని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్‌గోయల్ ప్రారంభించారు.
కాఫీ సాగు విస్తరణకు చంద్రబాబు కృషి
మన్యంలో కాఫీ సాగును పెంచడానికి సీఎం చంద్రబాబునాయుడు పదేళ్ల క్రితమే ప్రాజెక్టును ప్రకటించారు. 2014లో సంభవించిన హుద్‌హుద్ తుఫాన్‌కు పాడేరు, అనంతగిరి, తదితర మండలాల్లో కాఫీ తోటలు భారీగా ధ్వంసమయ్యాయి. దీంతో కాఫీ రైతులను ఆదుకోవడంతోపాటు ఏజెన్సీలో కాఫీ తోటలను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టారు. 2015 నుంచి 2025 వరకు లక్ష ఎకరాల్లో కాఫీ తోటల అభివృద్ధికి నాడు రూ.526 కోట్లతో ఒక ప్రాజెక్టును మంజూరు చేశారు. లక్ష్యం మేరకు లక్ష ఎకరాల్లో కొత్తగా కాఫీ తోటలు వేశారు. ఇదిలా ఉండగా 2016లోనే చంద్రబాబునాయుడు మన్యం కాఫీని ‘అరకు కాఫీ’గా ప్రపంచానికి పరిచయం చేసి ప్రమోట్ చేశారు. అదే ఏడాది దేశ ప్రధాని మోదీతోపాటు అనేక మంది ప్రముఖులతో అరకు కాఫీని తాగించారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అరకు కాఫీకి మరింత ప్రాచుర్యం లభించింది.
Updated Date - Mar 26 , 2025 | 12:57 AM