నామినేటెడ్ పదవులకు ఆశావహుల ప్రయత్నాలు
ABN, Publish Date - Jan 17 , 2025 | 02:06 AM
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.

పార్టీల అధిష్ఠానానికి కూటమి నేతల బయోడేటాలు
తమకు అవకాశం కల్పించాలని పలువురి వినతి
ఉమ్మడి జిల్లాస్థాయిలో డీసీసీబీ, డీసీఎంఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవులపై పలువురి కన్ను
రేసులో గవిరెడ్డి, కాశినాయుడు, భవానీ, బాలాజీ, ముత్యాలపాప, జనసేన రాజు
రెండు, మూడు రోజుల్లో జాబితా విడుదల అవుతుందని ప్రచారం
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
నామినేటెడ్ పదవులు ఆశిస్తున్న కూటమి నేతలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఇప్పటికే రెండు విడతల్లో నామినేటెడ్ పదవులు భర్తీ చేసిన చేసిన విషయం తెలిసిందే. మూడో విడత పదవుల పంపకానికి పార్టీల పెద్దలు కసరత్తు చేస్తున్న నేపథ్యంలో ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల టీడీపీ అధిష్ఠానం పలువురు నాయకులకు టికెట్లు ఇవ్వలేకపోయింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నామినేటెడ్ పదవులు ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇవ్వడంతో వారంతా పోటీ నుంచి వైదొలిగి కూటమి అభ్యర్థుల గెలుపుకోసం పనిచేశారు. దీంతో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబుకు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, ఎలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావుకు రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, టీడీపీ మాడుగుల ఇన్‌చార్జి పీవీజీ కుమార్‌కు వెలమ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్, అనకాపల్లికి చెందిన మళ్ల సురేంద్రకు గవర సంక్షేమ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు లభించాయి. అయితే టీడీపీతోపాటు కూటమిలోని జనసేన, బీజేపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలో మూడో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్టు యువనేత నారా లోకేశ్ చెప్పడంతో ఆశావహుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. రాష్ట్రస్థాయితోపాటు ఉమ్మడి జిల్లాస్థాయిలో డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ల పదవులను ఆశిస్తున్నారు.
పెరుగుతున్న ఆశావహులు
మూడో విడత నామినేటెడ్ పదవులను ఒకటి, రెండు రోజుల్లో భర్తీ చేసే అవకాశం ఉందని సంకేతాలు వెలువడడంతో కూటమి పార్టీల్లో రోజుకో కొత్త పేరు తెరపైకి వస్తున్నది. పలువురు నాయకులు తమ బయోడేటా (పార్టీలో ఎంత కాలం నుంచి వుంటున్నది, ఏయే పదవులు నిర్వహించింది, సామాజిక వర్గం, పార్టీకి చేసిన సేవలు.. వగైరా)ను పార్టీ అధిష్ఠానానికి పంపుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గవిరెడ్డి రామానాయుడు, బోళెం ముత్యాలపాప, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ లాలం భవానీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ, జిల్లా ప్రధాన కార్యదర్శి లాలం కాశినాయుడు.. డీసీసీబీ, డీసీఎంస్, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవుల్లో ఏదో ఒకటి దక్కుతుందన్న ఆశతో వున్నారు. మూడో విడత నామినేటెడ్ పదవుల భర్తీలో తమకు అవకాశం ఇవ్వాలని ఇప్పటికే అధిష్ఠానాన్ని కోరినట్టు తెలిసింది. కాగా కూటమిలో భాగమైన జనసేన పార్టీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులను ఆశిస్తున్నారు. చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు తనకు నామినేటెడ్ పదవి కేటాయించాలని ఇటీవల పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ను కలిసి కోరినట్టు సమాచారం.
Updated Date - Jan 17 , 2025 | 02:06 AM