అందాల జలపాతం.. ఆదమరిస్తే ప్రమాదం
ABN , Publish Date - Apr 14 , 2025 | 11:11 PM
మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జీనబాడు పంచాయతీ సరియా జలపాతానికి దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ జలపాతంపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

పదేళ్లలో సరియాలో 40 మందికి పైగా మృతి
ఇందులో యువతే అధికం
ఈతకు దిగి ప్రాణాలు కోల్పోతున్న వైనం
అనంతగిరి, ఏప్రిల్ 14 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన జీనబాడు పంచాయతీ సరియా జలపాతానికి దూర ప్రాంతాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ జలపాతంపై అవగాహన లేక ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. గత పదేళ్లలో 40 మందికి పైగా ఇక్కడ మృతి చెందారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పోలీసులు అవగాహన కల్పిస్తున్నా కొందరు పట్టించుకోకుండా ఈతకు దిగడం, సెల్ఫీల మోజులో పడి పరిసరాలను గమనించకపోవడంతో మృత్యువాత పడుతున్నారు.
అనంతగిరి మండలంలోని సరియా జలపాతం 2015లో బాహ్యప్రపంచానికి పరిచయమైంది. ఇది అనతికాలంలోనే పర్యాటక ప్రాంతంగా పేరొందింది. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పర్యాటకులు సరియా జలపాతాన్ని తిలకించేందుకు భారీగా తరలి వస్తుంటారు. 2015- 25 మధ్య కాలంలో 40 మందికి పైగా పర్యాటకులు మృతి చెందారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో పోలీసు అధికారులు స్పందించి అధికంగా ప్రమాదాలు జరుగుతున్న మొదటి స్టెప్ డేంజర్ పాయింట్ జలపాతం వద్ద పర్యాటకులు వెళ్లకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా పర్యాటకులు దిగి, గల్లంతు కావడానికి కారణమవుతున్న బండరాళ్ల సొరంగాలను మూసివేసి, ప్రమాదాలకు కారణంగా ఉన్న బండరాళ్లను బ్లాస్టింగ్ ద్వారా తొలగించారు. దీంతో పాటు హెచ్చరిక బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. గత రెండున్నరేళ్లుగా ఎటువంటి ప్రమాదాలు జరగలేదు. అలాగే రెండవ స్టెప్ వద్ద ప్రమాదాలు జరుగుతుండడంతో వలంటీర్లను అందుబాటులో ఉంచారు. బండరాళ్లపై డేంజర్ అని రాయించారు.
ఇక్కడ జరిగిన కొన్ని ప్రమాదాలు
- 2015లో కోటవురట్ల మండలం కె.వెంకటాపురం గ్రామానికి చెందిన పంచర్ల నాని(19), విశాఖ వాంబే కాలనీకి చెందిన ఆకాశ్ హేమసుందర్(22) రాయిపై కూర్చొని సరదాగా గడుపుతుండగా ఇద్దరూ ప్రమాదవశాత్తూ జారిపడి నీటమునిగి మృతి చెందారు. 2015 నుంచి 2021 వరకు సుమారు 30 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.
- 2024 సెప్టెంబరు 14న సరియా బహుబలి జలపాతం వద్ద విజయనగరం బాబామెట్టకు చెందిన సాయికుమార్ జారిపడి మునిగిపోతుండగా, అదే సమయంలోని అక్కడే ఉన్న విశాఖపట్నం నేవీకి చెందిన దిలీప్‌కుమార్ కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే ఇద్దరూ మృతి చెందారు.
2025 ఏప్రిల్ 13న పూర్ణామార్కెట్ పండావీధికి చెందిన ఇలా వాసు(23), రెల్లివీధి ఏవీఎన్ కళాశాల ప్రాంతానికి చెందిన వడ్డాది సత్యనరసింహమూర్తి మొదటి స్టెప్, రెండవ స్టెప్‌నకు మధ్యలో గల 40 అడుగుల లోతుగా ఉన్న ప్రదేశంలో ప్రమాదవశాత్తూ జారిపడి మృతి చెందారు.