Share News

రక్తపోటు, మధుమేహం

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:34 AM

జిల్లాలో రక్తపోటు, మధుమేహ(షుగర్‌) బాధితులు క్రమంగా పెరుగుతున్నారు.

రక్తపోటు, మధుమేహం

  • జిల్లాలో క్రమంగా పెరుగుతున్న బాధితులు

  • 10 రకాల వ్యాధులపై ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌’ సర్వే

  • జిల్లాలో 18 ఏళ్లు పైబడిన వారు 13,75,235 మంది ఇంతవరకు 9,02,775 మందికి స్ర్కీనింగ్‌ పూర్తి

  • 94,152 మంది బీపీ, 61,954 మంది షుగర్‌ బాధితులు

  • క్యాన్సర్‌ పీడితులు 489, క్షయతో బాధితులు 2,345 మంది

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో రక్తపోటు, మధుమేహ(షుగర్‌) బాధితులు క్రమంగా పెరుగుతున్నారు. దీంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది నవంబరు 14న ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌’ సర్వే ప్రారంభించింది. ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులకు మూలాలు, వాటి వెనుక ఉన్న కారణాలు తెలుసుకొని నివారణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. ప్రధానంగా గుండె, మూత్రపిండాలు, శ్వాస సంబంఽధ వ్యాధులు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధి, మధుమేహం, రక్తపోటు బాధితులు నానాటికీ పెరిగిపోతున్నారు. ఆయా వ్యాధులు, సమస్యలపై సర్వే నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రజల ఆహారపు అలవాట్లు, జీవన విధానం కారణంగా వ్యాధులబారిన పడుతున్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. అనారోగ్యం బారినపడిన తరువాత చికిత్స అందించడం కంటే, వ్యాధులబారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటే చాలా వరకు వ్యాధులను నియంత్రించవచ్చని అభిప్రాయపడుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకొని 10 రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యలపై సర్వే చేస్తోంది. ఆరోగ్య శాఖ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సుమారు 120 ప్రశ్నల ద్వారా ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి ప్రభుత్వ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల వరకు పూర్తయిన సర్వే వివరాలను జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదిక ప్రకారం మధుమేహం, రక్తపోటు బాధితులు అధికంగా వున్నట్టు వెల్లడైంది.

జిల్లాలో 54 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) పరిధిలో 18 ఏళ్లు పైబడిన వారు 13,75,235 మంది వున్నారు. వీరిలో ఇప్పటి వరకు 9,02,775 మందికి (65.65 శాతం) స్ర్కీనింగ్‌ పూర్తి చేశారు. మిగిలిన 4,72,460 మందికి స్ర్కీనింగ్‌ సర్వే కొనసాగుతున్నది. ఇప్పటి వరకు పూర్తయిన స్ర్కీనింగ్‌ వివరాల ప్రకారం 94,152 మంది రక్తపోటు(బీపీ)తో బాధపడుతున్నారు. సర్వే నిర్వహించిన వారిలో సుమారు 10.43 శాతం మంది వున్నారు. వీరిలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది వున్నారు. ఇక జిల్లాలో 61,954 మంది (6.86 శాతం) మధుమేహ బాధితులు వున్నారు. 30 సంవత్సరాలు దాటిన వారిలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. 2014-19లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిపిన ఆరోగ్య సర్వేలో వెల్లడైన వివరాలతో పోలిస్తే ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో రక్తపోటు, మధుమేహం బాధితులు రెట్టింపు అయినట్టు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక జిల్లాలో నోటి క్యాన్సర్‌తో 138 మంది, రొమ్ము క్యాన్సర్‌తో 144 మంది, గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌తో 207 మంది బాధపడుతున్నట్టు గుర్తించారు. మానసిక పరిస్థితిపై నిర్వహించిన సర్వేలో 2,903 మంది మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తేల్చారు. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులతో 191 మంది, కుష్ఠువ్యాధితో 48 మంది బాధపడుతున్నారు. జిల్లాలో క్షయతో బాధపడుతున్న వారు 2,345 మంది ఉన్నారు. వినికిడి సమస్యతో 1,380 మంది బాధపడుతున్నారని గుర్తించారు.

స్ర్కీనింగ్‌ పరీక్షలు నిరంతర ప్రక్రియ

జిల్లాలో అన్ని పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల పరిధిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతాయని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ ప్రోగ్రామ్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ ప్రశాంతి ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ సాధన సర్వే కార్యక్రమం కింద జూన్‌ చివరినాటికి అందరికీ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. ఆ తరువాత కూడా పీహెచ్‌సీల పరిధిలో స్ర్కీనింగ్‌ పరీక్షలు కొనసాగుతాయని ఆమె స్పష్టం చేశారు.

Updated Date - Apr 08 , 2025 | 01:34 AM