క్లాప్‌ వాహనాలకు బ్రేక్‌?

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:04 AM

నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న క్లాప్‌ వాహనాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది.

క్లాప్‌ వాహనాలకు బ్రేక్‌?
  • పనితీరుపై జీవీఎంసీ అధికారుల అసంతృప్తి

  • ఇళ్ల నుంచి చెత్త సేకరణ మొక్కుబడిగా సాగుతుందనే ఫిర్యాదు

  • ఒక ట్రిప్పులో కనీసం 500 కిలోల చెత్త తీసుకువెళ్లాలన్న నిబంధన బేఖాతరు

  • 250 కేజీల చెత్తతో యార్డుకు....

  • క్లాప్‌ స్థానంలో క్లస్టర్లు వారీగా పారిశుధ్య నిర్వహణకు టెండర్లు

  • ప్రభుత్వం యోచన?

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరిస్తున్న క్లాప్‌ వాహనాల పనితీరుపై రాష్ట్ర ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నట్టు తెలిసింది. కాంట్రాక్టర్‌కు చెల్లిస్తున్న మొత్తానికి తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో చెత్త సేకరణ జరగడం లేదనే అభిప్రాయం జీవీఎంసీ అధికారుల్లోనూ ఉంది. అందుకే వీధుల్లో చెత్త పేరుకుపోతుందంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి అభిప్రాయమే వ్యక్తమవుతుండడంతో క్లాప్‌ వాహనాలను తొలగించి, గతంలో మాదిరిగా క్లస్టర్ల వారీగా వాహనాలను సమకూర్చుకునేందుకు టెండర్లు పిలవాలని భావిస్తున్నట్టు తెలిసింది.

స్థానిక సంస్థల్లో పారిశుధ్యం మెరుగుపరిచేందుకంటూ వైసీపీ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ (క్లాప్‌)కు శ్రీకారం చుట్టింది. ప్రతి స్థానిక సంస్థలో వెయ్యి ఇళ్లకు ఒక వాహనం చొప్పున టాటా ఏస్‌ వాహనాలను కేటాయించింది. డ్రైవర్‌తో కూడిన ఒక్కో వాహనానికి నెలకు రూ.64 వేల చొప్పున ఆయా స్థానిక సంస్థలే చెల్లించేలా రాష్ట్రమంతటికీ గ్లోబల్‌ టెండర్‌ ద్వారా కాంట్రాక్టర్‌ను ఖరారు చేసింది. అందులో భాగంగా జీవీఎంసీకి 586 వాహనాలను కేటాయించింది. ఒక్కో వాహనానికి రూ.64 వేలు చొప్పున నెలకు రూ.3.75 కోట్లు సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించాలని జీవీఎంసీని ఆదేశించింది. క్లాప్‌ వాహనం తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి రోజూ తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి సమీపంలో చెత్త ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు తరలించాలని, ఇలా రోజుకు మూడు ట్రిప్పులు వేయాలని నిబంధన విధించింది. ప్రతి వాహనం సక్రమంగా చెత్తసేకరించి, విభజించి, ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు తరలించేలా వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని ఆదేశించింది. కానీ క్లాప్‌ వాహనాలను ప్రారంభించినప్పటి నుంచి సచివాలయ సిబ్బంది ఆ బాధ్యతలను చేపట్టేందుకు అంగీకరించలేదు. దాంతో ఆ వాహనాలపై ప్రత్యక్ష పర్యవేక్షణ లోపించినట్టయింది. ప్రశ్నించేవారు లేకపోవడంతో తమకు నచ్చినట్టు నడపడం ప్రారంభించారు. ఒక వాహనం వెయ్యి ఇళ్ల నుంచి చెత్త సేకరిస్తే కనిష్ఠంగా వెయ్యి కిలోలు వస్తుందని అఽధికారులు లెక్కించారు. అది కాకుండా మార్కెట్లు, దుకాణాలు, వాణిజ్య సముదాయాల నుంచి రోడ్లపై పోగయ్యే చెత్త మరో 600 కిలోల వరకూ ఉంటుందని అంచనా వేశారు. దీని ప్రకారం ప్రతి వాహనం రోజుకు గరిష్ఠంగా 1,500 కిలోల చెత్తను ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లాలి. కానీ చాలా వాహనాలు ఒక్కో ట్రిప్పులో 250 కిలోలకు మించి చెత్తను తీసుకురావడం లేదని అక్కడి సిబ్బంది తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. కొంతమంది డ్రైవర్లు కూడా సక్రమంగా విధులకు హాజరుకాకపోవడంతో ఏ వాహనం ఎప్పుడు చెత్తసేకరణకు వెళ్లదనే సమాచారం అధికారులకు కూడా ఉండడం లేదు. ప్రతిరోజూ ఇంటింటికీ చెత్తసేకరణకు వాహనం వెళ్లకపోవడం, కొన్ని వాహనాలు మొక్కుబడిగా ప్రధాన వీధుల్లోని ఇళ్ల నుంచే చెత్తసేకరించి, రెండు,మూడు రోజులకు ఒకసారి సందుల్లోని ఇళ్లకు వెళ్లి చెత్తసేకరించడం జరుగుతోంది. దీనివల్ల ఆయా ప్రాంతాల్లోని నివాసితులు తమ ఇళ్లలోని చెత్తను రోడ్డుపైకి తెచ్చి పడేస్తున్నారు. దీనివల్ల రోడ్లు తెల్లవారేసరికి చెత్తకుప్పలతో దర్శనమిస్తున్నాయి. ఇది నగర పరిశుభ్రతపై ప్రభావం చూపుతుండడంతో అధికారులు తరచూ క్లాప్‌ కాంట్రాక్టర్‌ను పిలిచి సక్రమంగా వాహనాలను నడపాలని ఆదేశించడం, అందుకు ఆయన తాము వాహనాలను బాగానే నడుపుతున్నానని, బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేయడం షరామామూలుగా మారిపోయింది. ఈ విషయాన్ని అధికారులు కూడా రాష్ట్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫిర్యాదులే వస్తుండడంతో క్లాప్‌ వ్యవస్థపై సమీక్షించాలని నిర్ణయించారు. క్లాప్‌ వాహనాలకు రూ.64 వేలు అద్దె చెల్లించడం కంటే, ఏ నగరానికి ఆ నగరం గతంలో మాదిరిగా చెత్త సేకరణ వాహనాలకు సంబంధించి టెండర్లు పిలుచుకుంటే ఎలా ఉంటుందనే దానిపై చర్చిస్తున్నట్టు సమాచారం. నగరాన్ని కొన్ని క్లస్టర్లుగా విభజించి ఒక్కో క్లస్టర్‌కు అవసరమైన వాహనాలను సమకూర్చేలా టెండర్లు ఆహ్వానిస్తే చెత్త సేకరణ మెరుగుపడుతుందని అఽధికారులు అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇటీవల నగరానికి వచ్చిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్మన్‌ కె.పట్టాభి వద్ద క్లాప్‌ వాహనాల పనితీరు గురించి అధికారులు ప్రస్తావించగా, క్లాప్‌ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ఉన్నట్టు పరోక్షంగా సంకేతాలిచ్చారు.

జీవీఎంసీ పరిధిలో క్లాప్‌ వాహనాలు 586

ఒక వాహనం రోజుకు యార్డుకి తిరగాల్సిన ట్రిప్పులు మూడు

ఒక ట్రిప్పులో తీసుకువెళ్లాల్సిన చెత్త కనీసం 500 కిలోలు

ఒక్కో వాహనానికి జీవీఎంసీ చెల్లించే మొత్తం రూ.64 వేలు

వాహనాల కాంట్రాక్టర్‌కు జీవీఎంసీ ప్రతినెలా చెల్లిస్తున్న మొత్తం రూ.3.75 కోట్లు

Updated Date - Mar 14 , 2025 | 01:04 AM