బ్రేకుల్లేని భారీ వాహనాలు!
ABN , Publish Date - Apr 01 , 2025 | 01:19 AM
సరకు రవాణా చేసే భారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వాటి రిజిస్ర్టేషన్‌పై ఆంక్షలు ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో చేయించుకుని, నగరంలో తిప్పుతున్నారు.

నగరంలో ఇష్టారాజ్యంగా రాకపోకలు
ఇతర రాష్ట్రాల్లో రిజిస్ర్టేషన్...
ఇక్కడ సరకు రవాణాకు వినియోగం
నిషేధాజ్ఞల ఉల్లంఘన
తరచుగా రోడ్డు ప్రమాదాలు
పట్టించుకోని పోలీస్, రవాణా శాఖ అధికారులు
వాళ్లను ‘మేనేజ్’ చేస్తున్నట్టు చెప్పుకుంటున్న నిర్వాహకులు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
సరకు రవాణా చేసే భారీ లారీలు బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో వాటి రిజిస్ర్టేషన్‌పై ఆంక్షలు ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో చేయించుకుని, నగరంలో తిప్పుతున్నారు. అదేవిధంగా సిటీలోకి పగటి పూట భారీ వాహనాల ప్రవేశించరాదని నిబంధనలు ఉన్నప్పటికీ యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. వాటి వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు తీసు కునేందుకు ఎందుకనో పోలీస్, రవాణా శాఖ అధికారులు వెనుకాడుతున్నారు.
సరకు రవాణాకు ఉపయోగించే భారీ వాహనాల రిజిస్ర్టేషన్‌కు రాష్ట్రంలో ఆంక్షలు ఉండడంతో ఇతర రాష్ట్రాల్లో రిజిస్ర్టేషన్ చేయిస్తున్నారు. నేషనల్ పర్మిట్ ఉంటే దేశంలో ఎక్కడైనా తిరగవచ్చుననే వెసులుబాటును ఆసరాగా తీసుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వాహన యజమాని ఎక్కడో ఉంటున్నా...నగరం లేదా ఉత్తరాంధ్రలో ఉండే స్థానిక వ్యాపారులు వాటిని లీజుకు తీసుకుంటున్నారు. అలాంటి వాహనాలను పోర్టు నుంచి సరకు రవాణాకు, నగర శివారు ప్రాంతాల నుంచి మట్టి, గ్రావెల్ తరలింపు, ఆయిల్ కంపెనీల నుంచి చమురు తరలింపు కోసం వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లో రిజిస్ర్టేషన్ కలిగిన భారీ వాహనాలపై కొన్ని రకాల ఆంక్షలు ఉన్నాయి. వాటికి లోబడే ఆయా వాహనాలు నగరంలోకి వచ్చిపోవాల్సి ఉంటుంది. పోర్టు, స్టీల్‌ప్లాంట్, చమురు సంస్థల నుంచి సరకు ఇతర ప్రాంతాలకు తీసుకువెళ్లాలనుకుంటే లోడ్ చేసుకున్న తర్వాత నగరం నుంచి బయటకు వెళ్లిపోవాల్సి ఉంటుంది. అంతేతప్ప నగరంలో అంతర్గతంగా సరకు రవాణా చేయడం కుదరదు. భారీ వాహనాలు నగర అంతర్గత రోడ్లపై రాకపోకలు సాగిస్తే, ట్రాఫిక్ జామ్‌లతో పాటు ప్రమాదాలు చోటుచేసుకుంటా యనే ఉద్దేశంతో అధికారులు కొన్ని ఆంక్షలు విధించారు. అయితే భారీ వాహనాల నిర్వాహకులు, కొంతమంది వ్యాపారులు తమ స్వలాభం కోసం నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్నాళ్ల కిందట కూర్మన్నపాలెం జంక్షన్‌లో ఒక ద్విచక్ర వాహనాన్ని భారీ లారీ ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవల వెంకోజిపాలెం జంక్షన్ వద్ద భారీ లారీ ఒకటి రద్దీగా ఉన్న సమయంలో ముందు వెళుతున్న కారును ఢీకొంది. దీంతో కారు రోడ్డుపైనే బోల్తాపడింది. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాసరే పోలీసులు, రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంకోజీపాలెం జంక్షన్ వద్ద కారును ఢీకొట్టిన లారీని పోలీసులు ఎంవీపీ స్టేషన్‌కు తీసుకువెళ్లి రెండు రోజులు ఉంచారు. తర్వాత రవాణా శాఖ అధికారుల సర్టిఫికెట్‌తో స్టేషన్ నుంచి లారీని నిర్వాహకుడు విడిపించుకుని తీసుకువెళ్లిపోయారు. అయితే లారీని నిర్వహిస్తున్న నగరానికి చెందిన ఒక పెట్రోల్ బంకు నిర్వాహకుడు ‘ఏదో ప్రమాదం జరిగితే పోలీసులు, రవాణా శాఖ అధికారులకు డబ్బులు ఇచ్చి వాహనం తీసుకువెళ్లిపోతాం. కాకపోతే ఇప్పుడు లారీల ప్రవేశంపై ఆంక్షల పేరుతో పోలీసులు, రవాణా శాఖ అధికారులు రెట్టింపు మొత్తాన్ని తీసుకున్నారు’ అని చెబుతున్నారు. ఇప్పటికైనా రవాణా, పోలీసు అధికారులు నగరంలో రోడ్డు ప్రమాదాలకు కారణంగా మారుతున్న భారీ లారీల ప్రవేశంపై నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేయాల్సి ఉంది.