Share News

ఎలమంచిలిలో పట్టపగలు చైన్‌ స్నాచింగ్‌

ABN , Publish Date - Apr 16 , 2025 | 12:39 AM

పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) వెళ్లే రోడ్డులో పట్టపగలు చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళ మెడలో నుంచి ఒక యువకుడు మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని మరో యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై పరారయ్యారు.

ఎలమంచిలిలో పట్టపగలు చైన్‌ స్నాచింగ్‌
పుస్తెలతాడు తెంచుకుని ద్విచక్ర వాహనంపై పరారవుతున్న ఆగంతకులు

మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారం పుస్తెల తాడు అపహరణ

ఎలమంచిలి, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో సామాజిక ఆరోగ్య కేంద్రానికి (సీహెచ్‌సీ) వెళ్లే రోడ్డులో పట్టపగలు చైన్‌ స్నాచింగ్‌ జరిగింది. నడుచుకుంటూ వెళుతున్న ఒక మహిళ మెడలో నుంచి ఒక యువకుడు మూడు తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని మరో యువకుడితో కలిసి ద్విచక్రవాహనంపై పరారయ్యారు. ఇందుకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా వున్నాయి.

పట్టణంలోని తులసీనగర్‌కు చెందిన పొలమరశెట్టి అరుణ ఆరోగ్య పరీక్షల నిమిత్తం మంగళవారం ఉదయం సమీపంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. తిరిగి 11 గంటల ప్రాంతంలో ఇంటికి నడుచుకుంటూ వస్తున్నది. ఈ సమయంలో ఆ వీధిలో జనసంచారం తక్కువగా వుంది. కొద్ది దూరం వెళ్లిన తరువాత వెనుక నుంచి వచ్చిన ఒక యువకుడు, అరుణ మెడలో వున్న బంగారు పుస్తెల తాడును లాగేశాడు. అప్పటికే అక్కడ ద్విచక్ర వాహనంపై వున్న మరో యువకుడితో కలిసి పరారయ్యాడు. దీంతో ఆమె బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చారు. పుస్తెల తాడు చోరీ గురించి వారికి చెప్పడంతో పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ ఎస్‌ఐ సావిత్రి సిబ్బందితో వచ్చి వివరాలు సేకరించారు. భూలోకమాంబ అమ్మవారి ఆలయం వద్ద ఏర్పాటు చేసి ఉన్న సీసీ కెమెరాలు పనిచేయడం లేదని తెలుసుకుని, ఇదే మార్గంలో టూ వీలర్‌ షోరూమ్‌లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు యువకులను అరుణ గుర్తించి, పుస్తెలతాడు చోరీ చేసింది వారేనని పోలీసులకు చెప్పింది. అనంతరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.

Updated Date - Apr 16 , 2025 | 12:39 AM