Share News

కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు!

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:03 AM

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించడం కొంతమంది కార్పొరేటర్లకు అవకాశంగా మారింది.

కార్పొరేటర్ల గొంతెమ్మ కోర్కెలు!

  • మేయర్‌పై అవిశ్వాసం తీర్మానం నేపథ్యంలో మద్దతు కోసం కూటమి, వైసీపీ యత్నాలు

  • ఇదే అదనుగా నేతల ముందు సభ్యుల ఇండెంట్లు

  • కుటుంబ సభ్యులతో కలిపి విదేశాలకు తీసుకువెళ్లాలని కొందరి డిమాండ్‌

  • రూ.10 లక్షలు అడుగుతున్న మరికొందరు

  • పదవుల కోసం ఇంకొందరి పట్టు...

  • తలలు పట్టుకుంటున్న ఇరుపక్షాల నేతలు

  • జనసేన ‘పశ్చిమ’ ఇన్‌చార్జి పదవి బెహరా భాస్కరరావు అడుగుతున్నట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానానికి ప్రతిపాదించడం కొంతమంది కార్పొరేటర్లకు అవకాశంగా మారింది. తమ సభ్యులు వైరిపక్షంలోకి వెళ్లిపోతారేమోనని ఇరుపక్షాలు భయపడుతున్నాయి. ఇదే అవకాశంగా భావిస్తున్న కొందరు కార్పొరేటర్లు...అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా/వ్యతిరేకంగా ఓటు వేస్తే తమకేమి ప్రయోజనం కల్పిస్తారంటూ ఆయా పార్టీల నేతలను అడుగుతున్నారు. ఏమీ చేయలేమని చెబితే ఏమవుతుందోనని భయంతో వారి డిమాండ్లకు కొంతవరకూ తలొగ్గుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.

గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల తర్వాత జీవీఎంసీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బలం పెరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీకి చెందిన మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిరప్రసాద్‌కు నోటీస్‌ ఇచ్చారు. ఈ అంశంపై ఈనెల 19న నిర్వహించే జీవీఎంసీ కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశానికి హాజరుకావాలంటూ కార్పొరేటర్లకు అధికారులు సమాచారం అందజేశారు. 19న జరిగే సమావేశంలో మేయర్‌పై కూటమి కార్పొరేటర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే 2/3 వంతు సభ్యులు మద్దతు తెలపాల్సి ఉంటుంది. కౌన్సిల్‌లో కార్పొరేటర్లు 97 మందితోపాటు ఓటుహక్కు కలిగిన ఎక్స్‌ అఫిషీయో సభ్యులు (ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు) 14 మంది ఉన్నారు. వీరిలో కనీసం 74 మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తి మద్దతు తెలపాల్సి ఉంటుంది. ఒకవేళ 74 మందికి ఒక్కరు తక్కువైనా సరే అవిశ్వాస తీర్మానం వీగిపోయి తిరిగి హరివెంకటకుమారి మేయర్‌గా కొనసాగుతారు. ప్రస్తుతం కూటమికి కార్పొరేటర్లు, ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 72 మంది సభ్యుల మద్దతు ఉంది. మరో ఇద్దరు సభ్యుల మద్దతు అవసరం. ఇదిలావుండగా కూటమిలో ఉన్న కొంతమంది కార్పొరేటర్లు తమతో టచ్‌లో ఉన్నారని వైసీపీ నేతలు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు. దీంతో ఎలాగైనా మరో నలుగురు సభ్యుల మద్దతును కూడగట్టుకోవాలని కూటమి నేతలు భావిస్తున్నారు. వైసీపీ నిర్వహిస్తున్న క్యాంపునకు గైర్హాజరైన కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడంపై దృష్టిపెట్టారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె, ఐదో వార్డు కార్పొరేటర్‌ ముత్తంశెట్టి ప్రియాంకతోపాటు వైసీపీ నుంచి కార్పొరేటర్లుగా గెలిచిన బెహరా భాస్కరరావు భార్య, కోడలు మద్దతు కోరినట్టు సమాచారం. దీనికి బెహరా భాస్కరరావు కొన్ని డిమాండ్‌లను కూటమి నేతల ముందుపెట్టినట్టు తెలిసింది. తనకు పశ్చిమ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పదవి ఇస్తే తమ కుటుంబ సభ్యులైన ఇద్దరు కార్పొరేటర్ల మద్దతు ఇస్తామని షరతు పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న జనసేన జిల్లా అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్‌ వచ్చిన తర్వాత దీనిపై స్పష్టత ఇస్తామని కూటమి నేతలు వివరించినట్టు తెలిసింది. అయితే అందుకు జనసేన పార్టీ నేతలు ససేమిరా అంటున్నట్టు ఆ పార్టీ కార్పొరేటర్లు కొందరు చెబుతున్నారు. టీడీపీ నేతకు మేయర్‌ పదవి దక్కేందుకుగాను వైసీపీ నేతకు తమ పార్టీ నియోజకవర్గ ఇన్‌ చార్జి పదవి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒకవేళ అలా జరగాలంటే తమ పార్టీకి రెండు డిప్యూటీ మేయర్‌ పదవులను కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సీపీఐ కార్పొరేటర్‌ స్టాలిన్‌ మద్దతు ఇస్తారని కూటమి నేతలు ఆశాభావంతో ఉన్నారు. మరోవైపు టీడీపీకి చెందిన కార్పొరేటర్లు పదవులు పొందేది కొందరైతే తమకు కలిగే ప్రయోజనం ఏమిటని నిలదీస్తున్నట్టు సమాచారం. కుటుంబ సభ్యులతో తమను విదేశీ పర్యటనకు తీసుకువెళ్లాలని కోరుతున్నట్టు తెలిసింది.

ఇదిలావుండగా వైసీపీ క్యాంపులో ఉన్న కార్పొరేటర్లు కూడా ఆ పార్టీ నేతల ముందు రోజుకొక డిమాండ్‌ పెడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్లపాటు మేయర్‌, డిప్యూటీ మేయర్లు, ఫ్లోర్‌లీడర్లుగా పదవులు అనుభవించారని, ఎంతో కొంత ఆర్థికంగా బలపడ్డారంటూ పరోక్షంగా తమకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని కొందరు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నట్టు తెలిసింది. నాలుగేళ్లు కేవలం కార్పొరేటర్లుగానే ఉండిపోయామని, ఇప్పుడైనా మేయర్‌పై అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేసేందుకు వీలుగా తమకు రూ.పది లక్షలు చొప్పున ఇవ్వాలని కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరికొందరు తిరిగి తమ వార్డులో తమకే పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా బెంగళూరులో కుటుంబ సభ్యులతోపాటు ఉంచడానికి భారీగా ఖర్చయిందని, మరో 15 రోజులపాటు క్యాంపులో భాగంగా ఇతర రాష్ట్రాల్లో తిప్పాల్సి ఉంది కాబట్టి మరికొంత ఖర్చు అవుతుందని, కాబట్టి అర్థం చేసుకుని పార్టీ నిర్ణయానికి విధేయులుగా ఉండాలని పార్టీ నేతలు హితోపదేశం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి నేతలు ఏదైనా ఇస్తే కొందరు కార్పొరేటర్లు వారికి అనుకూలంగా ఓటు వేసే అవకాశం లేకపోలేదని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:03 AM