నేడు డిప్యూటీ సీఎం పవన్ రాక
ABN, Publish Date - Apr 07 , 2025 | 12:06 AM
ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు.

అల్లూరి జిల్లా ఏజెన్సీలో రెండు రోజులపాటు పర్యటన
తొలి రోజు డుంబ్రిగుడ మండలం పెదపాడు సందర్శన, గిరిజనులతో ముఖాముఖి
సాయంత్రం మండల కేంద్రంలో సభ, 200 రోడ్ల నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన
రేపు అరకులోయ మండలం సుంకరమెట్టలో చెక్క వంతెన ప్రారంభం
పాడేరు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి):
ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ ఏజెన్సీలోని డుంబ్రిగుడ, అరకులోయ మండలాల్లో రెండు రోజులపాటు పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు విశాఖ నుంచి పెందుర్తి, అనంతగిరి, అరకులోయ మీదుగా రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుంటారు. చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు. అనంతరం చాపరాయి గెడ్డ మీదుగా పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకుంటారు. పీఎం జన్‌మన్ గృహ నిర్మాణాలను పరిశీలిస్తారు. గిరిజనులతో ముఖాముఖి నిర్వహించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. తరువాత డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలకు చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేస్తారు. రాత్రికి అరకులోయ చేరుకుని ఏపీటీడీసీ అతిథిగృహంలో బస చేస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు అరకులోయ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఇదే మండలం సుంకరమెట్ట సమీపంలోని కాఫీ తోటలకు చేరుకుంటారు. అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం పయనమవుతారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ దినేశ్‌కుమార్, జేసీ అభిషేక్ గౌడ, సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, ఎస్పీ అమిత్ బర్ధార్ పర్యవేక్షిస్తున్నారు. కాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన నేపథ్యంలో సోమవారం చాపరాయి జల విహారిలో పర్యాటకుల ప్రవేశాన్ని రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
Updated Date - Apr 07 , 2025 | 12:06 AM