మూడేళ్లయినా సొంత గూడు లేదాయె
ABN, Publish Date - Apr 04 , 2025 | 12:52 AM
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు. ఏ ఒక్క కార్యాలయానికి సొంత భవనం గాని, పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది సైతం లేరు. దీంతో ఉన్న అధికారులు, సిబ్బందితోనే కాలం గడిపేస్తున్నారు. పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడినా గిరిజనులకు మాత్రం డివిజన్ స్థాయి పాలన సాగుతున్న అనుభూతి మాత్రమే కలుగుతోంది.

- కొత్త జిల్లా ఏర్పడినప్పటికీ కార్యాలయాలకు సొంత భవనాలు కరువు
- ప్రారంభం నుంచి ఇదే పరిస్థితి
- జిల్లా అయినప్పటికీ డివిజన్ స్థాయి పాలనే కొనసాగుతున్నదనే భావ న
- ప్రతిపాదనలకే పరిమితమైన కలెక్టరేట్ సముదాయ భవన నిర్మాణం
- నేటికి పాడేరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తి
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏర్పడి మూడేళ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ పూర్తి స్థాయిలో పాలన గాడిన పడలేదు. ఏ ఒక్క కార్యాలయానికి సొంత భవనం గాని, పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది సైతం లేరు. దీంతో ఉన్న అధికారులు, సిబ్బందితోనే కాలం గడిపేస్తున్నారు. పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడినా గిరిజనులకు మాత్రం డివిజన్ స్థాయి పాలన సాగుతున్న అనుభూతి మాత్రమే కలుగుతోంది.
గత వైసీపీ ప్రభుత్వం 2022లో అల్లూరి సీతారామరాజు జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే కార్యాలయాల ఏర్పాటు, సౌకర్యాలపై దృష్టి పెట్టలేదు. పలు జిల్లా అధికారుల పోస్టులను ప్రత్యేకంగా నియమించకుండా ఇతర ప్రాంతాల్లోని అధికారులను తాత్కాలిక పద్ధతిలో నియమించింది. దీంతో ఆయా శాఖల అధికారులు చుట్టపు చూపుగా పాడేరు వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కాగా కలెక్టరేట్‌లో ఉండే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి, ముఖ్య ప్రణాళికాధికారి, డ్వామా, డీఆర్‌డీఏ, జిల్లా ఉద్యానవన శాఖ, జిల్లా ఖజానాధి కారి కార్యాలయాలకు మాత్రమే ఫర్నిచర్, ఇంటర్నెట్ సదుపాయాలు కల్పించారు. ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఎస్‌పీ కార్యాలయానికి ఫర్నిచర్, ఇంటర్నెట్ సౌకర్యాలున్నాయి. ఇతర జిల్లా కార్యాలయాలకు కనీసం బెంచీ, కుర్చీ వంటివి సైతం లేవు. కలెక్టరేట్ మినహా ఇతర జిల్లా కార్యాలయాలన్నీ ఇక్కడున్న డివిజన్ కార్యాలయాల్లోనే తమ కార్యాకలాపాలను నిర్వహించుకుంటున్నాయి. ఇందుకు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాన్నే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓ భవనాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి కేటాయించారు. కానీ ఆ భవనానికి నీరు, విద్యుత్, ఇంటర్నెట్, ఫర్నిచర్ వంటి సదుపాయాలు కల్పించలేదు. దీంతో అక్కడ డీఈవో కార్యాలయాన్ని నిర్వహించలేక, పీఎంఆర్‌సీ భవనంలో ఉన్న ఏజెన్సీ డీఈవో కార్యాలయంలోనే డీఈవో కార్యాలయానికి సంబంధించిన వ్యవహారాలను చేసుకుంటున్నారు. ఐటీడీఏ కార్యాలయంలోనే జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి, జిల్లా పంచాయతీరాజ్ అధికారి, జిల్లా పరిశ్రమల అధికారి, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలను నిర్వహిస్తున్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖకు చెందిన గోదాములోనే ఐసీడీఎస్ పీడీ కార్యాలయాన్ని, హౌసింగ్ ఈఈ కార్యాలయంలో హౌసింగ్ పీడీ కార్యాలయాన్ని, వ్యవసాయ మార్కెట్ కమిటీకి చెందిన గోదాములోనే జిల్లా వ్యవసాయాధికారి కార్యాలయం, పట్టుపరిశ్రమ శాఖకు చెందిన భవనంలోనే జిల్లా ఉద్యానవనాధికారి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే విధంగా పలు జిల్లా శాఖల కార్యాలయాల పరిస్థితి ఉంది. అలాగే జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్ కార్యాలయం, జిల్లా అగ్నిమాపక కార్యాలయం, జిల్లా మైనారిటీ సంక్షేమ కార్యాలయం, ఏపీ మైనారిటీ ఫైనాన్స్ కార్యాలయం, జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం, జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు భవనాలను కేటాయించారు. వీటిలో జిల్లా సహకార సంస్థ, జిల్లా ఆడిట్ కార్యాలయాల సిబ్బంది వాళ్లే సొంతంగా కుర్చీలు, బెంచీలు ఏర్పాటు చేసుకుని తమ కార్యాలయాలను నిర్వహించుకుంటున్నారు.
ఎన్నో జిల్లా అధికారుల పోస్టులు ఇన్‌చార్జులుగానే...
కొత్త జిల్లా ఏర్పడి మూడేళ్లవుతున్నప్పటికీ ఏ ఒక్క కార్యాలయానికి సొంత భవనం గాని, పూర్తి స్థాయిలో అధికారులు, సిబ్బంది సైతం లేరు. దీంతో ఉన్న అధికారులు, సిబ్బందితోనే కాలం గడిపేస్తున్నారు. ఎంతో కీలకమైన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పోస్టును భర్తీ చేయకపోవడంతో గత మూడేళ్లుగా వెలుగు ఏపీడీనే పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. జిల్లా విద్యాశాఖాధికారిగా, డివిజన్ స్థాయిలో ఉండే ఏజెన్సీ డీఈవోనే ఇన్‌చార్జిగా వ్యవహరిస్తుండగా, జిల్లా పంచాయతీరాజ్ అధికారిగా, విశాఖపట్నంలో ఉండే పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ ఇంజనీర్‌కు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషన్ బాధ్యతలు ఎవరు నిర్వహిస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది. జిల్లా రిజిస్ట్రార్‌గా అనకాపల్లి జిల్లా రిజిస్ట్రార్ ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండగా, గృహ నిర్మాణ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌నే హౌసింగ్ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కొనసాగిస్తున్నారు. జిల్లా బీసీ, ఎస్‌సీ, మైనారిటీ వెల్ఫేర్ కార్యాలయాల పరిస్థితి అయోమంగా ఉంది.
ప్రతిపాదన స్థాయి దాటని జిల్లా కార్యాలయాల సముదాయం
2022లో కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన అప్పటి వైసీపీ ప్రభుత్వం జిల్లా కార్యాలయాల సముదాయాన్ని నిర్మించాలని ప్రతిపాదనలు చేసింది. జిల్లా కేంద్రంలోని హైవేను ఆనుకుని ఉన్న సుమారుగా 15 ఎకరాల స్థలంలో రూ.99 కోట్ల వ్యయంతో కలెక్టరేట్, ఎస్‌పీ, జేసీ, వాటి అనుబంధ విభాగాల కార్యాలయాలను నిర్మించేందుకు 2023లోనే ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. కానీ వాస్తవానికి దీనిపై అప్పటి వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో పాటు ఖజానాలో నిధులు లేకపోవడంతో నేటికీ కార్యరూపం దాల్చలేదు. దీంతో కొత్తలో సమకూర్చిన వసతితోనే జిల్లా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు. పాడేరు కేంద్రంగా జిల్లా ఏర్పడినప్పటికీ గిరిజనులకు మాత్రం డివిజన్ స్థాయి పాలన సాగుతున్న అనుభూతి మాత్రమే కలుగుతున్నది. గతంలో ఐటీడీఏ పీవో నిర్వహించే కార్యకలాపాలు గత మూడేళ్లుగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అంతకు మించి ప్రత్యేకంగా గిరిజనులకు కొత్తగా ఒరిగేదేమీ లేదనే వాదన బలంగా వినిపిస్తున్నది.
Updated Date - Apr 04 , 2025 | 12:52 AM