డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు

ABN, Publish Date - Apr 06 , 2025 | 11:20 PM

డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్‌ ఏజెన్సీలో సోమ, మంగళవారాలు పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు.

డిప్యూటీ సీఎం పవన్‌ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు
డుంబ్రిగుడలో సభా ప్రాంగణం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న అధికారులు

నేడు, రేపు ఏజెన్సీలో పర్యటన

తొలి రోజు డుంబ్రిగుడ మండలం పెదపాడు గ్రామ సందర్శన

రెండవ రోజు సుంకరమెట్టలో చెక్క వంతెన ప్రారంభం

అరకులోయలో 108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు హాజరుకానున్న మంత్రి గుమ్మడి సంధ్యారాణి

డిప్యూటీ సీఎం, మంత్రి పర్యటనలపై అధికారుల్లో సమన్వయ లోపం

పాడేరు, ఏప్రిల్‌ 6(ఆంధ్రజ్యోతి): డిప్యూటీ సీఎం కె.పవన్‌కల్యాణ్‌ ఏజెన్సీలో సోమ, మంగళవారాలు పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఆయన రోడ్డు మార్గంలో డుంబ్రిగుడ చేరుకుని అక్కడి నుంచి ఆదిమజాతి గిరిజన గ్రామమైన పెదపాడును సందర్శించనున్న క్రమంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అక్కడ గ్రామ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన సుమారు 200 రోడ్ల నిర్మాణాలకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం అరకులోయ వెళ్లి ఏపీటీడీసీ హరిత రిసార్ట్స్‌లో రాత్రి బస చేస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు సుంకరమెట్ట గ్రామ సమీపంలో కాఫీ తోటల్లో అటవీశాఖ చెక్కలతో నిర్మించిన కాలిబాట వంతెనను లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ నుంచి నేరుగా విశాఖపట్నం పయనమవుతారు.

108 సూర్య నమస్కారాల ప్రదర్శనకు మంత్రి సంధ్యారాణి హాజరు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో సోమవారం సాయంత్రం 18 వేల మంది విద్యార్థులతో నిర్వహించే 108 సమస్కారాల ప్రదర్శనకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖా మంత్రి గుమ్మడి సంధ్యారాణి హాజరుకానున్నారని కలెక్టరేట్‌ వర్గాలు తెలిపాయి. ఆమె సూర్యనమస్కారాల ప్రదర్శనకు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే 18 వేల మంది విద్యార్థులను అరకులోయ తరలించేందుకు ఏర్పాట్లు చేశామని, గిన్నిస్‌ బుక్‌ రికార్డు నమోదు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అధికారులు తెలిపారు.

డిప్యూటీ సీఎం, మంత్రి పర్యటనలపై అధికారుల్లో సమన్వయ లోపం

ఏజెన్సీలో డిప్యూటీ సీఎం, మంత్రి గుమ్మడి సంధ్యారాణి పర్యటనలకు సంబంధించి వివిధ శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. డిప్యూటీ సీఎం, మంత్రి పర్యాటనల వివరాలను సైతం పక్కాగా వెల్లడించలేని పరిస్థితిలో జిల్లా యంత్రాంగం ఉండడం గమనార్హం. 108 సూర్యనమస్కారాల ప్రదర్శనకు డిప్యూటీ సీఎం హాజరవుతారా?, లేదా? అనేది అధికారులు చెప్పలేకపోతున్నారు. అలాగే మంత్రి గుమ్మడి సంధ్యారాణి... డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటనలో ఉంటారా?, లేదా? అనేది స్పష్టత లేదు. డుంబ్రిగుడ మండలంలో మధ్యాహ్నం మూడు గంటలకే కార్యక్రమాలు ముగుస్తున్నప్పటికీ, సాయంత్రం అరకులోయలో జరిగే సూర్యనమస్కారాల ప్రదర్శనకు డిప్యూటీ సీఎం హాజరుకాకుండా అరకులోయలోనే రాత్రి బస చేస్తారని అధికారులు అంటున్నారు. దీంతో సోమ, మంగళవారాల్లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి సంధ్యారాణి కార్యక్రమాలపై అధికారులకే స్పష్టత లేకపోవడంతో కచ్చితమైన సమాచారాన్ని మీడియాకు సైతం చెప్పలేకపోతున్నారు. గతంలో అనంతగిరి మండలంలో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటనలోనూ అధికారులు గందరగోళంగానే వ్యవహరించారు. తాజా కార్యక్రమంలోనూ అదే పరిస్థితి కనిపిస్తుండడం గమనార్హం.

డుంబ్రిగుడలో...

డుంబ్రిగుడ: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పర్యటన నేపథ్యంలో అధికారులు డుంబ్రిగుడ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేశారు. పవన్‌కల్యాణ్‌ చాపరాయి జలవిహారిలో మత్స్యాలమ్మను సందర్శిస్తారు. అనంతరం చాపరాయి గెడ్డ మీదుగా పెదపాడు పీవీటీజీ గ్రామానికి చేరుకుంటారు. పీఎం జన్‌మన్‌ గృహ నిర్మాణాలను పరిశీలించనున్నారు. గ్రామంలోని గిరిజనులతో మాట్లాడతారు. అక్కడి నుంచి మండల కేంద్రంలోని బాలికల ఆశ్రమ పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణానికి చేరుకుని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. డిప్యూటీ సీఎం పర్యటన ఏర్పాట్లను కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ గౌడ, సబ్‌ కలెక్టర్‌ శౌర్యమన్‌ పటేల్‌, జిల్లా ఎస్పీ అమిత్‌ బర్ధార్‌ పర్యవేక్షిస్తున్నారు.

నేడు అనంతగిరి వారపు సంత రద్దు

అనంతగిరి: మండల కేంద్రంలో సోమవారం జరిగే వారపు సంతను అధికారులు రద్దు చేశారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ గిరిజన ప్రాంతంలో పర్యటించనున్న నేపథ్యంలో ప్రధాన రహదారిని ఆనుకుని జరిగే వారపు సంతలను రద్దు చేయాలని మండల స్థాయి అధికారులకు జిల్లా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

నేడు చాపరాయిలో ప్రవేశం రద్దు

డుంబ్రిగుడ: మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం చాపరాయి జల విహారిలో సోమవారం పర్యాటకుల ప్రవేశాన్ని రద్దు చేశామని జాయింట్‌ కలెక్టర్‌, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అభిషేక్‌ గౌడ తెలిపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రవేశాన్ని రద్దు చేశామని, పర్యాటకులు గమనించి చాపరాయికి రావద్దని ఆయన కోరారు.

Updated Date - Apr 06 , 2025 | 11:20 PM