ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గోకులాలు కళకళ

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:44 AM

జిల్లాలో గోకులం పథకం కింద పశువులకు షెడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నది.

  • చురుగ్గా సాగుతున్న పశువుల షెడ్ల నిర్మాణం

  • జిల్లా రైతులకు 804 గోకులాలు మంజూరు

  • ఇప్పటికే 236 షెడ్ల నిర్మాణం పూర్తి

  • సంక్రాంతి సందర్భంగా ప్రారంభించిన ప్రజాప్రతినిధులు

  • మిగిలిన షెడ్ల పనులు ఈ నెలాఖరులోగా పూర్తి

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో గోకులం పథకం కింద పశువులకు షెడ్ల నిర్మాణం ముమ్మరంగా సాగుతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 804 మంది రైతులకు గోకులాలు మంజూరుకాగా, ఇప్పటికే 236 షెడ్ల నిర్మాణం పూర్తయ్యింది. మిగిలిన వాటి నిర్మాణ పనులు ఈ నెలాఖరులోగా పూర్తవుతాయని పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.

కూటమి అధికారంలోకి వస్తే గత టీడీపీ హయాంలో అమలు చేసిన గోకులం పథకాన్ని పునరుద్ధరిస్తామని సాధారణ ఎన్నికల ముందు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు హామీ ఇచ్చారు. వాగ్దానం చేసిన మేరకు అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే గోకులం పథకాన్ని అమల్లోకి తెచ్చారు. గతంలో పశువులకు మాత్రమే షెడ్లు మంజూరు చేయగా, ఈసారి గొర్రెలు/ మేకలు, కోళ్లకు కూడా షెడ్లు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పశువుల షెడ్డు నిర్మాణానికి అయ్యే వ్యయంలో పది శాతం, గొర్రెలు/ మేకలు, కోళ్ల షెడ్ల నిర్మాణ వ్యయంలో 30 శాతాన్ని రైతులు భరిస్తే చాలు. మిగిలిన సొమ్మును ఉపాధి పథకం నుంచి మంజూరు చేస్తుంది. గత ఏడాది జూలై ఒకటిన ఈ పథకం ప్రారంభం కాగా, పశుసంవర్థక శాఖ అధికారులు అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారు.

పశువుల షెడ్లను మూడు కేటగిరీలుగా విభజించారు. రెండు పశువులకు సరిపడ షెడ్డు (యూనిట్‌) నిర్మాణానికి రూ.1.15 లక్షలు, నాలుగు పశువులు అయితే రూ.1.85 లక్షలు, ఆరు పశువులు అయితే రూ.2.3 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కేవలం పది శాతం సొమ్మును మాత్రమే రైతులు భరించాలి. ఇక 20 గొర్రెలు/ మేకలు వుంటే రూ.1.3 లక్షలు, 50 జీవాలు వుంటే రూ.2.3 లక్షలు, వంద కోళ్లు అయితే రూ.87 వేలు, 200 కోళ్లు వుంటే రూ.1.32 లక్షలతో షెడ్లు నిర్మించుకోవచ్చు. వ్యయంలో 30 శాతాన్ని రైతులు భరించాలి. దీంతో రైతులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. ప్రాధాన్యతా క్రమంలో 804 మంది రైతులకు గోకులాలను మంజూరు చేశారు. ఇప్పటికే 236 షెడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. సంక్రాంతి సందర్భంగా ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరిపారు. మిగిలిన గోకులాల షెడ్ల నిర్మాణాన్ని ఈ నెలాఖరులోగా పూర్తి చేసి రైతులకు అప్పగిస్తామని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి బి.రామ్మోహన్‌రావు తెలిపారు. గోకులం పథకం కింద పశువులు, జీవాలు, కోళ్లకు షెడ్లు నిర్మించుకోవాలనుకునే రైతులు సమీపంలోని పశువసంవర్థక శాఖ అధికారులు/ సిబ్బందిని సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - Jan 16 , 2025 | 01:44 AM