ఎన్నాళ్లీ కష్టాలు?
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:30 AM
రహదారి సౌకర్యం లేక మండలంలోని మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొరగూడ నుంచి ఉబ్బెంగుల వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్లు పక్కా రహదారి నిర్మించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు.

- రహదారి సౌకర్యం లేక దొరగూడ గ్రామస్థుల అవస్థలు
- గర్భిణులు, రోగులను డోలీలో ఆస్పత్రికి తరలించాల్సిన దుస్థితి
- పలుమార్లు ప్రజా ప్రతినిధులు, అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందని ఆవేదన
ముంచంగిపుట్టు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): రహదారి సౌకర్యం లేక మండలంలోని మారుమూల లక్ష్మీపురం పంచాయతీ దొరగూడ గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దొరగూడ నుంచి ఉబ్బెంగుల వరకు సుమారు ఎనిమిది కిలో మీటర్లు పక్కా రహదారి నిర్మించాలని ప్రజా ప్రతినిధులు, అధికారులకు పలుమార్లు వేడుకున్నా ఫలితం లేకపోయిందని వారు వాపోతున్నారు.
దొరగూడ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో రోగులను, గర్భిణులను ఆస్పత్రికి తరలించాలంటే గ్రామస్థులు అవస్థలు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో రోగులను డోలీ సహాయంతో ఎనిమిది కిలో మీటర్లు మోసుకెళ్లి అక్కడ నుంచి వాహనంపై సుమారు 20 కిలో మీటర్ల దూరంలోని లబ్బూరు ఆస్పత్రికి తరలించాల్సి వస్తోందని వాపోతున్నారు. ఏ చిన్నపాటి అవసరానికైనా పంచాయతీ, మండల కేంద్రాలకు వెళ్లాలన్నా, వారపు సంతలకు వెళ్లాలన్నా కాలినడకనే వెళ్లాల్సిన దుస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షా కాలంలో సుమారు నాలుగు నెలల పాటు పలు చోట్ల గెడ్డలు వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తుండడంతో ఆ సమయంలో తమ గ్రామానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయని చెబుతున్నారు. మూడేళ్ల క్రితం గెడ్డలు ఉధృతంగా ప్రవహించడం వల్ల పలువురు చిన్నారులకు చర్మవ్యాధులు వచ్చినా ఆస్పత్రికి తీసుకు వెళ్లలేకపోయారు. దీంతో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు.
గ్రామంలో జరగని అభివృద్ధి పనులు
దొరగూడ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల పలు అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. నిధులు మంజూరు అయినప్పటికీ పనులు జరగకపోవడంతో ఆ గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం మల్టీపర్పస్ కమ్యూనిటీ భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. అయితే ఆ గ్రామానికి రహదారి లేకపోవడంతో ఆ భవన నిర్మాణం జరగలేదు. అలాగే అంగన్‌వాడీ భవనం లేక పరాయి పంచనే కేంద్రం కొనసాగుతోంది. ఈ గ్రామ పరిస్థితిని వివరించేందుకు గ్రామస్థులు సర్పంచ్ కె.త్రినాథ్‌తో కలిసి నాలుగు నెలల క్రితం మంగళగిరిలో కూటమి ప్రభుత్వం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. వెంటనే రహదారి మంజూరు చేయాలని ఆక్కడ నుంచి జిల్లా కలెక్టర్‌కు ఫోన్లో ఆదేశాలు జారీ చేశారని గ్రామస్థులు తెలిపారు. అయితే ఇప్పటి వరకు రహదారి పనులు మాత్రం ప్రారంభం కాలేదని వారు చెప్పారు. కూటమి ప్రభుత్వం స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:30 AM