ఉపాధి కూలి పెంపు కంటితుడుపే?
ABN , Publish Date - Apr 06 , 2025 | 12:59 AM
జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం కూలిరేట్లు పెంచుతున్నట్టు ప్రకటించినా క్షేత్ర స్థాయిలో మాత్రం కూలీలకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు.

కేంద్ర ప్రభుత్వం కూలిరేట్లు పెంచినా క్షేత్ర స్థాయిలో కూలీలకు దక్కని ప్రయోజనం
- 11 ఏళ్లుగా స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు పెరగకపోవడమే కారణం
- జిల్లా సగటు కూలి రూ.254
- రేట్లు పెంచాలని కోరుతున్న కూలీలు
చోడవరం, ఏప్రిల్ 5(ఆంధ్రజ్యోతి): జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని చేసే కూలీలకు కేంద్ర ప్రభుత్వం కూలిరేట్లు పెంచుతున్నట్టు ప్రకటించినా క్షేత్ర స్థాయిలో మాత్రం కూలీలకు పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఉపాధి పనులకు ప్రభుత్వం నిర్ణయించిన క్యూబిక్ మీటర్‌కు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) పెరగకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఎస్‌ఎస్‌ఆర్ పెరిగితే తప్ప కూలీలకు మేలు జరగదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఉపాధి కూలీలకు ఇచ్చే రోజువారీ కూలి రూ.300 నుంచి రూ.307కు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ ఏడాది పెరిగిన కూలి రెండు శాతం మాత్రమే. వాస్తవానికి గత ఏడాది ప్రభుత్వం రూ.272 నుంచి 28 రూపాయలు పెంచడంతో కూలి రూ.300కు చేరింది. ఈ ఏడాది మాత్రం పెంపు 7 రూపాయలకే పరిమితం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉపాధి కూలీల వేతనం పెంచుతున్నట్టు ప్రకటించినప్పటికీ క్షేత్రస్థాయిలో లభించే కూలి మాత్రం రూ.150 నుంచి రూ.250లకు మించి ఉండడం లేదు. గత ఏడాది సగటు కూలి రూ.256లు ఉండగా, ఈ ఏడాది కూడా సగటు కూలి రూ.254 మించడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూలి రేట్లు పెంచినా జిల్లాలోని కూలీలకు పెద్దగా ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఉపాధి కూలి జిల్లా సగటు రూ.256 మించడం లేదు, ఇదే సమయంలో మండలాలవారీగా చూస్తే కొన్ని మండలాల్లో సగటు కూలి రూ.210లకు మించి ఉండడం లేదు. వాస్తవానికి కూలీలు చేసిన పనిని చూసీచూడనట్టుగా సిబ్బంది నమోదు చేస్తుండడంతో ఈ మాత్రమైనా కూలి డబ్బులు వస్తున్నాయనేది బహిరంగ రహస్యం. ఈ ఏడాది జనవరి నెలలో జిల్లాలో చీడికాడ, రావికమతం మండలాల్లో అతి తక్కువగా సగటు కూలి రూ.196, అనకాపల్లిలో రూ.202లు నమోదైంది. ఫిబ్రవరి నెలలో ఇదే మండలాల్లో రూ.212, రూ.217 సగటు కూలి నమోదుకాగా, మార్చి నెలలో మాడుగుల మండలంలో అతి తక్కువగా రూ.210లు సగటు కూలి నమోదైంది. జిల్లాలోని అన్ని మండలాల్లో చాలా వరకు సగటు కూలి రూ.250లోపే ఉంటుండడం గమనార్హం. గత కొద్ది సంవత్సరాలుగా జరుగుతున్న ఉపాధి పనుల్లో కూలీలు చేస్తున్న పనికి, వారికి లభిస్తున్న వేతనం, ఉపాధి పనుల తీరుతెన్నులను పరిశీలిస్తే తాజాగా పెరిగే కూలి రేటు పెంపు వల్ల కూలీలకు దక్కేది పెద్దగా ఉండబోదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది రూ.300ల కూలి ఉన్న సమయంలోనే సగటు కూలి రూ.256 ఉంటే, ఈ ఏడాది 7 రూపాయలు పెంపు వల్ల పెద్దగా పెరుగుదల ఉండదని అంటున్నారు. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండల వల్ల నేల గట్టిగా ఉండి పనులు అనుకున్నంత జరగక, ఈ నెల కూలి మరింత తగ్గిపోయేందుకు అవకాశం ఉంది. చాలా చోట్ల ఉపాధి పనులకు కూలీలు వెనుకాడుతుండడానికి కూడా ఇదో కారణంగా చెబుతున్నారు.
11 ఏళ్లుగా పెరగని షెడ్యూల్ రేట్లు
ఉపాధి హామీ పథకం కింద కూలీలకు తక్కువ కూలి రావడానికి ఉపాధి పనులకు ప్రభుత్వం నిర్ణయించిన క్యూబిక్ మీటర్‌కు స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) పెరగకపోవడం ప్రధాన కారణమని పలువురు అంటున్నారు. ఒకటి, రెండు పనులకు మినహాయిస్తే చాలా వరకు ఉపాధి హామీ పథకం కింద 2014లో రూపొందించిన రేట్లే ఇప్పటికీ అమలవుతున్నాయని సమాచారం. ప్రస్తుత సీజన్‌లో జరిగే చెరువు పూడికతీత పనుల్లో క్యూబిక్ మీటర్‌కు సుమారుగా రూ.235లు, కాలువల పూడికతీత పనికి రూ.118, ఫారంపాండ్‌కు రూ.280, ట్రెంచ్‌లకు రూ.336, రోడ్డు మట్టి పనికి రూ.302 చెల్లిస్తున్నారు. పదకొండేళ్లుగా ఈ ధరల్లో పెద్దగా పెరుగుదల లేకపోవడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధర రావడం లేదన్న అసంతృప్తి ఉపాధి కూలీల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం పెంచిన కూలి క్షేత్రస్ధాయిలో కూలీలకు సంపూర్ణంగా లభించాలంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా పనులకు ఇచ్చే ఎస్‌ఎస్‌ఆర్ పెంచితే తప్ప, కూలీలకు ప్రయోజనం ఉండదన్న అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.