భూ మాయగాళ్లకు జైలు

ABN, Publish Date - Mar 15 , 2025 | 01:12 AM

ఒకరికి విక్రయించిన స్థలాన్ని తిరిగి ఆక్రమించుకోవడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరికి అమ్మినట్టు తేలడంతో నిందితులు ఏడుగురికి ఐదు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు జడ్జి తీర్పునిచ్చారు.

భూ మాయగాళ్లకు జైలు
  • ఒకరికి విక్రయించిన స్థలాన్ని తప్పుడు డాక్యుమెంట్లతో వేరొకరికి అమ్మిన ఏడుగురికి న్యాయస్థానం శిక్ష

  • బాధితునికి రూ.2.9 లక్షల చొప్పున చెల్లించాలని ఆదేశం

పెందుర్తి, మార్చి 14 (ఆంధ్రజ్యోతి):

ఒకరికి విక్రయించిన స్థలాన్ని తిరిగి ఆక్రమించుకోవడంతో పాటు నకిలీ డాక్యుమెంట్లతో వేరొకరికి అమ్మినట్టు తేలడంతో నిందితులు ఏడుగురికి ఐదు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధిస్తూ జిల్లా అదనపు జడ్జి తీర్పునిచ్చారు. ఇందుకు సంబంధించిన వివరాలు సీఐ కేవీ సతీశ్‌కుమార్‌ శుక్రవారం వెల్లడించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడకు చెందిన పిలమాల అప్పారావు 2017 ఫిబ్రవరిలో పెందుర్తి సమీపంలోని దొగ్గవానిపాలెం సర్వే నంబర్‌ 107-23లో గల స్థలాన్ని కూడా అంజిలరావు, ఎం.మరిడయ్య, ఎం.రమణ, ఎం.గోవింద్‌, ఎం.రాంబాబు, ఎం.చిన మరిడయ్య, ఎం.సూరిబాబు అనేవారి వద్ద రూ.18 లక్షలకు కొనుగోలు చేశారు. స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ కూడా చేయించుకున్నారు. స్థలానికి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించుకున్నారు. అయితే అదే స్థలాన్ని అంజిలరావు బృందం తప్పుడు పత్రాలతో వేరొకరికి విక్రయించింది. అప్పారావు స్థలాన్ని ఆక్రమించుకుని ప్రహరీ గోడను ధ్వంసం చేసింది. ఈ వ్యవహారంపై తనను మోసం చేశారని, కులం పేరిట దూషించారని అప్పట్లో పోలీసులకు అంజిలరావు, తదితరులపై అప్పారావు ఫిర్యాదు చేశారు. దీనిపై అప్పటి సీఐ జె.మురళీ కేసు నమోదు చేయగా, ఏసీపీ ప్రవీణ్‌కుమార్‌ దరాప్తు చేసి చార్జిషీటు వేశారు. వెస్ట్‌ ఏసీపీ పృథ్వీరాజ్‌ పర్యవేక్షణలో సీఐ కేవీ సతీశ్‌కుమార్‌ సకాలంలో సాక్షులను ప్రవేశపెట్టడం, కోర్టులో ఆధారాలను సమర్పించడంతో విక్రయించిన స్థలాన్ని ఆక్రమించుకుని తప్పుడు పత్రాలతో వేరొకరికి విక్రయించిన అంజిలరావు, మరిడయ్య, రమణ, గోవింద్‌, రాంబాబు, చిన మరిడయ్య, సూరిబాబులకు ఐదు సంవత్సరాల చొప్పున జైలు శిక్ష విధించడంతో పాటు, వారి చేతిలో మోసపోయిన పిలమాల అప్పారావుకు ఒక్కొక్కరు రూ.2.9 లక్షల చొప్పున రూ.18.6 లక్షలు నష్ట పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు వెలువరించినట్టు సీఐ తెలిపారు.

Updated Date - Mar 15 , 2025 | 01:12 AM