జంక్షన్లు జామ్
ABN, Publish Date - Jan 12 , 2025 | 12:49 AM
నగరంలో శనివారం ఉదయం నుంచి రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి.
సంక్రాంతి ప్రయాణాలు, షాపింగ్ కోసం రోడ్లపైకి జనం
ప్రధాన కూడళ్ల వద్ద బారులు తీరిన వాహనాలు
విశాఖపట్నం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి):
నగరంలో శనివారం ఉదయం నుంచి రోడ్లన్నీ రద్దీగా కనిపించాయి. నగరానికి ముఖద్వారాలైన హనుమంతవాక, గాజువాక, పెందుర్తి వంటి ప్రాంతాల్లోనే కాకుండా ఏ రోడ్డును చూసినా వాహనాల తాకిడి ఎప్పుడూ లేనంతగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలకు శనివారం నుంచే సంక్రాంతి సెలవులు ప్రారంభం కావడంతో ఎక్కువ మంది పండుగకు స్వస్థలాలకు ప్రయాణాలు పెట్టుకున్నారు. దీంతో విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, సబ్బవరం వైపు రోడ్లపై వాహనాల సంఖ్య పెరిగింది. మరోవైపు ఇంతవరకూ పండుగ షాపింగ్ చేయని వారంతా శనివారం సెలవుదినం కావడంతో వస్త్ర దుకాణాలు, మార్కెట్లకు పోటెత్తారు. దీంతో నగరంలోని రోడ్లపై కూడా ట్రాఫిక్ భారీగా పెరిగింది. పూర్ణామార్కెట్, జగదాంబ జంక్షన్, డాబాగార్డెన్స్, ద్వారకా నగర్ జంక్షన్, ఆశీల్‌మెట్ట జంక్షన్ వంటి ప్రాంతాలు జనాలతో కిటకిటలాడాయి. ఆయా మార్గాల్లో ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలు కిలోమీటరు మేర బారులు తీరి కనిపించాయి. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడానికి కూడళ్ల వద్ద ట్రాఫిక్ పోలీసుల సంఖ్యను అధికారులు పెంచాల్సి వచ్చింది.
Updated Date - Jan 12 , 2025 | 12:49 AM