కత్తి కట్టిన కోడి
ABN, Publish Date - Jan 16 , 2025 | 01:42 AM
కోడి పందేలకు ఎటువంటి అనుమతులు లేవన్న పోలీసులు హెచ్చరికలను నిర్వాహకులు పట్టించుకోవడం లేదు.
పల్లెల్లో జోరుగా కోడి పందేలు
పోలీసుల కంట పండకుండా శివారునున్న తోటల్లో నిర్వహణ
పెద్ద మొత్తంలో చేతులు మారిన నగదు
అనకాపల్లి/ కశింకోట/ కొత్తూరు, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):
కోడి పందేలకు ఎటువంటి అనుమతులు లేవన్న పోలీసులు హెచ్చరికలను నిర్వాహకులు పట్టించుకోవడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా పలు మండలాల్లో జోరుగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. పోలీసుల కంట పండకుండా, ఒకవేళ పోలీసులు దాడి చేస్తే సులువుగా తప్పించుకోవడానికి వీలుగా గ్రామాల శివారుల్లోని తోటలు, ఖాళీ స్థలాలను కోడి పందేల నిర్వహణకు ఎంచుకున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు, మళ్లీ బుధవారం ఉదయం నుంచి కోడి పందేలు పెద్ద ఎత్తున జరుపుతున్నారు. కొన్నిచోట్ల కోడిపుంజుల కాళ్లకు కత్తులు కట్టి, మరికొన్నిచోట్ల కత్తులు కట్టకుండా (డింకీ) పందేలు నిర్వహిస్తున్నారు. అనకాపల్లి, కశింకోట, చోడవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, నక్కపల్లి, ఎస్.రాయవరం, కోటవురట్ల, ఎలమంచిలి, మునగపాక మండలాల్లోని పలు గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున సొమ్ము చేతులు మారుతున్నది.
కాగా అనకాపల్లి మండలం సుందరయ్యపేట, సీతానగరం, వేటజంగాలపాలెం, కశింకోట మండలం ఏనుగుతుని, చెరకాం, సోమవరం, ఏఎస్‌పేట, అడ్డాం గ్రామాల్లోని మామిడి, సరుగుడు తోటల్లో నిర్వహించిన కోడి పందేలకు స్థానికులతోపాటు చుట్టుపక్కల గ్రామాలు, అనకాపల్లి పట్టణం నుంచి పలువురు వచ్చారు. ఎక్కువచోట్ల కోడిపుంజులకు కత్తులు కట్టి బరిలోకి దించారు. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు పందేలు నిర్వహించారు. ఒక్కో పర్యాయం రూ.2 వేల నుంచి రూ.20 వేల వరకు పందేలు కాశారు. ఇదిలావుండగా నక్కపల్లి మండలం వేంపాడులో ఏర్పాటు చేసిన కోడిపందేల(డింకీ) శిబిరాన్ని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ కుటుంబ సమేతంగా సందర్శించి సందడి చేశారు.
ఘనంగా సంక్రాంతి
మూడు రోజులపాటు ఉత్సాహంగా జరుపుకున్న ప్రజలు
కనుమ రోజు బోసిపోయిన అనకాపల్లి పట్టణం
గ్రామాల్లో తీర్థాలు ప్రారంభం
(ఆంధ్రజ్యోతి-న్యూస్ నెట్‌వర్క్)
తెలుగువారి అతిముఖ్యమైన పండుగల్లో ఒకటైన సంక్రాంతిని జిల్లా వ్యాప్తంగా మూడు రోజులపాటు ఘనంగా జరుపుకున్నారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా పండుగ సాగింది. భోగి రోజున పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి ఉత్తమ ముగ్గులకు బహుమతులు అందజేశారు. సంక్రాంతి రోజులన కోలాటాలు, భజనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇంకా ఎడ్ల బండ్ల పరుగు పోటీలు, గుర్రపు పందేలు నిర్వహించారు. చాటుమాటుగా కోడిపందేలు, పేకాట వంటివి జరిగాయి. వివిధ కారణాల వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లిన వారు.. కుటుంబాలతో సహా సొంతూళ్లకు వచ్చి సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పలు గ్రామాల్లో తీర్థమహోత్సవాలు, పరస ప్రారంభమయ్యాయి.
బోసిపోయిన అనకాపల్లి
అనకాపల్లి టౌన్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):
అనకాపల్లి పట్టణంలోని పలు ప్రాంతాలు.. బుధవారం కర్ఫ్యూ విధించినట్టు నిర్మానుష్యంగా మారాయి. కనుమ రోజున కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడం, గ్రామాల నుంచి వలస వచ్చి అనకాపల్లిలో నివసిస్తున్న పలువురు సొంతూళ్లకు వెళ్లడంతో పట్టణం బోసిపోయింది. సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం సాయంత్రం వరకు దుకాణాలు, రహదారులు, మార్కెట్లు రద్దీగా వున్నాయి. ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం కనుమ సందర్భంగా దుకాణాలను మూసివేయడంతో వాణిజ్య ప్రాంతం బోసిసోయింది. నిత్యం రద్దీగా ఉండే నెహ్రూచౌక్, చిననాలుగురోడ్ల జంక్షన్, మెయిన్‌రోడ్డు, డీసీఎంఎస్ కార్యాలయం రోడ్డు, పూల్‌బాగ్‌రోడ్డు, పూడిమడకరోడ్డు, రింగురోడ్డుల్లో జనసంచారం బాగా తగ్గిపోయింది.
Updated Date - Jan 16 , 2025 | 01:42 AM