పూర్ణామార్కెట్ వద్ద ఆక్రమణల తొలగింపునకు నేతల మోకాలడ్డు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:57 AM
పూర్ణామార్కెట్ వద్ద మెయిన్‌రోడ్డులో పార్కింగ్‌కు కేటాయించిన చోట అనధికారికంగా ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపు విషయంలో జీవీఎంసీ అధికారులు వెనక్కి తగ్గడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఆశీల్ దందాకూ సపోర్టు
రెండు రోజుల క్రితం చర్యలకు సిద్ధమైన జీవీఎంసీ అధికారులపై ఒత్తిళ్లు
వెనుతిరిగిన సిబ్బంది
సర్వత్రా విమర్శలు
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
పూర్ణామార్కెట్ వద్ద మెయిన్‌రోడ్డులో పార్కింగ్‌కు కేటాయించిన చోట అనధికారికంగా ఏర్పాటుచేసిన దుకాణాల తొలగింపు విషయంలో జీవీఎంసీ అధికారులు వెనక్కి తగ్గడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానరోడ్డును ఆక్రమించి దుకాణాలు ఏర్పాటుచేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బంది అవుతోంది. ఈ సమస్యపై జీవీఎంసీ, పోలీస్ అధికారులకు పలువురు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపానపోలేదు. మార్కెట్‌లో ఆశీల్ వసూలుచేస్తున్న వ్యక్తులే దగ్గరుండి రోడ్డుపై దుకాణాలు పెట్టించి, వారి నుంచి రోజుకు రూ.200-300 వసూలు చేస్తున్నారు. ఆశీల్ దందా, రహదారుల ఆక్రమణపై ఈనెల ఆరు, ఏడు తేదీల్లో ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్‌గా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంఎన్‌హరేంధిరప్రసాద్ స్పందించారు. పూర్ణామార్కెట్ రోడ్డులో అక్రమంగా వెలసిన దుకాణాలను తొలగించడంతోపాటు జీవీఎంసీ గెజిట్‌కు పది రెట్లకుపైగా ఆశీల్ వసూలుచేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలంటూ జోన్-4 కమిషనర్‌ను ఆదేశించారు. ఈ మేరకు జోన్-4 కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు తన సిబ్బందితోపాటు వన్‌టౌన్ ట్రాఫిక్ పోలీసులను వెంట తీసుకుని పూర్ణామార్కెట్‌కు వెళ్లి ఆశీల్ వసూళ్లపై స్వయంగా వ్యాపారులను ఆరాతీశారు. గెజిట్ కంటే పది రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నట్టు నిర్ధారణ కావడంతో కాంట్రాక్టర్‌కు నోటీసు జారీచేయాలని రెవెన్యూ విభాగం అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డును ఆక్రమించి ఏర్పాటుచేసిన దుకాణాలను శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల్లోగా తొలగించాలని, లేనిపక్షంలో తామే వాహనాలను తీసుకొచ్చి తీసుకువెళ్లిపోతామని హెచ్చరించారు. అనుకున్నట్టుగానే శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు జీవీఎంసీ, పోలీస్ అధికారులు పూర్ణామార్కెట్ మెయిన్‌రోడ్డుకు చేరుకున్నారు. వారిని చూసి కొంతమంది వ్యాపారులు స్వచ్ఛందంగానే దుకాణాలను తొలగించారు. మరికొందరు మాత్రం తమ వ్యాపారాన్ని కొనసాగించారు. ఇంతలో ఏమైందో తెలియదుగానీ దుకాణాల జోలికి వెళ్లకుండానే జీవీఎంసీ, పోలీస్ అధికారులు అక్కడి నుంచి వెనుతిరిగారు. దాంతో రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు కొనసాగడంతోపాటు, ఆశీల్ వసూళ్లు కూడా గతంలో మాదిరిగానే జరుగుతోంది. రాజకీయ నేతల నుంచి ఒత్తిళ్లు రావడం వల్లే దుకాణాలను తొలగించాలని సిద్ధపడిన అధికారులు వెనుతిరిగారని పూర్ణామార్కెట్‌లోని వ్యాపారులు చర్చించుకుంటున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:57 AM