ప్రకృతి అందాల నడుమ సేద తీరుదాం
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:12 AM
ఆంధ్ర కశ్మీర్ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం పైన్ తోటల్లో అటవీశాఖ అధికారులు నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టు అతిథులను ఆహ్వానిస్తున్నది. ప్రకృతి ఒడిలో బస చేసేందుకు అనువుగా నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టును పర్యాటకులకు అటవీశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్న కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టు
పైన్ తోటల్లో పూర్తి స్థాయి వసతులు
అందుబాటులోకి టెంట్లు, ట్రెక్కింగ్ పాత్
చింతపల్లి, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర కశ్మీర్ లంబసింగి సమీపంలోని కృష్ణాపురం పైన్ తోటల్లో అటవీశాఖ అధికారులు నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టు అతిథులను ఆహ్వానిస్తున్నది. ప్రకృతి ఒడిలో బస చేసేందుకు అనువుగా నిర్మించిన ఎకో టూరిజం ప్రాజెక్టును పర్యాటకులకు అటవీశాఖ అధికారులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
లంబసింగికి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో చింతపల్లి-నర్సీపట్నం ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న పైన్ తోటల్లో ఎకో టూరిజం ప్రాజెక్టు నిర్మించారు. లంబసింగి, కొత్తపల్లి జలపాతాలు, పాడేరు, అరకు ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు ఈ మార్గంలోనే ప్రయాణించాలి. దీంతో పర్యాటకులు బస చేసేందుకు ఎకో టూరిజం ప్రాజెక్టు అత్యంత అనువుగా ఉందని పర్యాటకులు అంటున్నారు. కృష్ణాపురం పైన్ తోటలు పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ మార్గంలో ప్రయాణించే వారు ఈ తోటల వద్ద ఆగి ఫొటోలు తీసుకొని, కొంత సమయం విశ్రాంతి తీసుకొని వెళుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన అటవీశాఖ ఉన్నతాధికారులు కృష్ణాపురం పైన్ తోటల వద్ద ఎకో టూరిజం ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. రూ.25 లక్షల నిధులతో అత్యంత సహజసిద్ధంగా ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు అనువుగా ఎకో టూరిజం ప్రాజెక్టును రూపొందించారు.
అందుబాటులో ఉన్న సదుపాయాలు
కృష్ణాపురం ఎకో టూరిజం ప్రాజెక్టులో పర్యాటకులకు అవసరమైన కనీస సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు బస చేసేందుకు పైన్ తోటల మధ్యలో 15 సింగిల్ టెంట్లు, 10 డబుల్ టెంట్లు ఏర్పాటు చేశారు. రన్నింగ్ వాటర్, అంతర్గత రోడ్లు, మరుగుదొడ్లు నిర్మించారు. మెయిన్ గేటు పూర్తిగా ఉడ్‌తో సుందరంగా తీర్చిదిద్దారు. ఎకో టూరిజం ప్రాజెక్టు లోపల వినోదం కోసం ఆర్చరీ, ఊయలలు ఏర్పాటు చేశారు. పర్యాటకులు వాకింగ్ చేసేందుకు నాలుగు కిలోమీటర్ల ట్రెక్కింగ్ పాత్ ఏర్పాటు చేశారు. పర్యాటకులు భోజనాలు, అల్పాహారం తీసుకునేందుకు అనువుగా వుడ్ టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఎకో టూరిజం లోపల, బయట ఆకర్షణీయమైన విద్యుత్ కాంతులతో అలంకరించారు.
ఏడాది పొడవునా సందర్శనకు అనువుగా..
ఎకో టూరిజం ప్రాజెక్టును పర్యాటకులు ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా తీర్చిదిద్దారు. స్థానికులు వన భోజనాలు చేసేందుకు అనువుగా కొంత విస్తీర్ణం కేటాయించారు. ఎకో టూరిజం ప్రాజెక్టు లోపల వివిధ రకాల పూల మొక్కలు, క్రోటాన్స్ పెంచుతున్నారు. అలాగే ఓపెన్ విందు, వినోద కార్యక్రమాలు నిర్వహించేందుకు అనువుగా ఆటవీశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఎకో టూరిజంలో విశాలమైన పార్కింగ్‌తో పాటు పర్యాటకుల భద్రత కోసం 24 గంటలు టాస్క్‌ఫోర్సు ఉద్యోగులు విధుల్లో ఉంటున్నారు.
Updated Date - Jan 14 , 2025 | 12:12 AM