కమ్మేసిన పొగమంచు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:34 AM
మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు పొగమంచు వీడలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. పొగమంచు వల్ల తీగ జాతి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

- ఉదయం 9.30 గంటల వరకు వీడని వైనం
- 15 రోజులుగా ఇదే పరిస్థితి
- ఉద్యాన పంటలు దెబ్బతింటాయని రైతుల్లో ఆందోళన
సబ్బవరం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): మండలంలో పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఆదివారం ఉదయం 9.30 గంటల వరకు పొగమంచు వీడలేదు. దీంతో వాహనాలు లైట్ల వెలుతురులో రాకపోకలు సాగించాయి. పొగమంచు వల్ల తీగ జాతి పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండలంలో పొగమంచు తీవ్రత తగ్గడం లేదు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మంచు ప్రభావం కొనసాగుతోంది. గత పదిహేను రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. పొగమంచు దట్టంగా కురుస్తుండడంతో ఉదయం వేళ సైతం ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనచోదకులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు వల్ల చిన్నారులు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ఇక ఉద్యాన పంటల్లో తీగ జాతి రకాలైన కాకర, పుచ్చ, బీర, ఆనపతో పాటు జీడి, జీడిమామిడి పూత పిందెపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మంచు వల్ల తీగ జాతి పంటల్లో ఆకులు, పూత మాడిపోతాయని చెబుతున్నారు.
దేవరాపల్లిలో...
దేవరాపల్లి: మండలంలో ఆదివారం ఉదయం 8.30 గంటల వరకు పొగమంచు వీడలేదు. రెండు రోజుల క్రితం రాత్రి వేళ వర్షం మాదిరిగా మంచు కురిసింది. ఆదివారం కూడా పొగమంచు దట్టంగా కురిసింది. దీని వల్ల మామిడి, జీడి, నువ్వులు పూత మంచుకు మాడిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:34 AM