బస్టాండ్, రైల్వేస్టేషన్ కిటకిట
ABN, Publish Date - Jan 13 , 2025 | 01:02 AM
సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో అనకాపల్లి రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా మారాయి. ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా అనకాపల్లిలో నివాసం ఉంటున్న వారిలో చాలా మంది సంక్రాంతి పండుగను సొంతూళ్లలో చేసుకోవడానికి ప్రయాణం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత ఊళ్లకు పయనం
ప్రయాణికులతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు
ప్రత్యేక సర్వీసులు నడిపిన ఆర్టీసీ
అనకాపల్లి టౌన్, జనవరి 12 (ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులతో అనకాపల్లి రైల్వేస్టేషన్, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా మారాయి. ఉద్యోగం, ఉపాధి, వ్యాపార రీత్యా అనకాపల్లిలో నివాసం ఉంటున్న వారిలో చాలా మంది సంక్రాంతి పండుగను సొంతూళ్లలో చేసుకోవడానికి ప్రయాణం కావడంతో రైళ్లు, బస్సులు కిటకిటలాడాయి. జన్మభూమి, సింహాద్రి, ప్రశాంతి, రత్నాచల్, మెయిల్, తిరుమల, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లలో సాధారణ బోగీల్లో చాలా మంది నిల్చుని ప్రయాణించాల్సి వచ్చింది. అదే విధంగా అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు చెందిన పలువురు ఉద్యోగ, ఉపాధి, ఉన్నత చదువుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విజయవాడ, కాకినాడ, రాజమహేంద్రవరం తదితర ప్రాంతాల్లో వుంటున్నారు. వీరు వివిధ రైళ్లు, బస్సుల్లో అనకాపల్లి చేరుకుని, ఇక్కడ నుంచి ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేటు వాహనాల్లో గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. కాగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అనకాపల్లి నుంచి విజయవాడకు రెండు, పాయకరావుపేటకు రెండు, రాజమహేంద్రవరం, అన్నవరం ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున అదనపు బస్సులు నడిపినట్టు పీటీడీ ఏడీఎం రవిచంద్ర తెలిపారు.
రవాణా శాఖ స్పెషల్ డ్రైవ్
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలు
నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు నిర్ధారణ
80 బస్సులపై కేసులు, రూ.14 లక్షలు జరిమానా
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల డిమాండ్‌ను ఆసరాగా తీసుకుని అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై జిల్లా రవాణా అధికారి జి.మనోహర్ ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆరు బృందాలను ఏర్పాటు చేసి జిల్లాలో పాయకరావుపేట నుంచి సబ్బవరం వరకు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి ప్రయాణికుల నుంచి ఎక్కువ చార్జీలు వసూలు చేస్తున్న పలు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఈ నెల పదో తేదీ నుంచి 12వ తేదీ వరకు 80 ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.14 లక్షలు జరిమానా విధించారు. ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తాయని ఆయన చెప్పారు.
Updated Date - Jan 13 , 2025 | 01:02 AM