పత్తాలేని పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ ప్రాజెక్టు

ABN, Publish Date - Apr 06 , 2025 | 01:06 AM

‘సముద్రం, తీరంలో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తారు.

పత్తాలేని పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ ప్రాజెక్టు
  • మూడేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం ఒప్పందం

  • సముద్ర తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్‌ చేసి షూస్‌, కళ్లద్దాలు తయారుచేయున్నట్టు ప్రకటన

  • రూ.16 వేల కోట్ల పెట్టుబడి, 20 వేల మందికి ఉద్యోగాలంటూ ప్రభుత్వ పెద్దల హడావుడి

  • ఇంతవరకూ అతీగతీలేని వైనం

  • ఆ సంస్థకు భూమి కేటాయించకపోవడమే కారణం

  • ప్రాజెక్టు లేనట్టేనని చెబుతున్న జీవీఎంసీ అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

‘సముద్రం, తీరంలో పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరిస్తారు. వాటిని రీసైక్లింగ్‌ చేసి స్పోర్ట్స్‌ షూస్‌, టీ షర్టులు, కళ్లద్దాలు తయారుచేస్తారు. విశాఖ కేంద్రంగా రూ.16 వేల కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటుచేస్తారు. 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు.’ అంటూ గత వైసీపీ ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్పారు. అమెరికాకు చెందిన ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థతో మూడేళ్ల కిందట ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారుచేసినట్టు చెప్పిన కళ్లద్దాలు పెట్టుకుని హడావిడి చేశారు. అయితే దాదాపు మూడేళ్లు గడిచిపోతున్నా ఆ సంస్థ పత్తాలేదు.

సముద్ర తీరంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పెరిగిపోతున్నాయి. అలల తాకిడికి లోపలకు వెళ్లే ప్లాస్టిక్‌ వ్యర్థాలను తినడం వల్ల చేపలతోపాటు ఇతర జీవరాశులు మృత్యువాతపడుతున్నాయి. దీనిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు ప్లాస్టిక్‌ వ్యర్థాలతో వివిధ రకాల వస్తువులను తయారుచేసే పరిశ్రమను ఏర్పాటుచేయిస్తున్నట్టు మూడేళ్ల క్రితం నాటి వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఆగస్టు 26న బీచ్‌రోడ్డులోని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ అనే సంస్థతో ఒప్పందం చేసుకుంది. రూ.16 వేల కోట్ల పెట్టుబడితో 20 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, అందుకోసం విశాఖ పరిసరాల్లో పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి హాజరయ్యారు. అదేరోజు భీమిలి నుంచి కోస్టల్‌ బ్యాటరీ వరకు తీరం పొడవునా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, వైసీపీ నేతలు, స్వచ్ఛంద సంస్థలు, నేవీ, స్టీల్‌ప్లాంట్‌, పోర్టు, కోస్ట్‌గార్డు ఉద్యోగులు సహా 22 వేల మందితో మెగా డ్రైవ్‌ చేపట్టి 75 టన్నుల వ్యర్థాలను సేకరించారు. పార్లే ఫర్‌ ది ఓషన్స్‌ సంస్థ తయారుచేసినట్టు పేర్కొంటూ ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన వస్తువులతో బీచ్‌రోడ్డులో ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు, అధికారులు నగరానికి తరలిరావడంతో వారందరికీ వసతి, భోజనం, రవాణా కోసం భారీగా ప్రజాధనం వెచ్చించారు. వేదికపైన జగన్మోహన్‌రెడ్డి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారుచేసిన కళ్లద్దాలను పెట్టుకుని ఫొటోలకు పోజులిచ్చారు. ప్రభుత్వ పెద్దల హడావిడి చూసి నగరానికి భారీ ప్రాజెక్టు వచ్చిందని, వేలాది మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయని సంతోషపడ్డారు. ఒప్పంద పత్రాలు మార్పిడి తర్వాత ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం మరిచిపోయింది. ‘పార్లే ఫర్‌ ది ఓషన్స్‌’ సంస్థ సీఈఓ సెరిల్‌గోచ్‌ పలుమార్లు అప్పటి ప్రభుత్వ పెద్దలను కలిసి ప్రాజెక్టుకు భూమి కేటాయించాలని కోరారు. వారి నుంచి కూడా ఎలాంటి స్పందన రాలేదు. ఒప్పంద ప్రతాలు మార్చుకుని మూడేళ్లు అవుతున్నాసరే ఆ ప్రాజెక్టు విషయంలో కనీసం ఒక్క అడుగు కూడా పడకపోవడం విశేషం. ప్రాజెక్టు గురించి జీవీఎంసీ అధికారుల వద్ద ప్రస్తావించగా దాదాపు మూడేళ్లవుతున్నా ఎలాంటి పురోగతి లేనందున ఒప్పందం రద్దయినట్టేనని అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 01:06 AM