రాకపోకలకు మార్గం సుగమం

ABN, Publish Date - Feb 10 , 2025 | 12:31 AM

బూదరాళ్ల పంచాయతీ గరిమండ- కన్నవరం గ్రామాల మధ్య ఎట్టకేలకు నాలుగు కిలో మీటర్లు మేర బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి కావడంతో పాటు బీటీ రోడ్డు కూడా నిర్మించడంతో పలు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాకపోకలకు మార్గం సుగమం
కూటమి ప్రభుత్వం వచ్చాక కల్వర్టు నిర్మించి బీటీ రోడ్డు వేసిన దృశ్యం

- గత వైసీపీ ప్రభుత్వంలో నిలిచిన గరిమండ- కన్నవరం రహదారి పనులు

- కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో బ్రేక్‌

- పలు గ్రామాల ప్రజల అవస్థలు

- సమస్యను వెలుగులోకి తెచ్చిన ‘ఆంధ్రజ్యోతి’

- స్పందించిన కూటమి ప్రభుత్వం

- పాత బిల్లులు మంజూరు చేయడంతో పాటు పనుల పూర్తికి చర్యలు

- కల్వర్టులు, రహదారుల నిర్మాణం పూర్తి కావడంతో గిరిజనుల హర్షం

కొయ్యూరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి):

బూదరాళ్ల పంచాయతీ గరిమండ- కన్నవరం గ్రామాల మధ్య ఎట్టకేలకు నాలుగు కిలో మీటర్లు మేర బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా వదిలేసిన కల్వర్టు నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి కావడంతో పాటు బీటీ రోడ్డు కూడా నిర్మించడంతో పలు గ్రామాల గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకంలో గరిమండ- కన్నవరం గ్రామాల మధ్య నాలుగు కొండవాగు ప్రవాహాలపై కల్వర్టుల నిర్మాణాలతో పాటు నాలుగు కిలో మీటర్ల మేర బీటీ రోడ్డు, అలాగే కన్నవరం, వంతమర్రి గ్రామాల వద్ద కొండ ప్రదేశంలో 600 మీటర్ల మేర సీసీ రోడ్డు నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయలు మంజూరైంది. అయితే ఈ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడంతో కల్వర్టులు అసంపూర్తిగా నిర్మించి పనులు మధ్యలో నిలిపివేశారు. దీంతో ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే నాలుగు గ్రామాల ప్రజలతో పాటు అదనంగా ఇదే పంచాయతీలో చేరిన నల్లబిల్లి, బొడ్డుమామిడి, బి.కొత్తవీధి, నేరెళ్ల బంధ, రాజులుపాడు, తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అప్పట్లో ఈ సమస్యను గ్రామ సర్పంచ్‌ సాగిన ముత్యాలమ్మ కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లగా కన్నవరం రెండు వీధుల మధ్య గల కల్వర్టు, కన్నవరం గ్రామం దాటాక గల కల్వర్టుకు అప్రోచ్‌ రోడ్డులు వేసి రవాణా పునరుద్ధరించారు తప్పితే ప్రధాన రహదారిలో గల కల్వర్టు పనులు చేపట్టలేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను ఇటీవల ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తేవడంతో కూటమి ప్రభుత్వం స్పందించింది. ఈ రహదారికి సంబంధించి పెండింగ్‌ బిల్లులను చెల్లించడమే కాకుండా ఈ రహదారిని తక్షణమే పూర్తి చేసేలా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభం నుంచి యుద్ధప్రాతిపదికన నాలుగు కిలో మీటర్లు మేర బీటీ రోడ్డు నిర్మాణం పూర్తయింది. అలాగే వంతమర్రి, కన్నవరం కొండ ప్రదేశాలలో సీసీ రోడ్డు నిర్మాణాలకు వీలుగా అవసరమైన మెటీరియల్‌ సిద్ధం మరో వారం రోజుల్లో సీసీ రోడ్డు నిర్మాణానికి వీలుగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం జేఈ రామకృష్ణ చర్యలు చేపట్టారు. కల్వర్టులు, రహదారుల నిర్మాణంతో తమకు రవాణా కష్టాలు తీరాయని పలు గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 10 , 2025 | 12:31 AM