రోడ్డు పనుల్లో నాణ్యతాలోపం

ABN, Publish Date - Apr 05 , 2025 | 12:46 AM

పట్టణంలోని బైపాస్‌ రోడ్డు మరమ్మతు పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొద్ది రోజులకే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. గోతులను మెటల్‌తో పూడ్చి, పైన తారు వేశారు. అయితే ఆరు వారాల్లోనే రాళ్లు లేచిపోయి గోతులు యథావిధిగా దర్శనమిస్తున్నారు.

రోడ్డు పనుల్లో నాణ్యతాలోపం
సైతారుపేట రోడ్డు జంక్షన్‌ వద్ద ప్యాచ్‌వర్క్‌ లేచిపోవడంతో బయటపడిన గొయ్యి

ఎలమంచిలి బైపాస్‌ రోడ్డులో ఆరు వారాలకే దెబ్బతిన్న ప్యాచ్‌ వర్క్‌

లేచిపోయిన రాళ్లు.. బయటపడిన గోతులు

ఎలమంచిలి, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని బైపాస్‌ రోడ్డు మరమ్మతు పనులపై అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో కొద్ది రోజులకే నాణ్యతా లోపాలు బయటపడుతున్నాయి. గోతులను మెటల్‌తో పూడ్చి, పైన తారు వేశారు. అయితే ఆరు వారాల్లోనే రాళ్లు లేచిపోయి గోతులు యథావిధిగా దర్శనమిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అన్ని రహదారుల మాదిరిగానే ఎలమంచిలి బైపాస్‌ రోడ్డు కూడా కనీస నిర్వహణ పనులకు నోచుకోక గోతులు ఏర్పడి అధ్వానంగా తయారైంది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రహదారులపై గోతులు పూడ్చి నిర్వహణ పనులు చేపట్టాలని పంచాయతీరాజ్‌, ఆర్‌అండ్‌బీ శాఖలను ఆదేశించింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు అంచనాలు తయారు చేసి ఎలమంచిలి బైపాస్‌ రోడ్డులో పెట్రోలు బంకు నుంచి సైతారుపేట రోడ్డు జంక్షన్‌ వరకు ఫిబ్రవరిలో మరమ్మతు పనులు చేయించారు. దీంతో గోతుల సమస్య తొలగిందని ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు ఆనందించారు. కానీ వీరి ఆనందం పట్టుమని పది రోజులు కూడా నిలవలేదు. ప్యాచ్‌ వర్క్‌ చేసిన చోట తారు లేయర్‌తోసహా మెటల్‌ లేచిపోయి గోతులు బయటపడుతున్నాయి. సాధారణంగా వర్షాకాలంలో తారు రోడ్లు పాడవుతుంటాయి. కానీ బైపాస్‌ రోడ్డుకు ప్యాచ్‌ వర్క్‌ చేసిన తరువాత ఒక్కసారి కూడా వర్షం కురవలేదు. అయినప్పటికీ ప్యాచ్‌ వర్క్‌ చేసినచోట తారు, రాళ్లు లేచిపోయి పరిస్థితి మళ్లీ మొదటికొస్తున్నది. పనుల్లో నాణ్యత లోపించడమే ఇందుకు కారణమని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలన్న ఉద్దేశంతోనే అధికారులు ఇలా వ్యవహరిస్తున్నట్టుగా వుందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Updated Date - Apr 05 , 2025 | 12:46 AM