నైపుణ్య గణనకు సన్నాహాలు
ABN, Publish Date - Jan 08 , 2025 | 12:42 AM
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తోంది.
నెలాఖరులో ప్రారంభం
ప్రభుత్వం నుంచి అధికారులకు అందిన సమాచారం
ఇప్పటికే శిక్షణ పూర్తిచేసుకున్న సిబ్బంది
నైపుణ్యం ప్రాతిపదికగా యువతకు ఉద్యోగ కల్పన
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చర్యలు
నోడల్ అధికారిగా వ్యవహరించనున్న జాయింట్ కలెక్టర్
విశాఖపట్నం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి):
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుకు కూటమి ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తోంది. ఇందులో భాగంగా యువతలోని నైపుణ్యాన్ని గుర్తించి, ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు, అవసరమైన వారికి నైపుణ్య శిక్షణ అందించే దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఈ నెలాఖరు నుంచి నైపుణ్య గణనకు ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్హతలున్నప్పటికీ, తగిన నైపుణ్యం లేకపోవడంతో ఉపాధి లభించడం లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గుర్తించారు. ఈ మేరకు వారికి నైపుణ్య శిక్షణ అందించేందుకు 2014లోనే స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్స్ ఏర్పాటుచేశారు. వాటి ద్వారా ఎంతోమంది తమ స్కిల్స్ మెరుగుపరచుకున్నారు. అయితే తాజాగా నైపుణ్య గణనకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. వీరికి వివిధ శాఖల అధికారులు సహకరిస్తారు. జిల్లాస్థాయిలో నైపుణ్య గణనను పర్యవేక్షించే బాధ్యతను జాయింట్ కలెక్టర్‌కు అప్పగిస్తూ నోడల్ అధికారిగా నియమించింది. ఈ నెలాఖరు నుంచి సెన్సస్ ప్రారంభించే అవకాశం ఉండడంతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేసుకోవాలని సమాచారం అందినట్టు చెబుతున్నారు. నైపుణ్య గణన చేపట్టేందుకు వీలుగా జిల్లాలోని 4,500 మంది సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. గ్రామ/వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటింటికీ వెళ్లి నైపుణ్య గణన చేపడతారు.
గణన చేపట్టేది ఇలా..
నైపుణ్య గణనను అత్యంత పకడ్బందీగా చేపట్టాలన్నది ప్రభుత్వ ధ్యేయం. ఇందులో భాగంగా సిబ్బంది కచ్చితంగా ప్రతి ఇంటికీ వెళ్లి అన్ని వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. కార్యాలయాల్లో కూర్చుని వివరాలు అప్‌లోడ్ చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా రెండు విధాలుగా నైపుణ్య గణన చేపట్టనున్నారు. మొదటిది సచివాలయ సిబ్బంది తమ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లి 15 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారి వివరాలను సేకరిస్తారు. చదువు (విద్యార్హత), ఉద్యోగం, జీతం, ఎటువంటి నైపుణ్యాలు కావాలనుకుంటున్నారు, ఇతర ఉద్యోగాలకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వాటి వివరాలను సేకరిస్తారు. రెండోది సెల్ఫ్ ఎన్యూమరేషన్. ఇందులో ఎవరికి వారే తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ మేరకు నైపుణ్య అనే యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది. స్కిల్ సెన్సస్ ప్రారంభమైన తరువాత ఈ యాప్ పనిచేస్తుందని అధికారులు చెబుతున్నారు.
శిక్షణ..ఉద్యోగ కల్పన
నైపుణ్య గణన ద్వారా సేకరించిన సమాచారాన్ని మదింపు చేసిన తరువాత వివరాలను కేటగిరీలుగా విభజిస్తారు. ఇంటర్, డిగ్రీ, ఇతర ఉన్నత కోర్సులు పూర్తిచేసిన వారి జాబితా, పదో తరగతి కంటే తక్కువ చదువుకున్న వారి జాబితా, పూర్తిగా చదువుకోని వారి జాబితాను తయారుచేస్తారు. అర్హతకు అనుగుణంగా నైపుణ్య శిక్షణ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారికి మెరుగైన అవకాశాలు దక్కించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటుంది. ఇటువంటి శిక్షణకు సదరు ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులు ఆసక్తి చూపుతారా?, లేదా? అనేది కూడా గణనలోనే గుర్తిస్తారు. రానున్న రోజుల్లో ఉద్యోగావకాశాలకు కేంద్ర బిందువుగా మారనున్న ఏఐ, డ్రోన్ టెక్నాలజీ, ఇతర సాంకేతిక అంశాల్లో శిక్షణ పొందేందుకు ముందుకువచ్చే వారి కోసం ప్రత్యేక సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనున్నది. నైపుణ్య గణనలో సేకరించిన సమాచారాన్ని నిరుద్యోగ భృతి వంటి పథకాల అమలుకు కూడా ఆధారంగా తీసుకుంటారని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Updated Date - Jan 08 , 2025 | 12:42 AM