దాకమర్రి లేఅవుట్‌లో ప్లాట్ల ధరల తగ్గింపు
ABN, Publish Date - Mar 18 , 2025 | 01:28 AM
రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగమనం, ధరలు భారీగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దాకమర్రి ఫార్చూన్ లేఅవుట్ విషయంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.

రూ.21 వేల నుంచి రూ.15,500కు...
వీఎంఆర్‌డీఏ చరిత్రలో ఇదే తొలిసారి
28 వరకు దరఖాస్తుల స్వీకరణ...31న ఈ వేలం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
రియల్ ఎస్టేట్ వ్యాపారం మందగమనం, ధరలు భారీగా ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దాకమర్రి ఫార్చూన్ లేఅవుట్ విషయంలో విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ గతంలో వేలం నిర్వహించినప్పుడు ఎంఐజీ ప్లాటు గజం రూ.21 వేలు చొప్పున అమ్ముడు పోయింది. ఆ ధరను ఇప్పుడు రూ.15,500కు తగ్గించి అమ్మకానికి పెట్టారు. వీఎంఆర్‌డీఏ చరిత్రలో ప్లాట్ల ధరలు తగ్గించడం ఇదే ప్రథమం.
విశాఖపట్నానికి 30 కిలోమీటర్ల దూరాన విజయనగరం జిల్లా శివార్లలోని దాకమర్రిలో రెండున్నర దశాబ్దాల క్రితం వెన్సార్ మిడోస్‌తో కలిసి జాయింట్ వెంచర్ కింద వుడా (నేడు వీఎంఆర్‌డీఏ) 98.84 ఎకరాల్లో లేఅవుట్ వేసింది. అందులో హెచ్‌ఐజీ 183, ఎంఐజీ 348, ఎల్‌ఐజీ 250, ఈడబ్ల్యుఎస్ 304 ప్లాట్లతో పాటు మౌలిక వసతుల కోసం మరో 14 ప్లాట్లు వేశారు. అన్నీ కలిసి మొత్తం 1,163 ప్లాట్లు కాగా అందులో వీఎంఆర్‌డీఏ వాటాగా 941 ప్లాట్లు తీసుకొని, డెవలపర్ వెన్సార్ మిడోస్‌కు 322 ప్లాట్లు ఇచ్చారు. అందులో మొదట హెచ్‌ఐజీ, ఎంఐజీ ప్లాట్ల విక్రయానికి వేలం పాట నిర్వహించారు. దాకమర్రి పరిసరాల్లో లేఅవుట్లు వేసిన ప్రైవేటు డెవలపర్లు వారి భూముల ధరలు పెంచుకోవడానికి వ్యూహాత్మకంగా వారి మనుషులను వేలం పాటకు పంపించి అధిక ధరలకు పాడించేశారు. అక్కడ అప్పట్లో ప్రైవేటు లేఅవుట్‌లో గజం ధర రూ.4 వేలు ఉండగా వుడా వేలంలో గజం రూ.16,500కు పాడేశారు. మంచి రేటు వచ్చిందని అధికారులు సంబర పడ్డారు. అయితే ఆ రేటుకు కేవలం రెండు ప్లాట్లే అమ్ముడుపోయాయి. వుడాలో ఓ నిబంధన ఉంది. ఒకసారి వేలం పాటలో ఏ ధరకు విక్రయిస్తారో ఆ తరువాత నిర్వహించిన వేలంలో దానినే అప్‌సెట్ ధరగా నిర్ణయించి, ఆ రేటు లేదా అంతకంటే ఎక్కువకు అమ్మాలి. ఆ రేటు కంటే తక్కువకు ఇవ్వడానికి వీల్లేదు. ఈ నేపథ్యంలో మిగిలిన ప్లాట్లను అమ్మడానికి మళ్లీ వుడా వేలం నిర్వహించగా రెండో సారి ప్రైవేటు డెవలపర్లు గజం రూ.21 వేలకు పాడేశారు. అప్పుడు ఒక్క ప్లాటే ఆ ధరకు వెళ్లింది. అదే సమయంలో దాకమర్రి పరిసరాల్లో వుడా రేటులో సగం ధరకే తాము ప్లాట్లు ఇస్తామంటూ ప్రైవేటు డెవలపర్లు వారి లేఅవుట్లలో గజం రూ.10వేలు చొప్పున అమ్ముకొని భారీగా లాభపడ్డారు. ఆ తరువాత వీఎంఆర్‌డీఏ సుమారుగా ఎనిమిది సార్లు దాకమర్రి ప్లాట్లు వేలానికి పెట్టింది. అప్‌సెట్ ధర గజం రూ.21 వేలు పెట్టడం వల్ల కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. కనీసం ఎవరూ దరఖాస్తు కూడా చేయలేదు. ఎందుకిలా జరుగుతోందని అధికారులు ఆరా తీశారు. అప్పుడు వాస్తవాలు తెలిశాయి. బయట మార్కెట్ ధర కంటే వీఎంఆర్‌డీఏ రేటు ఎక్కువగా ఉందని, ఆ రేటు ఉన్నంత కాలం ఎవరూ ముందుకు రారని తెలుసుకొని దానిని తగ్గించడానికి చర్యలు చేపట్టారు.
రెండు నెలల కసరత్తు
వీఎంఆర్‌డీఏ నచ్చినట్టు రేట్లు తగ్గించడం కుదరదు కాబట్టి దీనిపై నిర్ణయం కోసం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇక్కడి కమిషనర్ విశ్వనాథన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి మార్కెట్ విలువ, బయట అమ్మకం ధరలు తెప్పించి, పరిస్థితిని వివరిస్తూ లేఖ రాశారు. దాంతో ధర నిర్ణయానికి కమిటీని వేశారు. జీవీఎంసీ కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్, వీఎంఆర్‌డీఏ కమిషనర్ ఇలా అంతా కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎంత వరకు తగ్గించవచ్చునో సూచిస్తూ నివేదిక పంపారు. దాంతో గజం రూ.21 వేలు ఉన్న ధరను రూ.15,500కు విక్రయించాల్సిందిగా ఆదేశాలు రావడంతో ఈ నెల మొదటివారంలో వీఎంఆర్‌డీఏ ప్రకటన జారీచేసింది. హెచ్‌ఐజీ ప్లాట్లు 30 వేలానికి పెట్టింది. వాటి అప్‌సెట్ ధర గజం రూ.15,500గా నిర్ణయించింది. ఈ నెల 28 వరకూ దరఖాస్తులు స్వీకరిస్తుంది. 31న వేలం నిర్వహిస్తుంది.
Updated Date - Mar 18 , 2025 | 01:28 AM