ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంటర్‌లో సంస్కరణలు మంచివే, కానీ...

ABN, Publish Date - Jan 11 , 2025 | 12:57 AM

ఇంటర్మీడియట్‌ పరీక్షలలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.

  • ద్వితీయ సంవత్సరంలోనే పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచనపై భిన్నాభిప్రాయం

  • పిల్లలపై ఒత్తిడి తగ్గుతుందన్న కొందరు అధ్యాపకులు

  • ప్రభుత్వ కళాశాలల్లో ఇబ్బంది వస్తుందంటున్న మరికొందరు

  • రెండేళ్లకు ఒకసారి పరీక్షలంటే చదువులు అటకెక్కుతాయని ఆందోళన

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

ఇంటర్మీడియట్‌ పరీక్షలలో సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ విషయంలో ఏకపక్షంగా కాకుండా ప్రజాభిప్రాయం సేకరించి, అందుకు అనుగుణంగా ముందుకువెళ్లాలని నిర్ణయించింది. ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చినట్టయితే...వచ్చే విద్యా సంవత్సరం అంటే 2025-26 నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు పబ్లిక్‌ పరీక్షలు ఉండవు. ఆ మరుసటి విద్యా సంవత్సరం (2026-27)లో అంటే ద్వితీయ సంవత్సరంలో మాత్రమే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు.

కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) ‘ప్లస్‌ 2’లో రెండో ఏడాదిలోనే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహిస్తుంది. ఈ విధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని, ఎక్కువ సమయం పోటీ పరీక్షలకు కేటాయించడానికి అవకాశం ఉంటుందని కొందరు అధ్యాపకులు అభిప్రాయపడ్డారు. అయితే ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే విద్యార్థులకు కొంత ఇబ్బంది వస్తుందని మరో లెక్చరర్‌ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఎక్కువ మంది పరీక్షలకు కొద్దిరోజుల ముందే పుస్తకాలు తీస్తారని, అటువంటిది రెండేళ్లపాటు పరీక్షలు ఉండవంటే కొంత కష్టమేనని, ఈ విషయంలో తల్లిదండ్రులు చొరవ తీసుకోకపోతే ఇబ్బందులు వస్తాయని హెచ్చరించారు.

ఉమ్మడి ఏపీలోనే 2012-13లో సీబీఎస్‌ఈ సిలబస్‌కు అనుగుణంగా ఇంటర్‌ పుస్తకాలు మార్చారు. పరీక్షల విధానం మాత్రం ముఖ్యంగా ప్రశ్నపత్రాల తయారీ పూర్తిగా రాష్ట్ర విద్యా శాఖ ఆదేశాలకు లోబడే జరుగుతుంది. అయితే జాతీయ స్థాయిలో కేంద్రం అమలుచేస్తున్న నూతన విద్యా విధానం అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. అదే విఽధానం ఏపీలో వచ్చే ఏడాది నుంచి ప్రవేశపెట్టేందుకు సంస్కరణలు అమలుచేస్తున్నారు. కొత్త విధానం వల్ల ప్రశ్నపత్రంలో సంక్షిప్త ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. నూతన విధానం వల్ల పిల్లలపై భారం తగ్గుతుందని నారాయణ విద్యా సంస్థల ఏజీఎం రామలింగేశ్వరరావు అన్నారు.

రెండేళ్లకు ఒకసారి పరీక్షలు వల్ల కొంతమేర ఇబ్బందే..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే పిల్లలకు రెండేళ్లకొకసారి పరీక్షల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయనే వాదనను ప్రభుత్వ లెక్చరర్లు వినిపిస్తున్నారు. ఏటా పరీక్షలంటేనే కొందరు పిల్లలు చదవడం లేదని, పరీక్షలకు వారం, పది రోజుల ముందు పుస్తకాలు తీస్తుంటారని గుర్తుచేశారు. అటువంటిది రెండో ఏడాది చివరిలో పరీక్షలు రాయడానికి ఇటువంటి విద్యార్థులు ఇబ్బంది పడతారంటున్నారు. పిల్లలపై ఒత్తిడి తగ్గించడం మంచిదేకానీ ముందుగా వారిలో కనీస విద్యా ప్రమాణాలు ఉండేలా పాఠశాల విద్యా శాఖలో సంస్కరణలు అమలుచేసి, తరువాత ఇంటర్‌లో సంస్కరణలు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు.

తెలుగు, హిందీ, సంస్కృతం సబ్జెక్టులకు ముప్పు?

ఇంటర్‌లో సంస్కరణల వల్ల లాంగ్వేజస్‌కు కొంత ఇబ్బంది వస్తోందని భాషా అధ్యాపకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఇంగ్లీషు యథావిధిగా ఉంటుంది. రెండో లాంగ్వేజ్‌గా ఏపీలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో తెలుగు, ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంవత్సరాల్లో సంస్కృతం, అక్కడక్కడా హిందీ తీసుకుంటున్నారు. వచ్చే ఏడాది నుంచి అమలుచేయనున్న సంస్కరణల మేరకు సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద తెలుగు/సంస్కృతం/హిందీలే కాకుండా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌...ఇలా మరికొన్ని సబ్జెక్టులను ఆప్షన్‌గా తీసుకోవచ్చు. అదే జరిగితే కళాశాలల్లో తెలుగు/సంస్కతం/హిందీ చదివే పిల్లల సంఖ్య తగ్గిపోతుందని తద్వారా తమ పోస్టులకు ముప్పు ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు.

సంస్కరణలు మంచివే

మురళీధర్‌, ఆర్‌ఐవో, విశాఖపట్నం

ప్రస్తుతం ఇంటర్‌లో ప్రథమ ఏడాదిలో ఐదు పేపర్లు, రెండో సంవత్సరంలో ఐదు పేపర్లు ఉన్నాయి. ప్రతి సబ్జెక్టుకు 100 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. సైన్స్‌ సబ్జెక్టులకు సంబంధించి ద్వితీయ ఏడాదిలో 30 మార్కులకు ప్రాక్టికల్స్‌ ఉన్నాయి. నూతన విఽధానం వల్ల ప్రథమ ఏడాది పరీక్షలు ఉండవు. ద్వితీయ ఏడాది ఐదు సబ్జెక్టులకు సంబంధించి 500 మార్కులకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సబ్జెక్టులో 80 మార్కులకు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్‌ అసెస్‌మెంట్‌ ఉంటుంది. ఈ విఽధానం వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుంది.

Updated Date - Jan 11 , 2025 | 12:57 AM