అరకులోయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు

ABN, Publish Date - Mar 21 , 2025 | 11:35 PM

అరకులోయ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ను ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర కోరారు.

అరకులోయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు
కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌తో మాట్లాడుతున్న దొరదొర, టీడీపీ నాయకులు శెట్టి బాబూరావు, దాసుబాబు

జిల్లా కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ను కోరిన

ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర

అసంపూర్తి పనులు పూర్తిపై నివేదిక

సానుకూలంగా స్పందించిన కలెక్టర్‌

అరకులోయ, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): అరకులోయ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కలెక్టర్‌ దినేశ్‌కుమార్‌ను ఆర్టీసీ విజయనగరం రీజియన్‌ చైర్మన్‌ దొన్నుదొర కోరారు. శుక్రవారం పాడేరులో కలెక్టర్‌ను టీడీపీ అరకులోయ మండల నాయకుడు శెట్టి బాబూరావు, పెదలబుడు సర్పంచ్‌ పెట్టెలి దాసుబాబుతో కలిసి ఆయన కలిశారు. ఈ సందర్భంగా అరకులోయ నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధులపై నివేదికను కలెక్టర్‌కు అందించినట్టు దొన్నుదొర తెలిపారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రారంభించి నిధులు లేక నిలిచిపోయిన వంతెనలు, రహదారులు, అంగన్‌వాడీ, పాఠశాలల భవనాలను పూర్తి చేయాలని కోరారు. అదేవిధంగా ప్రముఖ పర్యాటక కేంద్రం అరకులోయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలన్నారు. అరకులోయ సుందరీకరణకు మరిన్ని నిధులు మంజూరు చేయాలని, పెదలబుడు పంచాయతీ పరిధిలోని లింబగుడ, నువ్వగుడ గ్రామాల్లోని సాగు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు. పంచాయతీ పరిధిలోని రెండు గ్రామాల్లో రైతులకు పట్టాలు పంపిణీ జరగలేదన్నారు. చెక్‌డాంలు, పంట కాలువలకు నిధులు మంజూరు చేయాలని దొన్నుదొర విజ్ఞప్తి చేశారు. ఇందుకు కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారన్నారు.

Updated Date - Mar 21 , 2025 | 11:35 PM