విద్యార్థులు అర్ధాకలి

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:03 AM

విద్యార్థులకు సరిపడ మధ్యాహ్న భోజనం వండలేదు. పిల్లలు భోజనం చేస్తుండగానే అన్నం అయిపోయింది. దీంతో పక్క పాఠశాల నుంచి అన్నం తీసుకువచ్చి వడ్డించారు. అప్పటి వరకు విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని నిరీక్షించాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులకే కోడిగుడ్లు పెట్టారు. ఇదంతా పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో వున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు సాక్షిగా జరిగింది. దీంతో భోజన పథకం నిర్వాహకులు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

విద్యార్థులు అర్ధాకలి
జడ్పీ ఉన్నత పాఠశాలలో 87 మంది విద్యార్థులకు వండిన అన్నం, సాంబారు, కోడిగుడ్డు కూర ఇవే!

ఎలమంచిలి జడ్పీ హైస్కూల్లో అరకొరగా భోజనం

కొంతమందికి వడ్డించగానే అయిపోయిన అన్నం

కోడిగుడ్డు కూరదీ అదే పరిస్థితి

ఆహార సలహా కమిషన్‌ సభ్యురాలు దేవి సాక్షిగా బయటపడిన నిర్వాకం

పక్కనే ఉన్న మరో పాఠశాలలో భోజనం వండి వడ్డించిన వైనం

భోజన పథకం నిర్వాహకులతోపాటు హెచ్‌ఎం, టీచర్లపై ఆగ్రహం

ముద్దగా అన్నం, ఉడకని బంగాళాదుంపల కూర

కమిషన్‌ సభ్యురాలికి విద్యార్థులు ఫిర్యాదు

ఎలమంచిలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి):

విద్యార్థులకు సరిపడ మధ్యాహ్న భోజనం వండలేదు. పిల్లలు భోజనం చేస్తుండగానే అన్నం అయిపోయింది. దీంతో పక్క పాఠశాల నుంచి అన్నం తీసుకువచ్చి వడ్డించారు. అప్పటి వరకు విద్యార్థులు ప్లేట్లు పట్టుకుని నిరీక్షించాల్సి వచ్చింది. కొంతమంది విద్యార్థులకే కోడిగుడ్లు పెట్టారు. ఇదంతా పట్టణంలోని రైల్వే స్టేషన్‌ రోడ్డులో వున్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర ఆహార కమిషన్‌ సభ్యురాలు సాక్షిగా జరిగింది. దీంతో భోజన పథకం నిర్వాహకులు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయుల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.

రాష్ట్ర ఆహార సలహా కమిషన్‌ సభ్యురాలు జి.దేవి రెండు రోజుల నుంచి జిల్లాలో పర్యటిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం ఎలమంచిలి పట్టణంలోని కొత్తపేట ఉన్నత పాఠశాలను సందర్శించారు. మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరును పరిశీలించిన సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రైల్వే స్టేషన్‌ రోడ్డులో ఒకే ప్రాంగణంలో వున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ముందుగా జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనం వంటకాలను రుచి చూశారు. తరువాత తరగతి గదుల్లోకి వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను ఆరా తీశారు. అన్నం ముద్దలా వుంటున్నదని, బంగాళాదుంపలు సరిగా ఉడకడం లేదని, దీంతో భోజనం తినలేకపోతున్నామని, కోడిగుడ్లు అందరికీ పెట్టడంలేదని పలువురు విద్యార్థులు చెప్పారు. అనంతరం విద్యార్థులు భోజనాలకు వెళ్లారు. జడ్పీ ఉన్నత పాఠశాలలో 87 మంది విద్యార్థులకుగాను కొంతమందికి భోజనం వడ్డించిన తరువాత అన్నం, కోడిగుడ్లు అయిపోయాయి. పక్కనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో అప్పటికప్పుడు భోజన పథకం నిర్వాహకులు అన్నం, కూర వండి సుమారు అర గంట తరువాత విద్యార్థులకు భోజనం పెట్టారు. ఇదంతా గమనిస్తున్న ఆహార కమిషన్‌ సభ్యురాలు దేవి.. సంబంధిత భోజన పథకం నిర్వాహకులు, హెచ్‌ఎం, ఉపాధ్యాయులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విద్యార్థులకు రోజూ ఇలాగే భోజనం పెడుతున్నారా? అంటూ ఆగ్రహంతో ప్రశ్నించారు. భోజన పథకం నిర్వాహకులు, ఉపాధ్యాయులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో ఆమె మండిపడ్డారు. రోజూ విద్యార్థులకు వడ్డించే భోజనాన్ని రుచిచూడాల్సి బాధ్యత ఉపాధ్యాయులపై వుందని, కానీ ఇక్కడ ఆ విధంగా జరగడం లేదని ఆమె అభిప్రాయపడ్డారు. ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. అనంతరం భోజన పథకం స్టోర్‌ రూమ్‌ను పరిశీలించారు. బీరువాను తెరిపించి చూడగా రెండు ట్రేలలో కోడిగుడ్లు కనిపించాయి. విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టకుండా ఇక్కడ దాచారేమిటని ఆమె ప్రశ్నించగా, భోజన పథకం నిర్వాహకుల నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. జడ్పీ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ తీరుపై ప్రభుత్వానికి నివేదిస్తానని ఆహార కమిషన్‌ సభ్యురాలు దేవి చెప్పారు. ఆమె వెంట జిల్లా పౌరసరఫరాల అధికారి కేవీఎల్‌ఎన్‌ మూర్తి, పౌరసరఫరాల జిల్లా మేనేజరు జయంతి, ఎంఈవో అరుణ్‌కుమార్‌, తదితరులు వున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:03 AM