ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంట పండింది!

ABN, Publish Date - Jan 07 , 2025 | 01:49 AM

మండలంలో ఖరీఫ్‌లో వరిసాగు చేసిన రైతులకు పంట పండింది. ముఖ్యంగా ఎంటీయూ 1064 రకాన్ని వేసిన రైతులకు ఊహించని ధాన్యం దిగుబడులు వచ్చాయి.

  • ఊహించని ధాన్యం దిగుబడితో అన్నదాతలు ఆనందం

  • ఎకరాకు 35-40 బస్తాలు..

  • సాధారణంగా 25-30 బస్తాల దిగుబడి

  • ప్రకృతి సహకరించడమే కారణమంటున్న రైతులు

  • ఖర్చులు పోను ఎకరాకు రూ.30 వేల వరకు మిగులు

గొలుగొండ, జనవరి 6 (ఆంధ్రజ్యోతి):

మండలంలో ఖరీఫ్‌లో వరిసాగు చేసిన రైతులకు పంట పండింది. ముఖ్యంగా ఎంటీయూ 1064 రకాన్ని వేసిన రైతులకు ఊహించని ధాన్యం దిగుబడులు వచ్చాయి. సాధారణంగా ఎకరాకు 25-30 బస్తాల (75 కిలోల చొప్పున) ధాన్యం పండుతుంది. కానీ ఖరీఫ్‌లో ఎక్కువ మంది రైతులకు 35 నుంచి 40 బస్తాల వరకు ధాన్యం దిగుబడి వచ్చింది. ఖర్చులు పోను రూ.30 వేల వరకు మిగిలాయని చెబుతున్నారు. నారుమడిలో విత్తనాలు చల్లడం నుంచి పంట నూర్చే వరకు అన్ని వేళలా ప్రకృతి సహకరించడమే కారణమని అంటున్నారు.

గొలుగొండ మండలంలో గత ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు మూడు వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ఎంటీయూ 1064, ఎంటీయూ 1224, ఆర్‌జీఎల్‌ 2537 (శ్రీకాకుళం సన్నాలు) వంటి రకాలను వేశారు. ఎంటీయూ 1064 రకం తెగుళ్లను తట్టుకుని, అధిక దిగుబడి ఇస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఎక్కువ మంది రైతులు ఈ రకం వరినే సాగు చేశారు. రిజర్వాయర్లు లేకపోవడంతో చెరువులు, గెడ్డలు, వాగుల నీరే ఆధారం. గత ఏడాది జూలై నుంచి నవంబరు వరకు మండలంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. వరి సాగు చేపట్టిన రైతులకు ఈ వర్షపాతం బాగా అనుకూలించింది. జూలైలో నారుమడులు పోసి, ఆగస్టులో నాట్లు వేశారు. పంట కాలం సుమారు 120 రోజులు. డిసెంబరు మొదటి వారం నుంచి వరి కోతలు మొదలుపెట్టారు. ఈ సమయంలో బంగాళాఖాతంలో అల్పపీడనాలు, వాయుగుండాలు ఏర్పడినప్పటికీ గొలుగొండ మండలంలో అంతగా ప్రభావం చూపలేదు. దీంతో వరి కోతలు, కుప్పలు, నూర్పు పనులు సాఫీగా సాగాయి. వరి కోత సమయంలోనే పంట బాగా పండిందన్న విషయం రైతులకు అర్థమైంది. నూర్పుల తరువాత ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు అవుతున్నాయి. ఎంటీయూ 1064 రకం ఎకరాకు 25 నుంచి 30 బస్తాల ధాన్యం దిగుబడి వస్తుంది. ఈసారి వాతావరణం అన్ని విధాలా అనుకూలించడంతో మరో పది నుంచి పదిహేను బస్తాలు అధికంగా దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచన మేరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, వర్మీ కంపోస్టు, పశువుల గెత్తాన్ని అధికంగా వేసినట్టు చెప్పారు. దుక్కి దున్నడం నుంచి వరి పంట నూర్పు వరుకు ఎకరాకు రూ.30-35 వేలు ఖర్చు అయ్యింది. బస్తా ధాన్యం (నికరంగా 75 కిలోలు) రూ.1,570కి విక్రయించారు. దీంతో ఎకరాకు రూ.25-30 వేలు మిగిలాయని చెబుతున్నారు.

ఎకరా 20 సెంట్లలో 52 బస్తాల దిగుబడి

అల్లంకి నూకరాజు, పాతమల్లంపేట

నేను ఎకరాల 20 సెంట్ల భూమిని కౌలుకు తీసుకుని ఎంటీయూ 1064 రకం వరి వేశాను. విత్తనాలు వేసినప్పటికీ నుంచి పంట పండే వరకు నీరు అందుబాటులో వుంది. తెగుళ్లు సోకలేదు. మొత్తం మీద పెట్టుబడి, కూలి ఖర్చులు కలిపి రూ.45 వేల వరకు అయ్యాయి. గత నెలలో పంట నూర్చగా 52 బస్తాల దిగుబడి వచ్చింది. బస్తా రూ.1,570కి విక్రయించాను. పెట్టుబడిపోను రూ.35 వేలకుపైగా మిగిలాయి. చాలా సంతోషంగా వుంది.

Updated Date - Jan 07 , 2025 | 01:49 AM