వెలుగు ఆరిపోతోంది!

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:04 AM

మహిళల జీవితాల్లో వెలుగులు నింపే కార్యాలయానికే వెలుగు కొరవడింది. చోడవరంలోని వెలుగు కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో వుంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

వెలుగు ఆరిపోతోంది!
అధ్వానంగా ఉన్న వెలుగు కార్యాలయ భవనం

శిథిలావస్థలో కార్యాలయ భవనం

బీటలు వారిన కాంక్రీట్‌ పిల్లర్లు, గోడలు

శ్లాబ్‌ పెచ్చులూడిపోయి బయటకు కనిపిస్తున్న ఇనుప ఊచలు

ఎప్పుడు కూలిపోతుందోనని ఉద్యోగులు ఆందోళన

బిక్కుబిక్కుమంటూ విధుల నిర్వహణ

చోడవరం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): మహిళల జీవితాల్లో వెలుగులు నింపే కార్యాలయానికే వెలుగు కొరవడింది. చోడవరంలోని వెలుగు కార్యాలయ భవనం శిఽథిలావస్థకు చేరి, ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితిలో వుంది. దీంతో ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహిస్తున్నారు.

చోడవరం నుంచి అంకుపాలెం వెళ్లే మార్గంలో డీఆర్‌డీఏ వెలుగు కార్యాలయం వుంది. రెండు అంతస్థుల్లో వున్న ఈ భవనాన్ని సుమారు రెండున్నర దశాబ్దాల క్రితం నిర్మించారు. అయితే పనుల్లో నాణ్యత లోపించడంతోపాటు చిన్నపాటి మరమ్మతులు సైతం చేయలేదు. దీంతో శ్లాబ్‌ పెచ్చులు ఊడిపోయి ఇనుప ఊచలు బయటకు కనిపిస్తున్నాయి. గోడలతోపాటు కాంక్రీట్‌ పిల్లర్లు సైతం బీటలు వారాయి. గోడల ప్లాస్టరింగ్‌ పెచ్చులు ఊడిపోతున్నాయి. పై అంతస్థు ఇప్పటికే పూర్తిగా దెబ్బతినగా, కింద అంతస్థు పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే వుంది. దీంతో ఉద్యోగులు, వివిధ పనుల నిమిత్తం వచ్చే డ్వాక్రా మహిళలు భయాందోళన చెందుతున్నారు. వెలుగు కార్యాలయం పక్కనే ఉన్న ఫ్యాషన్‌ టెక్నాలజీ భవనం చుట్టూ తుప్పలు పెరిగి కార్యాలయంలోకి పాములు విషకీటకాలు వస్తున్నట్టు ఉద్యోగులు చెబుతున్నారు. దీనికితోడు కార్యాలయానికి ఆనుకుని ఆర్టీసీ కాంప్లెక్స్‌ పాత చెరువు నుంచి భరించలేదని దుర్గధం వెలువడుతున్నది. శిథిలమైన భవనంలో ఒకపక్క భయపడుతూ, మరోపక్క దుర్గంధం భరిస్తూ విధులు నిర్వహించవలసి వస్తున్నదని ఉద్యోగులు వాపోతున్నారు.

అందుబాటులోకి రాని నూతన భవనం

వెలుగు కార్యాలయానికి ఏడేళ్ల క్రితం స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో స్ర్తీశక్తి భవనం నిర్మించారు. అయితే భారీ వర్షాలతో తహసీల్దార్‌ కార్యాలయ భవనం పూర్తిగా దెబ్బతినడంతో, వెలుగు కార్యాలయం కోసం నిర్మించిన భవనంలో రెవెన్యూ కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు రెవెన్యూ కార్యాలయం కోసం ఆరేళ్ల క్రితం చేపట్టిన నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండిపోవడంతో స్ర్తీశక్తి భవనాన్ని వెలుగు శాఖకు అప్పగించడంలేదు. రెవెన్యూ కార్యాలయం భవన నిర్మాణం పూర్తయితే తప్ప వెలుగు స్త్రీ శక్తి భవనానికి విముక్తి కలిగేలేదు. ప్రస్తుతం ఉన్న వెలుగు భవనం అంతవరకు వుంటుందా అన్న సందేహం వ్యక్తం అవుతున్నది. ఇటీవల మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు, రెవెన్యూ కార్యాలయ భవన నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, త్వరగా పనులు పూర్తి చేయించి వెలుగు కార్యాలయానికి సొంత భవనం అప్పగిస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ భవనం ఎప్పుడు పూర్తవుతుందో, స్ర్తీశక్తి భవనం తమకు ఎప్పుడు అప్పగిస్తారో అనివెలుగు ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:04 AM