ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వల
ABN, Publish Date - Jan 14 , 2025 | 12:10 AM
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను దళారులు ప్రలోభపెడుతున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్లు చేసి ఆశ చూపుతున్నారు. వివిధ క్యాడర్లలో 244 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగి నిరుద్యోగులకు వల విసురుతున్నారు.
మెడికల్ కాలేజీలో పోస్టులు ఇప్పిస్తామని అభ్యర్థులకు ఫోన్లు చేసి మభ్యపెడుతున్న దళారులు
పోస్టింగ్ ఇచ్చేందుకు క్యాడర్‌ను బట్టి రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షలు వరకు వసూలుకు ప్రయత్నాలు
ఆలస్యమైతే అవకాశం పోతుందంటూ హడావిడి
అటువంటి వాటిని నమ్మవద్దని కాలేజీ ప్రిన్సిపాల్ సూచన
(పాడేరు- ఆంధ్రజ్యోతి)
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను దళారులు ప్రలోభపెడుతున్నారు. దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ఫోన్లు చేసి ఆశ చూపుతున్నారు. వివిధ క్యాడర్లలో 244 పోస్టులకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఇదే అదనుగా దళారులు రంగంలోకి దిగి నిరుద్యోగులకు వల విసురుతున్నారు.
స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని పారా మెడికల్, సపోర్టింగ్ స్టా్‌ఫ్ పోస్టులు కలిసి మొత్తం 244 పోస్టులకు 15,512 దరఖాస్తులను అభ్యర్థులు సమర్పించారు. ఆయా దరఖాస్తుల స్వీకరణ గడువు ఈ నెల 10వ తేదీతో ముగిసింది. 11న రెండో శనివారం, 12న ఆదివారం, 13, 14, 15 తేదీల్లో భోగి, సంక్రాంతి, కనుమ వరుస సెలవులు. దీంతో అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తులను సైతం మెడికల్ కాలేజీ యాజమాన్యం ఈ నెల 16 తరువాత గాని పరిశీలించే పరిస్థితి లేదు. అయితే ఈ నెల 11వ తేదీ నుంచే ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు ఫోన్లు చేస్తూ... తాము మెడికల్ కాలేజీలో పోస్టులు ఇప్పిస్తామని, అందుకు ముందుగా డబ్బులు ఇవ్వాలని దళారులు ప్రలోభ పెడుతున్నారు.
దందాకు యత్నిస్తున్న తీరిదీ..
ఎక్కడైనా ఉద్యోగాలిప్పిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు దందాలు చేయడం చూస్తుంటాం. కానీ ప్రస్తుతం స్థానిక మెడికల్ కాలేజీలోని పోస్టులకు సంబంధించిన దందా అందుకు భిన్నంగా ఎక్కడిక్కడే గ్రామాల్లోనే మొదలు కావడం విశేషం. ప్రస్తుతం గ్రామాల్లో సైతం రాజకీయ చైతన్యం రావడంతో అధికారంలో ఉన్న పార్టీలకు చెందిన నేతలతో అక్కడున్న వారికి పరిచయలు ఉండడం సహజం. దీంతో ఇదే అదనుగా తమ ప్రాంతాల్లోని మెడికల్ కాలేజీ పోస్టులకు దరఖాస్తులు చేసిన అభ్యర్థులకు ఫోన్లు చేసి, తమకు ఆ నేత తెలుసునని, ఈ నేత తెలుసునని అభ్యర్థులకు చెబుతూ .... ముందుగా (లక్ష్లల్లోనే) డబ్బులు ఇస్తే ఆయా పోస్టులను రిజర్వు చేసుకోవచ్చని ఆశ చూపుతున్నారు. ఆలస్యమైతే ఇతరులకు ఈ అవకాశం ఇస్తామని నిరుద్యోగులను సున్నితంగా హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఏం చేయాలో తెలియని పలువురు నిరుద్యోగులు తమకు అవకాశం ఉన్న వ్యక్తులతో ఈ విషయాన్ని ప్రస్తావించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నిరుద్యోగులకు దానిపై ఆలోచించే అవకాశం సైతం ఇవ్వకుండా పోస్టు ఇప్పిస్తామని, వీలైతే మొత్తం సొమ్ము లేదా అడ్వాన్సుగానైనా కొంత సొమ్ము ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. క్యాడర్‌ను బట్టి రూ.లక్షన్నర నుంచి రూ.4 లక్షల వరకు ఆయా పోస్టుల కోసం వసూలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కలెక్టర్, ఎస్‌పీ దృష్టి సారించకుంటే నష్టమే..
మెడికల్ కాలేజీలో పోస్టులను ఇప్పిస్తామని పలువురు చాపకింద నీరులా సాగిస్తున్న దందాకు ఆదిలోనే అడ్డుకట్ట వేయకుంటే నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని పలువురు అంటున్నారు. ఆయా పోస్టుల విషయంలో గుట్టుగా సాగుతున్న దందాపై కలెక్టర్ దినేశ్‌కుమార్, ఎస్‌పీ అమిత్‌బర్ధార్ ప్రత్యేక దృష్టి సారించడంతో పాటు నిరుద్యోగులను అప్రమత్తం చేయకుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చే ప్రమాదముంది. ఉద్యోగాల భర్తీకి చేపట్టే ప్రక్రియ, ఈ క్రమంలో నిరుద్యోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించడంతోపాటు దందాకు యత్నిస్తున్న వ్యక్తులను చట్టపరంగా శిక్షించే అవకాశాలపై అధికారులు దృష్టి పెట్టాలను నిరుద్యోగులు కోరుతున్నారు.
Updated Date - Jan 14 , 2025 | 12:10 AM