కల్యాణం ఆలస్యం
ABN , Publish Date - Apr 06 , 2025 | 01:05 AM
నగరానికి చెందిన రాజేశ్ ఎనిమిదేళ్ల కిందట బీఎస్సీ పూర్తిచేశాడు.

పెరుగుతున్న పెళ్లికాని ప్రసాద్‌లు
30 ఏళ్లు దాటినా వివాహం కాని యువకులు ఎందరో
ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా కుదరని సంబంధాలు
ఉద్యోగం, సంపాదన ఉన్నా అమ్మాయి దొరకని పరిస్థితి
వయసు దాటిపోతుండడంతో తల్లిదండ్రుల్లో ఆందోళన
అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల ఆలోచనల్లో మార్పే కారణం
ప్రభుత్వ ఉద్యోగులు, భారీ వేతనాలతో కూడిన ప్రైవేటు ఉద్యోగులకు అమ్మాయిలు, వారి కుటుంబ సభ్యుల ప్రాధాన్యం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
నగరానికి చెందిన రాజేశ్ ఎనిమిదేళ్ల కిందట బీఎస్సీ పూర్తిచేశాడు. ప్రముఖ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. నెలకు రూ.50 వేలకుపైగానే వేతనం వస్తోంది. గత మూడేళ్లుగా తల్లిదండ్రులు పెళ్లి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇప్పటివరకూ సంబంధం కుదరలేదు.
అనకాపల్లి ప్రాంతానికి చెందిన నితిన్ హైదరాబాద్‌లోని ఒక సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. రూ.30 వేల వేతనం. గ్రామంలో ఆస్తులు బాగానే ఉన్నాయి. మూడేళ్లుగా కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పటివరకూ సెట్ కాలేదు. పెళ్లి ప్రయత్నాలు సఫలం కాకపోవడంతో యువకుడు గ్రామానికి రావడానికి కూడా సిగ్గుపడుతున్నాడు. తల్లిదండ్రులకు ఏం చేయాలో కూడా పాలుపోవడం లేదు.
ఆనందపురం ప్రాంతానికి చెందిన యువకుడు ఆరేళ్ల కిందట న్యాయ విద్య పూర్తిచేశాడు. ప్రస్తుతం సొంతంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నాడు. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఐదేళ్ల నుంచి కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఇప్పటికీ కుదరలేదు.
...ఇదీ ప్రస్తుతం అబ్బాయిలు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఒకప్పుడు వయసుకు వచ్చిన అమ్మాయి ఇంట్లో ఉంటే ఎంత వేగంగా పెళ్లి చేసి అత్తవారింటికి పంపిద్దామా?...అని తల్లిదండ్రులు ఎదురుచూసేవాళ్లు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. అబ్బాయిలకు సంబంధాలు దొరకడం కష్టమైపోతోంది. ఒకప్పుడు అబ్బాయి గుణగణాలు, కుటుంబం గురించి తెలుసుకుని పిల్లనిచ్చేవారు. కానీ, ఇప్పుడు అబ్బాయి ఏం చదువుకున్నాడు?, ఏ కంపెనీలో పనిచేస్తున్నాడు?, ఎంత సంపాదిస్తున్నాడు?...అన్న అంశాలను చూస్తున్నారు. దీంతో యువకులకు పెళ్లి కావడం ఒకింత కష్టంగా మారుతోంది. గతంలో 25, 26 ఏళ్లు వచ్చేసరికి అబ్బాయిల్లో దాదాపు 80 శాతం మందికి పెళ్లిళ్లు అయిపోయేవి. కానీ, గడిచిన కొన్నాళ్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రెండు, మూడేళ్ల నుంచి సంబంధాలు చూస్తున్నా పెళ్లిళ్లు కావడం లేదు. దీంతో 30 ఏళ్లు దాటిన పెళ్లికాని ప్రసాద్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అన్ని సామాజిక వర్గాల్లోనూ ఇదే సమస్య నెలకొంది. అబ్బాయికి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒక పెద్ద యజ్ఞమే చేయాల్సి వస్తోంది.
గతంలో తల్లిదండ్రులు ఏదైనా సంబంధం చూస్తే అమ్మాయిలు మాట్లాడకుండా చేసుకునేవాళ్లు. కానీ, ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. అమ్మాయిల ఇష్టాయిష్టాలను కాదనలేని పరిస్థితి. అమ్మాయి ఓకే అంటే తప్ప పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో అమ్మాయిలు పూర్తి నాలెడ్జ్‌తో ఉంటున్నారు. మంచి వేతనం, సొంత ఇల్లు...వంటివి ఉన్నవారి వైపు మొగ్గు చూపిస్తున్నారు. అటువంటి సంబంధాలను వెతకమని కుటుంబ సభ్యులకు చెబుతున్నారు. విదేశీ సంబంధాలు అయితే మాత్రం అమ్మాయిలు ఒక్క క్షణం కూడా ఆలోచించడం లేదు. వెంటనే ఓకే చెప్పేస్తున్నారు.
ఈ పట్టింపులతో సమస్య
అబ్బాయిల తల్లిదండ్రుల వ్యవహారశైలి కూడా కొంతవరకూ ఈ సమస్యకు కారణమని చెప్పవచ్చు. మంచి కట్నకానుకలు ఆశించడం, అమ్మాయి అందంగా ఉండాలని, అణకువగా ఉండాలని కోరుకుంటూ మొదట్లో వచ్చిన సంబంధాలను కాదనుకుంటున్నారు. ఆ తరువాత వయసు దాటిపోతున్నా అబ్బాయిలకు పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి నెలకొంటోందని చెబుతున్నారు.
భిన్నమైన పరిస్థితి
గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలు చేసే అబ్బాయిలను కోరుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగం ఉన్న అబ్బాయితో పెళ్లి చేస్తే అమ్మాయి జీవితాంతం ఇబ్బంది ఉండదన్న భావన తల్లిదండ్రుల్లో ఉంటోంది. ప్రభుత్వ ఉద్యోగం కలిగిన అబ్బాయిలకు వేగంగానే వివాహాలు జరుగుతున్నాయి. అదే పట్టణ ప్రాంతాల్లోని అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ప్రభుత్వ ఉద్యోగులు లేదా సాఫ్ట్‌వేర్ సంబంధాలపై మొగ్గుచూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే మాత్రం ఎంత కట్నం ఇచ్చేందుకు కూడా అమ్మాయిలు తల్లిదండ్రులు వెనుకాడడం లేదు.
చిరుద్యోగాలు చేసుకునే అబ్బాయిలు, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకునేవారికి 35 ఏళ్లు దాటిపోతున్నా సంబంధాలు దొరకడం లేదు. ఈ పరిస్థితి ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఉందంటున్నారు. 30 ఏళ్లు దాటి వివాహం కోసం ఎదురుచూసే యువత సంఖ్య అన్ని రంగాల్లోనూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం, సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడిన కొందరు యువకులకు మాత్రమే దీని నుంచి మినహాయింపు లభిస్తోంది.
మానసిక సమస్యలు
పెళ్లికాకపోవడం వల్ల యువకులతోపాటు వారి తల్లిదండ్రులు మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారు. 30 ఏళ్లు దాటినా పెళ్లి కాకపోవడం వల్ల అబ్బాయిల్లో తీవ్ర అసహనం, నిరుత్సాహం వంటివి పెరిగిపోతున్నట్టు మానసిక వైద్యులు చెబుతున్నారు.
లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు
- ఎస్.సరోజ, లీగల్ కౌన్సిలర్, డీవీ సెల్
గతంతో పోలిస్తే ఉన్నత చదువులు పూర్తిచేస్తున్న అమ్మాయిల సంఖ్య పెరిగింది. వారు తమ స్థాయికి తగ్గ వారిని కోరుకుంటున్నారు. ఉద్యోగాలు చేసేవారు తమలాగే ఉద్యోగాలు చేసేవారిని ఎంపిక చేసుకుంటున్నారు. అన్నింటికీ మించి లగ్జరీ లైఫ్ కావాలనుకుంటున్నారు. తమ స్నేహితులు, బంధువులను చూసి వారి మాదిరిగా జీవితాన్ని ఉండాలని కోరుకుంటున్నారు. అటువంటి జీవితాన్ని ఇచ్చే స్థాయి ఉన్న అబ్బాయిలు దొరికితేనే పెళ్లికి ఓకే అంటున్నారు. లేకపోతే అంగీకరించడం లేదు. వీటితోపాటు అబ్బాయిల సంఖ్యకు అనుగుణంగా అమ్మాయిల సంఖ్య లేకపోవడం కూడా ఈ సమస్యకు కారణం.
మానసిక ఒత్తిడిలో తల్లిదండ్రులు
- డాక్టర్ ముత్యాల బాలాజీ, మానసిక నిపుణులు
అబ్బాయికి 30 ఏళ్లు దాటినా పెళ్లికాకపోవడాన్ని వారి తల్లిదండ్రులు నామోషీగా భావిస్తున్నారు. చాలామంది ఫంక్షన్లకు కూడా దూరంగా ఉంటున్నారు. సమాజంలో ఫ్రీగా ఉండలేకపోతున్నారు. అబ్బాయిల్లో కూడా నిరుత్సాహం, పెళ్లి పట్ల విరక్తి భావం పెరుగుతోంది. కొందరిలో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి వారిని గుర్తించి కౌన్సెలింగ్ ఇప్పించడం అత్యంత కీలకం. పెళ్లి అన్న దాన్ని పరువుగా భావించడం వల్లే అబ్బాయిలు, వారి తల్లిదండ్రుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయి.