క్రైమ్ రేటు పెరిగితే ఉపేక్షించేది లేదు
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:50 AM
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు పెరిగితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్‌కుమార్‌గుప్తా హెచ్చరించారు.

నగర పోలీస్ అధికారులకు డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా హెచ్చరిక
డ్రగ్స్, మత్తుమందుల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
రౌడీయిజం, భూకబ్జాలకు తావులేకుండా ముందస్తు వ్యూహాలు రూపొందించుకోండి
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో క్రైమ్ రేటు పెరిగితే ఉపేక్షించేది లేదని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) హరీష్‌కుమార్‌గుప్తా హెచ్చరించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన ఆదివారం నగర పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా సీఐ, అంతకంటే పైస్థాయి అధికారులతో పోలీస్ కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో సమీక్ష నిర్వహించారు. నగరంలో నమోదవుతున్న నేరాలు, వాటిని పరిష్కరిస్తున్న విధానం, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, గంజాయి రవాణా, విక్రయం, వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలుచేస్తున్న వ్యూహాలను సీపీ శంఖబ్రతబాగ్చి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డీజీపీకి వివరించారు. అనంతరం డీజీపీ హరీష్‌కుమార్‌గుప్తా మాట్లాడుతూ అత్యంత ప్రాముఖ్యత కలిగిన విశాఖ నగరంలో పోలీసింగ్‌ను సమర్థంగా నిర్వహించాలని సూచించారు. గంజాయి, డ్రగ్స్, మత్తుమందుల రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. రౌడీయిజం, భూకబ్జాలకు తావులేకుండా ముందస్తు వ్యూహాలను రచించి అమలు చేయాలన్నారు. అనంతరం శాఖాపరంగా ఉన్న సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో డీసీపీ-1 అజితా వేజెండ్ల, డీసీపీ-2 మేరీ ప్రశాంతి, అడ్మిన్ డీసీపీ, ఏడీసీపీలు, ఏసీపీలు, సీఐలు పాల్గొన్నారు.
Updated Date - Feb 10 , 2025 | 12:50 AM