Share News

మిరియాల నర్సరీల పెంపకానికి ఇదే అదను

ABN , Publish Date - Apr 09 , 2025 | 01:00 AM

మిరియాల నర్సరీల పెంపకానికి ఇదే అదను అని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 98 వేల ఎకరాల్లో రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులను మిరియాల పంట ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో ఐటీడీఏ, ఉద్యాన శాఖ అధికారులు మిరియాల సాగును విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

మిరియాల నర్సరీల పెంపకానికి ఇదే అదను
పరిశోధన స్థానంలో పెంపొందిస్తున్న నర్సరీ బ్యాగులు

- ప్రధాన మొక్కల నుంచి రన్నర్స్‌ సేకరణ

- రోజుల్లో నర్సరీల అభివృద్ధి

- జూలై నాటికి రైతులకు నూతన రకాలు

- హెచ్‌ఆర్‌యూ అధిపతి, శాస్త్రవేత్త చెట్టి బిందు

చింతపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): మిరియాల నర్సరీల పెంపకానికి ఇదే అదను అని చింతపల్లి ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జిల్లాలో ఆదివాసీ రైతులు కాఫీ తోటల్లో అంతర పంటగా మిరియాల సాగు చేపడుతున్నారు. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 98 వేల ఎకరాల్లో రైతులు మిరియాల పంటను సాగు చేస్తున్నారు. ఆదివాసీ రైతులను మిరియాల పంట ఆర్థికంగా ఆదుకుంటోంది. దీంతో ఐటీడీఏ, ఉద్యాన శాఖ అధికారులు మిరియాల సాగును విస్తరింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

నర్సరీలను ఎలా సిద్ధం చేసుకోవాలంటే..

మిరియాల నాట్లు వేసుకోవాలని ఆశించిన రైతులు తొలుత నర్సరీ బ్యాగులను సిద్ధం చేసుకోవాలి. బ్యాగుల్లో నింపుకునేందుకు అవసరమైన మట్టి మిశ్రమాన్ని ఎర్రమట్టి(మెత్తని మట్టి), పశువులగెత్తం, ఇసుక 1:1:1 నిష్పత్తిలో కలుపుకుని సిద్ధం చేసుకోవాలి. మిరియా నర్సరీలకు ప్రధాన మొక్క నుంచి రన్నర్స్‌ను తీసుకోవాలి. మొక్క అడుగు భాగంలో భూమికి సమాంతరంగా వ్యాప్తిచెందిన రన్నర్స్‌ను తీసుకోవాలి. రన్నర్‌ను రెండు కణుపులుండే విధంగా చిన్నకొమ్మలుగా కత్తిరించుకోవాలి. గాలి, వెలుతురు తగిలే విధంగా బ్యాగులను నీడలో పెట్టుకోవాలి. 90 రోజులు తరువాత జూలై- ఆగస్టు మాసాల్లో నాట్లు వేసుకోవాలి. నీడనిచ్చే చెట్లకు రెండువైపులా రెండు మొక్కలను నాటుకోవాలి. మొక్కలు నాటుకునేందుకు 45 సెంటీమీటర్లు లోతు, వెడల్పు, పొడవు కలిగిన గోతులు తవ్వుకోవాలి. గిరిజన ప్రాంతానికి పన్నీయూర్‌-1 రకం అనుకూలమని ఉద్యాన శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా నిరూపించారు. ఎకరాకు 500 కిలోలు పైబడి మిరియాలు దిగుబడి వస్తుంది.

మిరియాల తోటల సస్యరక్షణ

మిరియాల తోటల్లోనూ సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. ప్రధానంగా మిరియాల మొక్కలు చుట్టూ పెరిగిన కలుపును తొలగించుకోవాలి. అలాగే ఆకుమచ్చ తెగులు, మొదలు కుళ్లు తెగులు నియంత్రించుకునేందుకు బోర్డో మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవాలి. అలాగే ట్రైకోడెర్మవిరిడి కలిపిన పశువుల గెత్తం మిశ్రమం మొక్కలకు 2-3కిలోలు పెట్టుకోవాలి.

Updated Date - Apr 09 , 2025 | 01:00 AM