ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విహారంలో విషాదం

ABN, Publish Date - Jan 16 , 2025 | 01:46 AM

పండుగ సందర్భంగా మండలంలోని రేవుపోలవరం సముద్రతీరంలో సరదాగా గడుపుదామని వచ్చిన వారికి తీవ్ర విషాదం ఎదురైంది.

రేవుపోలవరం వద్ద సముద్రంలో ఇద్దరు గల్లంతు

బాలుడి మృతి, జాడలేని యువకుడు

సరదాగా గడపడానికి కాకినాడ జిల్లా నుంచి రాక

ఎస్‌.రాయవరం, జనవరి 15 (ఆంధ్రజ్యోతి):

పండుగ సందర్భంగా మండలంలోని రేవుపోలవరం సముద్రతీరంలో సరదాగా గడుపుదామని వచ్చిన వారికి తీవ్ర విషాదం ఎదురైంది. నీటిలో దిగి స్నానాలు చేస్తుండగా ఆకస్మికంగా అలలు ఎగిసి పడడంతో ఇద్దరు వ్యక్తులు నీటిలో మునిగిపోయారు. వీరిలో ఒకరిని ఒడ్డుకు తీసుకువచ్చి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందాడు. మరొకరు గల్లంతయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి నక్కపల్లి సీఐ రామకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.

కాకినాడ జిల్లా తుని మండలం లోవకొత్తూరు గ్రామానికి చెందిన పలువురు కుటుంబాలతో సహా బుధవారం ఉదయం రేవుపోలవరం సముద్రతీరం వద్దకు వచ్చారు. మధ్యాహ్నం భోజనాలు చేసిన అనంతరం సముద్ర తీరంలో సరదాగా గడుపుతున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెరిగిన అలల తాకిడితో బాషణపోయిన సాత్విక్‌(10) నీటిలో మునిగిపోయాడు. ఇది గమనించిన కాకర్ల మణికంఠ (23).. సాత్విక్‌ను రక్షించడానికి వెళ్లాడు. అలల ఉధృతి మరింత పెరగడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. తీరంలో వున్న వారు పెద్దగా కేకలు వేయడంతో సమీపంలో వున్న మత్స్యకారులు వచ్చి సాత్విక్‌ను బయటకు తీసుకువచ్చారు. సీపీఆర్‌ చేసి, నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు చెప్పారు. సముద్రంలో గల్లంతైన మణికంఠ కోసం మత్స్యకారుల సహాయంతో మెరైన్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న నక్కపల్లి సీఐ రామకృష్ణ, మెరైన్‌ ఎస్‌ఐ రత్నశేఖర్‌తో కలిసి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. సాయంత్రం ఆరు గంటల వరకు గాలించినా ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. కాగా సాత్విక్‌ మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రి మార్చురీకి తరలించినట్టు పోలీసులు చెప్పారు.

లోవకొత్తూరు గ్రామానికి చెందిన రాము, సరోజని దంపతుల కుమారుడైన సాత్విక్‌ నాలుగో తరగతి చదువుతున్నాడు. గల్లంతైన మణికంఠ పత్తిపాడు మండలం సింహాద్రిపురం గ్రామానికి చెందిన రాము, పార్వతి దంపతుల కుమారుడు. మణికంఠ పండగ సందర్భంగా లోవకొత్తూరులో ఉన్న తన మేనమామ ఇంటికి వచ్చాడు. గ్రామస్థులతో కలిసి రేవుపోలవరం వచ్చి సముద్రంలో గల్లంతయ్యాడు. ఈ సంఘటనతో విహార యాత్ర విషాదంగా మారింది. ఈ ప్రమాదంపై ఎస్‌.రాయవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 16 , 2025 | 01:46 AM