వృథాగా గోదాము

ABN, Publish Date - Mar 15 , 2025 | 12:53 AM

మండల కేంద్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పౌరసరఫరాల గోదాము నిరుపయోగంగా పడివుంది. రాత్రిపూట మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రధాన రహదారి నుంచి గోదాము వరకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

వృథాగా గోదాము
నిరుపయోగంగా పడివున్న పౌరసరఫరాల గోదాము

రావికమతంలో రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మించిన పౌరసరఫరాల శాఖ

రహదారి సదుపాయం లేకపోవడంతో ప్రారంభించని అధికారులు

మందుబాబులకు అడ్డాగా మారిన గోదాము

రావికమతం, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో లక్షలాది రూపాయలు వెచ్చించి నిర్మించిన పౌరసరఫరాల గోదాము నిరుపయోగంగా పడివుంది. రాత్రిపూట మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ప్రధాన రహదారి నుంచి గోదాము వరకు రోడ్డు సదుపాయం లేకపోవడంతో వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు చెబుతున్నారు.

రావికమతం, బుచ్చెయ్యపేట మండలాల్లో పేదలకు పంపిణీ చేసే బియ్యం, పంచదార, కందిపప్పు, ఇతర నిత్యావసర సరకులను నిల్వ చేయడానికి స్థానిక మండల పరిషత్‌ కార్యాలయం ఆవరణలో సుమారు 40 ఏళ్ల క్రితం గోదాము (ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌) నిర్మించారు. ప్రతి నెలా ఇక్కడి నుంచే రెండు మండలాల రేషన్‌ డిపోలకు ఆయా సరకులు సరఫరా అవుతుంటాయి. అయితే కాలక్రమేణా గోదాము పైకప్పు దెబ్బతినడంతో వర్షం వస్తే నీరు కారిపోయి సరకులు తడిసిపోతున్నాయి. పైగా ఏటేటా రేషన్‌ కార్డుదారులు పెరుగుతుండడంతో సరకులు నిల్వ చేయడానికి గోదాము చాలడంలేదు. దీంతో కొత్తగా మరింత పెద్ద గోదాము నిర్మించాలని 2018లో పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్ణయించారు. రావికమతం- మేడివాడ మధ్యలో అగ్నిమాపక కేంద్రం వెనుక రెండు వేల టన్నుల నిల్వ సామర్థ్యంతో గోదాము నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. విజయవాడకు చెందిన ఒక కాంట్రాక్టర్‌ గోదాము నిర్మాణ పనుల టెండర్‌ను దక్కించుకున్నారు. పనులు మొదలయ్యేసరికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్‌ పలుమార్లు పనులు ఆపేయాల్సి వచ్చింది. ఎట్టకేలకు 2023లో గోదాము నిర్మాణం పూర్తయ్యింది. అయితే గోదాం వద్ద లారీలు మళ్లేందుకు తగ్గిన ఖాళీ స్థలం లేదు. ఇంకా బీఎన్‌ రోడ్డు నుంచి గోదాము వరకు సుమారు 400 మీటర్ల మేర రోడ్డు సదుపాయం లేదు. దీంతో గోదాము వినియోగంలోకి రాలేదు. అధికారులు సైతం పట్టించుకోలేదు. శివారున ఉండడంతో మందుబాబులకు అడ్డాగా మారింది. పగటి పూట కూడా ఇక్కడ మద్యం సేవిస్తున్నారు.

కాగా గోదాము నిరుపయోగంగా పడి వుండడంపై పౌర సరఫరాల జిల్లా మేనేజర్‌ జయంతిని ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా.. గోదాము చుట్టూ లారీలు తిరగడానికి రోడ్డు లేదని, ఇక్కడ విధులు నిర్వహించే ఉద్యోగులు, పనిచేసే కలాసీలకు తాగునీరు, మరుగుదొడ్లు లేవని, అంటేకాక బీఎన్‌ రోడ్డు నుంచి గోదాం వరకు లారీల రాకపోకలకు రోడ్డు సదుపాయం లేదన్నారు. ఈ పనులకు అవసరమైన నిధుల కోసం ఇంజనీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని చెప్పారు. నిధులు మంజూరైతే పనులు పూర్తిచేయించి గోదామును వినియోగంలోకి తెస్తామని ఆమె తెలిపారు.

Updated Date - Mar 15 , 2025 | 12:53 AM