కరక కథ కంచికేనా!

ABN, Publish Date - Mar 14 , 2025 | 01:05 AM

గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలోకి అనుమతులు లేకుండా సర్వేకి వెళ్లిన మైనింగ్‌ అధికారులపై అటవీ అధికారులు చర్యలు తీసుకోకుండా షోకాజ్‌ నోటీసులతో తాత్సారం చేస్తున్నారు. ఇద్దరు రంగురాళ్ల వ్యాపారులతోపాటు మైనింగ్‌ అధికారులను కరక రిజర్వ్‌ ఫారెస్టులోకి పంపిన పెద్దలు ఎవరు? ఎందుకు సర్వే చేయాలని అనుకున్నారు? అన్న విషయాలు బయటకు పొక్కడం లేదు.

కరక కథ కంచికేనా!
గొలుగొండ మండలం కరక రిజర్వు అటవీ ప్రాంతం (ఫైల్‌ ఫొటో)

రంగురాళ్ల క్వారీలోకి మైనింగ్‌ సిబ్బందితోపాటు ప్రైవేటు వ్యక్తులు అక్రమ చొరబాటు

అటవీ శాఖ అనుమతులు లేకుండా రిజర్వు ఫారెస్టులో సంచారం

అడ్డుకున్న సిబ్బంది, రేంజర్‌కి సమాచారం

చోరబాటుదారులకు గత నెలలో నోటీసులు

వివరణ సరిగా లేదంటూ వారం క్రితం మరో నోటీసులు

తెరవెనుక పెద్దలు ఉండడంతో చర్యలకు వెనకడుగు

నర్సీపట్నం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): గొలుగొండ మండలం కరక రంగురాళ్ల క్వారీలోకి అనుమతులు లేకుండా సర్వేకి వెళ్లిన మైనింగ్‌ అధికారులపై అటవీ అధికారులు చర్యలు తీసుకోకుండా షోకాజ్‌ నోటీసులతో తాత్సారం చేస్తున్నారు. ఇద్దరు రంగురాళ్ల వ్యాపారులతోపాటు మైనింగ్‌ అధికారులను కరక రిజర్వ్‌ ఫారెస్టులోకి పంపిన పెద్దలు ఎవరు? ఎందుకు సర్వే చేయాలని అనుకున్నారు? అన్న విషయాలు బయటకు పొక్కడం లేదు.

మైనింగ్‌ రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ సత్యమూర్తి, మైనింగ్‌ జియాలజీ విభాగానికి చెందిన పోతి శివకుమార్‌, సిబ్బంది కూర్మదాసు అప్పలనాయుడు, వి.వీరనాగేశ్వరరావు, జి.రామచంద్రరావు జనవరి 31వ తేదీన గొలుగొండ మండలం సాలికమల్లవరం గ్రామానికి చెందిన రంగురాళ్ల వ్యాపారులు కె.కొండలరావు, అల్లు నూకరాజులతో కలిసి రిజర్వ్‌ఫారెస్టు పరిధిలోని కరక కొండ ఎక్కారు. కొండ మీద బేస్‌ క్యాంప్‌ సిబ్బంది వారిని అడ్డుకొని నర్సీపట్నం రేంజర్‌కి సమాచారం ఇచ్చారు. మైనింగ్‌ అధికారులతో సహా ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను రేంజ్‌ కార్యాలయానికి తరలించారు. రెండు రోజులపాటు విచారణ చేశారు. అమరావతిలోని గనులు, భూగర్భ శాఖ ఓఎస్‌డీ ఆదేశాలతోనే కొరక కొండ మీదకు రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌ని, సిబ్బందిని కరక కొండ మీదకు పంపాని నర్సీపట్నం మైనింగ్‌ ఏడీ మీడియాకు చెప్పడం సంచలనంగా మారింది. దీనినిబట్టి కరక రంగురాళ్ల తవ్వకాలకు పెద్దస్థాయిలోనే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలో ఉన్న కరక కొండను డీనోటిఫై చేయడానికి పెద్దలు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది. అయితే జిల్లా అటవీ అధికారి శామ్యూల్‌ ఈ ప్రచారాన్ని కొట్టి పడేస్తున్నారు. పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితే తప్ప డీనోటిఫై చేయడం సాధ్యం కాదని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.

సమాధానానికి సంతృప్తి చెందని అటవీ అధికారులు....

కేంద్ర ప్రభుత్వ నిషేధాజ్ఞలు అమలులో ఉన్న కరక రిజర్వ్‌ ఫారెస్టులోకి ముందస్తు అనుమతి లేకుండా అడుగుపెట్టిన మైనింగ్‌ అధికారులకు, అటవీ శాఖ రేంజ్‌ అధికారి లక్ష్మీనర్సు గత నెలలో షోకాజ్‌ నోటీసులు ఇచ్చారు. పదిహేను రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే మైనింగ్‌ అధికారులు ఇచ్చిన సమాధానానికి సంతృప్తి చెందని రేంజ్‌ అధికారి.. వారం రోజుల క్రితం మరో నోటీసు జారీ చేశారు. గార్డుకి చెప్పి కరక కొండ ఎక్కినట్టు మైనింగ్‌ అధికారులు సమాధానంలో పేర్కొన్నారని, గార్డుని విచారిస్తే.. తనను అడగ లేదని అంటున్నాడని రేంజర్‌ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖ ఉన్నతాధికారుల నుంచి అనుమతులు ఉంటే తగిన ఆధారాలు చూపించాలని మైనింగ్‌ ఏడీని కోరారు. రెండో నోటీసుకి మైనింగ్‌ అధికారులు ఇచ్చిన సమాధానాన్నిబట్టి తదుపరి చర్యలు ఉంటాయని అటవీ అధికారులు అంటున్నారు.

Updated Date - Mar 14 , 2025 | 01:05 AM