క్రెబ్స్‌పై కొరడా
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:28 AM
అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో ఉన్న క్రెబ్స్ బయో కెమికల్ కంపెనీని మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) ఆదేశించింది. కంపెనీలో ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రమాదకర ఘన, జల వ్యర్థాలను విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని పొలాల్లో పారబోయడాన్ని పీసీబీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై కంపెనీకి ఏపీపీసీబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ తరువాత ఉత్పత్తుల నిలిపివేత, కంపెనీ మూసివేతకు ఈ నెల 7న సభ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

- కెమికల్ కంపెనీని మూసివేయాలని కాలుష్య నియంత్రణ మండలి ఆదేశం
- విజయవాడ శివారున వ్యర్థాలను పారబోసినట్టు విచారణలో నిర్ధారణ
- తొలుత షోకాజ్ నోటీసు.. తరువాత మూసివేతకు ఆదేశం
విశాఖపట్నం, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో ఉన్న క్రెబ్స్ బయో కెమికల్ కంపెనీని మూసివేయాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి(ఏపీపీసీబీ) ఆదేశించింది. కంపెనీలో ఉత్పత్తుల ద్వారా వచ్చే ప్రమాదకర ఘన, జల వ్యర్థాలను విజయవాడ రూరల్ మండలం జక్కంపూడిలోని పొలాల్లో పారబోయడాన్ని పీసీబీ తీవ్రంగా పరిగణించింది. దీనిపై కంపెనీకి ఏపీపీసీబీ షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఆ తరువాత ఉత్పత్తుల నిలిపివేత, కంపెనీ మూసివేతకు ఈ నెల 7న సభ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
క్రెబ్స్ బయో కెమికల్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌లో పలు రకాల రసాయన ఉత్పత్తులు తయారు చేస్తున్నారు. ఈ ఉత్పత్తులు కొన్నింటిని సిమెంట్ తయారీకి ముడి సరకుగా వాడతారు. ఈ క్రమంలో కంపెనీ నుంచి ఎప్పటికప్పుడు లారీల్లో ఉత్పత్తులు కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సిమెంట్ కంపెనీకి రవాణా చేస్తుంటారు. అయితే కంపెనీలో ఉత్పత్తులు తయారీ సమయంలో వచ్చే ఘన, జల వ్యర్థాలను యాజమాన్యం శుద్ధి చేయాల్సి ఉంది. కానీ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధి చేసే ప్లాంట్‌కు వెళ్లాల్సిన లారీ ఒకటి ఈ నెల 3న కృష్జా జిల్లా విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామ సమీపంలో పొలాల్లో వ్యర్థాలను పారబోసింది. దీనిపై పత్రికల్లో కథనాలు రావడంతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తనిఖీ చేసి ల్యాబ్‌కు పంపగా, అటువంటి ఫార్ములాతో ఉత్పత్తులు చేసేది క్రెబ్స్ కంపెనీగా గుర్తించారు. వెంటనే విజయవాడలోని పీసీబీ అధికారులు విశాఖలోని పీసీబీ అఽఽధికారులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో విశాఖలో ప్రాంతీయ పర్యావరణాధికారి పి.ముకుందరావు, ఇతర అధికారులు నేరుగా కంపెనీని తనిఖీ చేసి ఉత్పత్తులను పరిశీలించారు. విజయవాడ దరిలో పారబోసిన వ్యర్థాలు క్రెబ్స్ కంపెనీవిగా నిర్ధారించి షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులకు నివేదిక పంపారు. దీంతో ఈ నెల 7న సభ్య కార్యదర్శి శరవన్ కొత్తపల్లిలో క్రెబ్ కంపెనీ మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కంపెనీపై అనేక ఫిర్యాదులు
క్రెబ్స్ బయో కెమికల్ కంపెనీపై చాలా కాలంగా ఫిర్యాదులు వస్తున్నాయి. కంపెనీ నుంచి వచ్చే దుర్గంధంతో సమీపంలోని కేజీబీవీ పాఠశాల, తేగాడలో మోడల్ స్కూల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ జలాలను శుద్ధిచేయకుండా శారదా నదిలోకి విడిచిపెట్టడం, కంపెనీని ఆనుకుని గొయ్యిలో నింపుతున్నారు. దీంతో భూగర్భ జలాలు కలుషితం కావడంతో కంపెనీ సమీపంలోని గంటవానిపాలెం గ్రామస్థులు గతంలో ఆందోళనలు చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పీసీబీ అధికారులు తనిఖీలు చేసి 2023 డిసెంబరులో ఒకసారి కంపెనీని మూసివేయాలని ఆదేశించారు. తరువాత పీసీబీ నిబంధనల మేరకు కంపెనీ కొన్ని దిద్దుబాటు చర్యలు తీసుకోవడంతో గత ఏడాది జనవరిలో తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి అనుమతించారు. తాజాగా కంపెనీ నుంచి వ్యర్థాలు విజయవాడ రూరల్‌లోని జక్కంపూడిలో పారబోయడంతో విచారణ జరిపిన పీసీబీ మరోసారి మూసివేతకు ఆదేశాలు ఇచ్చింది.
Updated Date - Feb 10 , 2025 | 12:28 AM