అనకాపల్లి ఏఎంసీ పీఠం ఎవరికో!?

ABN, Publish Date - Apr 07 , 2025 | 12:13 AM

జాతీయ స్థాయిలో రెండో అతి పెద్ద బెల్లం మార్కెట్‌గా గుర్తింపు పొందిన అనకాపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నియామకం కోసం కూటమి నాయకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను నియమించింది. జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులు వుండగా, తొలివిడతలో నర్సీపట్నం, ఎలమంచిలి, మలి విడతలో పాయకరావుపేట మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను నియమించిన విషయం తెలిసిందే.

అనకాపల్లి ఏఎంసీ పీఠం ఎవరికో!?
అనకాపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యాలయం

టీడీపీ, జనసేనల నుంచి పలువురు ఆశావహులు

ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్న నేతలు

మూడో విడత పదవుల భర్తీలో ‘అనకాపల్లి’కి చోటు ఉంటుందని అంచనా

అనకాపల్లి టౌన్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి):

జాతీయ స్థాయిలో రెండో అతి పెద్ద బెల్లం మార్కెట్‌గా గుర్తింపు పొందిన అనకాపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ పాలకవర్గం నియామకం కోసం కూటమి నాయకులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం రెండు విడతల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 90 వరకు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను నియమించింది. జిల్లాలో ఆరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులు వుండగా, తొలివిడతలో నర్సీపట్నం, ఎలమంచిలి, మలి విడతలో పాయకరావుపేట మార్కెట్‌ కమిటీలకు చైర్మన్‌/ చైర్‌పర్సన్‌లను నియమించిన విషయం తెలిసిందే. అయితే దురదృష్టవశాత్తూ నర్సీపట్నం ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన రుత్తల శేషుకుమార్‌ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మరుసటి రోజే మృతిచెందారు. దీంతో నర్సీపట్నంతోపాటు జిల్లాలో మిగిలిన మూడు.. అనకాపల్లి, చోడవరం, మాడుగుల ఏఎంసీలకు చైర్‌పర్సన్‌లను, మొత్తం ఆరింటికి పాలకవర్గ సభ్యులను నియమించాల్సి వుంది. నర్సీపట్నం, చోడవరం, మాడుగులలో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండగా, అనకాపల్లిలో వైసీపీ ఎమ్మెల్యే వున్నారు. గతంలో చైర్మన్లను ప్రకటించిన మూడు ఏఎంసీల్లో రెండు టీడీపీ, ఒకటి జనసేనకు కేటాయించారు. ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంబంధిత పార్టీల ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏఎంసీ పాలకవర్గాలు భర్తీ చేయాల్సిన అనకాపల్లిలో జనసేన, మిగిలినచోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు వున్నారు. ఆయా ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన వారినే ఏఎంసీ చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తున్నది. మిగిలిన ఏఎంసీలకు కూడా అతి త్వరలోనే పాలకవర్గాలను నియమించనున్నట్టు ప్రభు త్వం ప్రకటించిన నేపథ్యంలో అనకాపల్లి చైర్మన్‌ పదవి రేసులు పలువురు ఆశావహులు వున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి కశికోట మండలానికి చెందిన ఉగ్గిన రమణమూర్తి, కాయల మురళి, గొంతిన శ్రీనివాసరావు, అనకాపల్లి నుంచి తలారి లక్ష్మీప్రసాద్‌, రమణ(కొండుపాలెం), జనసేన పార్టీ నుంచి చదరం నాగేశ్వరరావు, కె.సత్యనారాయణ ఏఎంసీ చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్టు తెలిసింది. టీడీపీకి చెందిన పీలా గోవింద, మళ్ల సురేంద్ర రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవులకు చైర్మన్లుగా వున్నారు. జనసేనకు చెందిన పీలా నాగశ్రీను ప్రసిద్ధ నూకాంబిక అమ్మవారి ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఏఎంసీ చైర్మన్‌ పదవిని తమకే కేటాయించాలని రెండు పార్టీల నేతలు ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. కాగా బీజేపీకి చెందిన సీఎం రమేశ్‌ అనకాపల్లి ఎంపీగా వున్నారని, అందువల్ల ఒక్క నామినేటెడ్‌ పదవి అయినా తమకు తమకు కేటాయించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్టు తెలిసింది.

Updated Date - Apr 07 , 2025 | 12:13 AM