Share News

పరీక్షల నిర్వహణ గాడిన పడేనా?

ABN , Publish Date - Apr 15 , 2025 | 01:11 AM

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూర విద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే పలు కోర్సులకు ఈ నెల 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.

పరీక్షల నిర్వహణ  గాడిన పడేనా?

  • 21 నుంచి ఏయూ దూరవిద్య ఎగ్జామ్స్‌

  • ఈమధ్య నిర్వహించిన పరీక్షల్లో అనేక కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌

  • ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో విచారణకు కమిటీ

  • ‘డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌’లో చక్రం తిప్పుతున్న చిరు ఉద్యోగి

  • అబ్జర్వర్ల నియామక బాధ్యతలు అతడివే

  • ఇప్పటికే భారీగా ముడుపులు దండినట్టు ప్రచారం

విశాఖపట్నం, ఏప్రిల్‌ 14 (ఆంధ్రజ్యోతి):

ఆంధ్ర విశ్వవిద్యాలయం పరిధిలోని దూర విద్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించే పలు కోర్సులకు ఈ నెల 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు నిర్వహించే కొన్ని కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల జరిగిన పీజీ పరీక్షల్లోనూ మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది. స్పందించిన వర్సిటీ అధికారులు ఒక కమిటీని కూడా వేశారు. ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ పరీక్షలు ప్రారంభమవుతుండడంతో మరోసారి మాస్‌ కాపీయింగ్‌ అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 21 నుంచి 25 వరకూ డిగ్రీ, పీజీ విద్యార్థులకు మొదటి సెమిస్టర్‌, ఎంబీఏ విద్యార్థులకు నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించనున్నారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు షెడ్యూల్‌ విడుదల చేశారు. పరీక్షల నిర్వహణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అబ్జర్వర్లును నియమిస్తుంటారు. వీరి నియామకాన్ని ఇక్కడ పనిచేసే ఒక చిన్న ఉద్యోగి నిర్ణయిస్తుండడం విశేషం. ఇందుకోసం ఆయా కాలేజీల నుంచి భారీగానే ముడుపులు వసూలు చేస్తారనే ఆరోపణలు ఉన్నాయి. దూర విద్యలో ఆ చిరు ఉద్యోగికి తెలియకుండా ఏమీ జరగదు.

విచారణ తూతూ మంత్రమేనా.?

దూరవిద్య పరీక్ష కేంద్రాలు క్రమంగా పెంచుకుంటూ వచ్చారు. ఇందుకు అనేక కాలేజీలు భారీగానే ముట్టజెప్పాయన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సుమారు 80 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనేక కేంద్రాల్లో మాస్‌ కాపీయింగ్‌ యథేచ్ఛగా సాగుతోంది. కొన్నిచోట్ల పరీక్షలను విద్యార్థులకు బదులుగా ఇతరులతో రాయిస్తున్నారు. గత నెలాఖరు నుంచి ఈ నెల మొదటి వారం వరకు జరిగిన పరీక్షల్లోనూ కొన్ని కేంద్రాల్లో పెద్దఎత్తున మాస్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఏయూ వీసీ ప్రొఫెసర్‌ జీపీ రాజశేఖర్‌ విచారణకు కమిటీని వేశారు. సైన్స్‌ కాలేజీ పిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ ఎంవీఆర్‌ రాజు సారథ్యంలో ఏర్పాటైన కమిటీ విచారణ జరుపుతోంది. ఈ కమిటీ కొత్తవలసలోని వాగ్దేవి కాలేజీపై మాత్రమే విచారణ జరుపుతోంది. మిగిలిన కాలేజీల్లో వ్యవహారాలపై దృష్టిసారించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 80 కేంద్రాల్లో మూడొంతుల సెంటర్లలో ఇదే తరహాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. కొత్తవలసలో మరో కాలేజీతోపాటు గజపతినగరం, తాడేపల్లిగూడెం, ఎస్‌.కోట, సబ్బవరం, పాయకరావుపేట, నర్సీపట్నం, అనంతపురంలోని కేంద్రాలపైనా ఆరోపణలు వచ్చాయి. గోదావరి జిల్లాల్లోని ఒక కాలేజీలో పరీక్షల నిర్వహణకు భవనాలు లేవు. కానీ అక్కడ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ప్రక్షాళన చేస్తారా?

ఏయూ దూరవిద్యను ప్రక్షాళన చేయాలని పలువురు పేర్కొంటున్నారు. ఏళ్ల తరబడి పాతుకుపోయిన సిబ్బందితో సమస్యలున్నాయని ఉన్నతాధికారులే చెబుతున్నారు. కొందరి సీట్లు మార్చాలని ఆయన కోరినా గత ఇన్‌చార్జి వీసీ పట్టించుకోలేదు. ప్రస్తుత వీసీ జీపీ రాజశేఖర్‌ దృష్టిసారిస్తే మరిన్ని వ్యవహారాలు వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు.

Updated Date - Apr 15 , 2025 | 01:11 AM