ఇండోర్ స్టేడియం పూర్తయ్యేనా?
ABN, Publish Date - Feb 10 , 2025 | 12:36 AM
చింతపల్లిలో ఇండోర్ స్టేడియం అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫలితంగా ఇది పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణాల్లో కదలిక వస్తుందని క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

- ఐదేళ్లూ పైసా విదల్చని వైసీపీ ప్రభుత్వం
- అసంపూర్తి నిర్మాణాలతో దర్శనం
- నిరాశలో ఆదివాసీ క్రీడాకారులు
- కూటమి ప్రభుత్వంపైనే ఆశలు
చింతపల్లి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): చింతపల్లిలో ఇండోర్ స్టేడియం అసంపూర్తి నిర్మాణాలతో దర్శనమిస్తోంది. వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో రూపాయి కూడా విడుదల చేయలేదు. ఫలితంగా ఇది పిల్లర్ల స్థాయిలోనే నిలిచిపోయింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నిర్మాణాల్లో కదలిక వస్తుందని క్రీడాకారులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
చింతపల్లిలో ఇండోర్ క్రీడలు నిర్వహించేందుకు అత్యాధునిక సదుపాయాలతో స్టేడియం నిర్మించాలని నాటి తెలుగుదేశం ప్రభుత్వం 2018లో రూ.80 లక్షలు విడుదల చేసింది. నిర్మాణ బాధ్యతలు పొందిన కాంట్రాక్టర్ పునాదులు, పిల్లర్ల వరకు నిర్మించారు. ఈ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం రూ.16 లక్షల బిల్లులు విడుదల చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇండోర్ స్టేడియంపై శీతకన్ను వేసింది. బిల్లులు సక్రమంగా అందడం లేదని, పెట్టుబడి పెట్టి స్టేడియం పనులు చేసినా బిల్లులు వస్తాయో? లేదోనన్న సందిగ్ధంతో కాంట్రాక్టర్ పనులు కొనసాగించకుండా నిలిపివేశారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో 2022లో ఈ టెండర్‌ను గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు రద్దు చేశారు. ఇండోర్ స్టేడియం నిర్మాణాలు కొనసాగించేందుకు నిధులు విడుదల చేయాలని అధికారులు పలుమార్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినప్పటికీ స్పందన కరువైంది. దీంతో అసంపూర్తి నిర్మాణాలతో ఇండోర్ స్టేడియం దర్శనమిస్తున్నది. ప్రస్తుతం సాయంత్రం వేళల్లో మందుబాబులకు అడ్డాగా మారింది. ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తుందని సంబరపడిపోయిన ఆదివాసీ క్రీడాకారులు వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు.
అదనపు నిధులు అవసరం
ఐదేళ్లుగా ఇండోర్ స్టేడియం పూర్తి చేయకపోవడంతో నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ప్రస్తుతం ఇండోర్ స్టేడియం నిర్మాణాలు పూర్తి చేసేందుకు అదనపు నిధులు అవసరం. కాంట్రాక్టర్లు ముందుకు రావాలంటే ప్రస్తుత ధరకు అనుగుణంగా ప్రభుత్వం అదనపు నిధులు కేటాయించాలి. కూటమి ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని క్రీడాకారులు కోరుతున్నారు.
ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే..
ఇండోర్ స్టేడియం అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జిల్లాలో ఎక్కడా ఇండోర్ స్టేడియం అందుబాటులో లేదు. ఇండోర్ స్టేడియంలో షటిల్, టేబుల్‌టెన్నిస్, క్యారమ్స్, చెస్, తదితర క్రీడలు నిర్వహించేందుకు ప్రత్యేక విభాగాలు ఉంటాయి. పురుషులు, స్త్రీలకు వేర్వేరుగా మరుగుదొడ్లు, డ్రెస్సింగ్ రూమ్స్, విశ్రాంతి గదులు కూడా ఇండోర్ స్టేడియంలో నిర్మాణం జరగనుంది. జిల్లా, రాష్ట్ర స్థాయి ఇండోర్ క్రీడల పోటీలు ఇక్కడ నిర్వహించే వెసులుబాటు ఉంటుంది.
Updated Date - Feb 10 , 2025 | 12:36 AM